Published : 24 Jan 2022 00:11 IST

స్వచ్ఛమైన ఆనందం

ఈ ప్రపంచంలో అందరూ ఆనందంగా జీవించాలనుకుంటారు. ఆనందం కోసం బాహ్య విషయాలతో సంబంధాలు పెట్టుకుంటారు. ప్రాపంచిక సుఖాల కోసం ఆరాటపడతారు. వాటిని పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. తమ ప్రయత్నాలు ఫలిస్తే ఆనందిస్తారు. లేకపోతే దుఃఖిస్తారు.

ప్రాపంచిక సుఖాలన్నీ శారీరక సుఖాన్ని కలిగిస్తాయి. కాని మానసికమైన ఆనందాన్ని ఇవ్వలేవు. భోగభాగ్యాలు, సిరిసంపదలు ఇచ్చే ఆనందం తాత్కాలికమే. అందుకే ఏది మనసుకు శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుందో అది గ్రహించడమే విజ్ఞత.

అధికారం, ధనం, ఆడంబరమైన జీవితం మనసుకు ఆనందం కలిగిస్తాయని కొందరు అపోహపడతారు. నిజానికి ఇవన్నీ భౌతిక సంపదలు. చంచలమైనవి. శాశ్వతం కానివి. ఇవి మాయమైన మరుక్షణంలోనే మనిషి అంతులేని క్షోభకు గురవుతాడు. స్వచ్ఛమైన, శాశ్వతమైన ఆనందం పొందాలంటే మనిషి అల్ప సంతోషిత్వం అలవరచుకోవాలి. కోరికలను అదుపుచేసుకుని ఉన్నదాంట్లో సంతృప్తిగా జీవించాలి. ఏ సమయంలో ఏది లభ్యమైతే దానితోనే తృప్తిపడాలి. అటువంటి అల్ప సంతోష భావన అభ్యాసంతోనే సాధ్యపడుతుంది. అదే ‘ఆనంద సిద్ధి’ అని పండితులు చెబుతారు.

తామర పువ్వు మడుగులో ఉన్నా మట్టి అంటకుండా స్వచ్ఛంగా ఉంటుంది. మనిషి కూడా గతం గురించి ఆలోచించకుండా, భవిష్యత్తు గురించి ఆందోళనపడకుండా నిర్మల మనస్కుడై ఉండాలి. అప్పుడే అతడు వర్తమానంలో ప్రతిక్షణాన్ని ఆనందంగా ఆస్వాదించగలుగుతాడు. పరిమితమే అయినప్పటికీ, నది నీరు ప్రవాహంగా మారి సర్వప్రాణులకు ఉపయుక్తమవుతుంది. మనిషి తనకు కలిగిన సంపదను సద్వినియోగం చేస్తేనే అసలైన ఆనందాన్ని పొందుతాడు. చిన్న సమీరానికి సంతసించి పిల్ల కాలువ సవ్వడిగా గలగలమంటుంది. అదేవిధంగా స్వచ్ఛమైన ఆనందానికి ప్రేమపూరితమైన చిన్న మాట, చిన్న సహాయం చాలు. ఆనందం అనేది ఆహ్లాదకరమైన, అద్భుతమైన మానసిక స్థితి. ఎటువంటి షరతులు లేని ప్రేమ ఉన్నప్పుడే ఆ ఆనందం సాధ్యపడుతుంది.
పూవులా స్వచ్ఛంగా, మేఘంలా నిర్మలంగా, నదిలా ఉత్సాహంగా ఉన్న మనిషి నిరంతరం ఆనందాన్ని పొందుతాడు. అందుకే మనిషి కామక్రోధాది అరిషడ్వర్గాలనే వ్యతిరేక భావాలను వదిలించుకోవాలి. ఈర్ష్యాద్వేషాలు, దురభిమానం, అహంకారాన్ని దూరం చేసుకోవాలి. దయ, సానుభూతి, క్షమలను పెంపొందించుకోవాలి. అంతేకాకుండా వాక్‌ శుద్ధి, మనశ్శుద్ధి, క్రియా శుద్ధి, శరీర శుద్ధికి మనిషి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవే మనిషికి మనశ్శాంతిని, ఆనందాన్ని కలిగిస్తాయి.

ఆనందం అనేది వెతికితే దొరికేది కాదు. అందుకే మనిషి ఆనందం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళనవసరం లేదు. పరిపూర్ణమైన భక్తుడికి ఆనందం బయటి వస్తువుల నుంచి రాదని, అది అంతర్గతంగానే ఉంటుందని తెలుసు. ఆ ఆనందమే నిత్యమైనదని తెలుసుకున్న భక్తుడు బాహ్య వస్తువులు కోరడు. భౌతిక సుఖాల కోసం అన్వేషించడు. ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేసి దైవానికి దగ్గరవుతాడు. ఆదిశంకరులు బోధించినట్లు మనసు దైవం మీద లగ్నం కావడం ద్వారానే మనిషికి శాంతి రూపంలో ఆనందం లభిస్తుంది. చిదానందమైన శాంతి సౌధానికి సోపానాలు మూడు. అవి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు. వీటిని సాధించి, ఆచరణాత్మకం చేసుకుంటే అంతకంటే ధన్యత ఉండదు. స్వచ్ఛమైన ఆనందం అంటే అదే కదా.

- విశ్వనాథ రమ

Read latest Editorial News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని