మూడు రత్నాలు

వ్యాసుడి మహాభారతాన్ని తెలుగులో రాయమంటూ రాజరాజ నరేంద్రుడు నన్నయభట్టును కోరింది- మక్కీకి మక్కీ అనువాదం కాదు. ‘మహాభారత బద్ధ నిరూపితార్థం’ తేటపడేట్లుగా తెలుగు చేయమన్నాడు. వ్యాస హృదయాన్ని చక్కని తెలుగులో

Published : 26 Jan 2022 00:31 IST

వ్యాసుడి మహాభారతాన్ని తెలుగులో రాయమంటూ రాజరాజ నరేంద్రుడు నన్నయభట్టును కోరింది- మక్కీకి మక్కీ అనువాదం కాదు. ‘మహాభారత బద్ధ నిరూపితార్థం’ తేటపడేట్లుగా తెలుగు చేయమన్నాడు. వ్యాస హృదయాన్ని చక్కని తెలుగులో ఆవిష్కరించమని దాని అర్థం. దానికి నన్నయ ఎన్నుకొన్న మార్గం- అనుసృజనం. అంటే వ్యాస హృదయానికి అనుగుణంగా తిరిగి సృష్టి చేయడం! దరిమిలా తిక్కన, ఎర్రన సైతం అదే మార్గం అనుసరించారు. ఫలితంగా ముగ్గురు వేరువేరు మహాకవులు వేరువేరు కాలాల్లో రచించినా- ఒకే గొప్పకవి ఏకకాలంలో రచించినప్పుడు కలిగే అద్భుత పఠనానుభూతి ఆంధ్రమహా భారతం ద్వారా తెలుగు ప్రజలకు అందింది. గొప్ప విలువలతో తెలుగు భారతం శాశ్వతత్వాన్ని దక్కించుకొంది.

ఈ క్రమంలో వ్యాసభారతంలోని ముఖ్యమైన మూడు అధ్యాయాలను తిక్కన అసలు అనువదించనే లేదు. సనత్సుజాతీయం, భగవద్గీత, విష్ణు సహస్రనామం... ఈ మూడూ తెలుగు భారతంలోకి రాలేదు. దానికి కారణం తిక్కన సోమయాజి అసమర్థత కానే కాదు. ఎంతో వివేకంతో చేసిన పని అది. ఆ మూడూ మహత్వపూర్ణ పారమార్థిక నేపథ్యం కలిగినవి. వ్యాసుడి పౌరాణిక నైతిక దృక్పథంలోంచి ఆవిర్భవించిన మంత్రాల్లాంటి ఆ మూడింటినీ అమర భాషలో ఆస్వాదించడమే సరైన విధానం. కవిత్రయంవారి కావ్యకళా దృక్పథమనే ఒరలో ఇమిడే ఖడ్గాలు కావవి. మంత్రాలను ఎవరికి తోచిన భాషలోకి వారు అనువదించుకుంటూ పోతే- వాటికి విలువ ఉండదు.

తిక్కన పాటించిన ఈ ఔచిత్యాన్ని మనమంతా గుర్తించేందుకై ఎవరో బుద్ధిశాలి ఒక కల్పిత కథను ప్రచారంలోకి తెచ్చాడు. భారత రచన పూర్తి చేశాక తిక్కన ఒకనాడు వ్యాసమహర్షిని సందర్శించాడట. అప్పుడు వ్యాసుడు ‘నాయనా! నా మూడు రత్నాలను ఏ విధంగా అనువదించావు?’ అని అడిగాడట. దానికి తిక్కన- ‘లేదు మహర్షీ! వాటిని మీ మాటల్లోనే చదువుకోవడం ప్రజలకు మంచిది’ అన్నాడని కథ. దానిలో నిజమెంత అనేది ప్రధానం కాదు. తాను అనువదించకపోవడం ద్వారా తిక్కన ఆ మూడు రత్నాల ఔన్నత్యాన్ని, ప్రాశస్త్యాన్ని తెలుగువారికి నిరూపించాడన్నదే ముఖ్యం.

ఆ మూడు రత్నాల్లో మొదటిది- ఉద్యోగపర్వంలోని సనత్సుజాతీయం. దాని ప్రవక్త బ్రహ్మ మానసపుత్రుడు, జ్ఞానమూర్తి అయిన సనత్‌ సుజాతుడు. బోధించింది- ధృతరాష్ట్రుడికి. దాన్ని వినిపిస్తున్నవాడు మహాజ్ఞాని, వింటున్నవాడు పుత్ర వ్యామోహంలో మునిగిన అజ్ఞాని.

రెండోది, భీష్మపర్వంలోని భగవద్గీత. వినిపించింది పరమాత్మ. శ్రోత- అర్జునుడు. లక్ష్యం- మానవ సమాజం. దేశ కాలాదులకు అతీతమైన ఆ పరమ జ్ఞానం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ అవసరమైనదే. ఆనాటి అర్జునుడి సంశయాత్మక స్థితికి, ఈనాటి ఆధునిక మానవుడి అయోమయ స్థితికి పెద్ద తేడా ఏమీ లేదు. అప్పటికీ ఇప్పటికీ గీతా సందేశమే పరమ ఔషధం. భగవద్గీతే మార్గదర్శి.

మూడో రత్నం- విష్ణు సహస్ర నామం. భీష్ముడి నోట పరమాత్మే ప్రవహింపజేసిన దివ్య అమృతధార- ఆ స్తోత్రం. భగవద్గీతకు దీటుగా ప్రాచుర్యం మిగిలిన రెండింటికీ దక్కకపోయినా- మూడూ మూడు రత్నాలు. అవి వ్యాసమహర్షి ద్వారా మానవజాతికి అందిన అమూల్య వరాలు. తొలుత పెద్దల వ్యాఖ్యానాల ద్వారా ఆకళించుకొని, తదుపరి సాధన ద్వారా వ్యాస ప్రోక్తాలను అనుష్ఠించడం మనిషి కర్తవ్యం. పారాయణం అనే ప్రక్రియను పెద్దలు మనకు అందించడంలోని పరమార్థం అదే!

- ఎర్రాప్రగడ రామకృష్ణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని