Published : 07 May 2022 00:42 IST

మార్పు

సృష్టిలో ప్రతీదీ కాలానుగుణంగా మార్పు చెందుతుంది. మార్పు అనివార్యం. మార్పు చైతన్య సూచిక. మార్పనేది కంటికి కనిపించనూ వచ్చు, కనిపించకపోనూ వచ్చు. చూడలేకపోయినంత మాత్రాన మార్పు చెందలేదని కాదు. నిత్యం ఒక వ్యక్తిని చూడటం కన్నా, కొంతకాలం తరవాత చూస్తే ఆ వ్యక్తిలోని మార్పు స్పష్టమవుతుంది. మొక్క చెట్టుగా ఎదగడం తెలుస్తుంది.

చీకటి వెలుగులు, మానవ, పశుపక్ష్యాదుల జీవితం, రుతువులు ఒక స్థితి నుంచి మరో స్థితికి చేరడానికి క్షణక్షణం మార్పు సంభవిస్తూనే ఉంటుంది. ఆ మార్పులోని దశలు కొంతవరకు అవగాహనకు వస్తాయి. వాటికీ ఆయా దశ సూచక పేర్లు పెట్టుకుంటాం. పరిపూర్ణ స్థితికి చేరాక ఆ ఆవృతం పూర్తవుతుంది. దానికో పేరు స్థిరపడుతుంది.

ప్రకృతి పరంగా మార్పులు సహజసిద్ధంగా జరుగుతాయి. అవి మార్చలేనివి. సృష్టిలో కోరుకున్నట్టుగా మార్పు చెందే అవకాశం ఒక్క మనిషికే ఉంది. మానసికంగా, శారీరకంగా ఎలా కావాలంటే అలా మారవచ్చు. అది మానవ జన్మ అదృష్టం, వరం. కంటికి అగుపించని మనసును కనిపెట్టి, అర్థం చేసుకుని, అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలని అనుకోవడంతోటే మనిషి జన్మ ఉత్తమత్వం పొందుతుంది. శరీరం మీద దృష్టి నిలిపి అందచందాలను మెరుగుపరచుకునే వారికన్నా,  మనసును తీర్చిదిద్దుకుని సేవాభావ   దృక్పథంతో మెలగేవారు మాననీయులు.

అందం ఎప్పటికీ ఒక్కలా ఉండేది కాదు. అది వయసుతోపాటు రకరకాల మార్పులకు లోనవుతుంది, రుతువుల ప్రభావానికి గురవుతుంది. మనసు అలాకాదు. అది కనిపించదు కాబట్టి మనం ఎలా మలచుకుంటే అలా స్థిరమవుతుంది. వృద్ధాప్యంలో కుర్రతనం ఉరకలెత్తడానికి, యౌవనకాలంలో లక్ష్యం లేక చతికిలబడటానికి మనసుకు మనిషి ఇచ్చే తర్ఫీదే కారణం. మనసు మనిషికి వన్నె తెస్తుంది. హరిశ్చంద్రుడు మనసుకు సత్యం మప్పాడు. రాముడు సకల గుణాలతో మనసును మేళవించాడు. ఒకరు సత్యహరిశ్చంద్రుడైతే, మరొకరు సకల సుగుణాభి రాముడిగా ఆదర్శప్రాయులయ్యారు.

సాధారణంగా మనిషి ప్రవర్తనతో అతడి మనసును అంచనా వేస్తారు. తెల్లనివన్నీ పాలు కాదు. నల్లనివన్నీ నీళ్లనీ అనుకోకూడదు. మెరిసేదంతా బంగారం కానేకాదు. నటన- సృష్టిలో మనిషికి మాత్రమే అబ్బిన కళ. మంచితనం, మానవత్వ భావాలతో క్రమంగా మనసును మార్చుకుంటూ తనను తాను తీర్చిదిద్దుకోవలసిన మనిషి, అవసరాలకు అనుగుణంగా నటిస్తుంటాడు. చెడ్డతనాన్ని దాచిపెట్టి మంచితనాన్ని ప్రదర్శిస్తాడు. ప్రపంచానికి అది సహజమా, నటనా అన్న తేడా తెలియనంతగా ప్రవర్తిస్తాడు.

నీతి, న్యాయం, నిజం, నిజాయతీలను నిర్వచించిన మనిషి అవినీతి, అన్యాయం, అబద్ధం, మోసం, దగా, కుట్రలకు కేంద్రం అవుతున్నాడు. పాలలో నీళ్లను కలుపుకొంటూ పోతే చివరికి క్షీరం అస్తిత్వం కోల్పోయి నీరవుతుంది. ధర్మం నాలుగు పాదాలపై నిలబడినప్పుడే సమాజం పచ్చగా పది కాలాలు పరిఢవిల్లుతుంది. రాబోయే తరాలకు నిష్కల్మషమైన, నిష్కపటమైన ఆహ్వానం పలుకుతుంది. మనిషి జన్మకు శాశ్వతత్వాన్నిచ్చే ధర్మాన్ని విడిచి తాత్కాలిక సుఖాల కోసం కాసుకు లొంగి అధర్మం బాట పట్టడం, అది కలి ప్రభావం అని సమర్థించుకోవడం ఆత్మవంచన. మనసును ఏమార్చుకుంటూ కాకుండా ఉత్తమంగా మార్చుకుంటూ ఇలలో దైవత్వాన్ని సాధించడమే మానవజన్మకు పరిపూర్ణత. లేదంటే జీవితమే వ్యర్థం!

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు

Read latest Editorial News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని