Updated : 10 May 2022 05:21 IST

దివ్య దేశాలు

నాదిగా భారతదేశంలో దేవాలయం మతానికి, ఆరాధనకు జీవగర్రగా ఉంటూ వచ్చింది. సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే వాస్తుశిల్పకళలో ప్రసిద్ధమైనది దేవాలయం. వైష్ణవ సంప్రదాయంలో దివ్యదేశాలకు చాలా ప్రాముఖ్యం ఉంది. సాధారణ పరిభాషలో ఈ మాటకు దైవసంబంధమైన ప్రదేశమని అర్థం. 12 మంది ఆళ్వారులు దర్శించి పాశురాలతో స్తుతించిన వైష్ణవ క్షేత్రాలను దివ్య దేశాలుగా వైష్ణవ సంప్రదాయం పరిగణిస్తోంది. భక్తి తత్వాన్ని లోకానికి ఉపదేశించడానికి అవతరించిన పుణ్యపురుషులు ఆళ్వారులు. భక్తి సముద్రపు లోతు ఎరిగినవారిని ఆళ్వారులంటారు. వారు తమిళంలో రచించిన స్తోత్రాలను ‘పాశురాలు’ అంటారు. క్షేత్రం (దివ్యదేశం), మూలవిరాట్టు (ప్రధానదైవం), తీర్థం (పుష్కరిణి), విమానం (గర్భాలయం పై గోపురం), ఉత్సవ మూర్తుల వైశిష్ట్యాన్ని పాశురాలు కీర్తించాయి. ఆళ్వారులు మంగళాశాసనాలు పొందిన దివ్య దేశాలు 108. మంగళాశాసనమంటే ఆశీర్వచనం. ఈ దివ్య దేశాల్లో భూమండలంమీద ఉన్నవి 106. నిరంతరం హరిధ్యానంలో నిమగ్నులై మోక్షం పొందిన పిమ్మట పరమ భక్తులు చేరుకొనే విష్ణుధామాలుగా మరో రెంటింటిని ఆళ్వారులు పేర్కొన్నారు. అవి తిరుపాలకడల్‌ (క్షీర సముద్రం), తిరుపరమపదమ్‌ (వైకుంఠం). ఈ దివ్య దేశాలను ‘దివ్య తిరుపతులు’ గానూ వ్యవహరిస్తారు. తాళ్ళపాక పెద తిరుమలయ్య తన ‘వచనాలు’లో 108 తిరుపతులను ప్రస్తావించారు. ఆయన 108 అని పేర్కొన్నప్పటికీ 97 పేర్లను మాత్రం చెప్పి మొదలైనవి అన్నారు. వైష్ణవ సంప్రదాయం దివ్య తిరుపతులుగా భావిస్తున్న వాటికి, పెద తిరుమలయ్య పేర్కొన్న వాటికి పేర్లలో కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. తిరుమలయ్య పేర్కొన్నవి కొన్ని ప్రదేశాలేగాని ఆలయాలు కావు. భూమిపై గల 106 దివ్య దేశాల్లో ‘సాలగ్రామ’ నేపాల్‌లో గండకీ నదీతీరంలో ఉంది. దాన్ని ముక్తినాథ క్షేత్రమంటారు. గండకి నదిలో విష్ణు చిహ్నాలు ముద్రితమైన శిలలు- సాలగ్రామాలు.

ఉత్తర భారతదేశంలో ఎనిమిది దివ్యదేశాల్ని దర్శించగలం. వాటిలో రామజన్మభూమి అయోధ్య, హిమాలయ పర్వత శ్రేణుల్లోని బదరి, అలకనంద-భాగీరథి నదుల సంగమస్థానం దేవప్రయాగ, శ్రీకృష్ణుడు నడయాడిన మధుర, ద్వారకలు ముఖ్యమైనవి. పురాణకాలం నుంచి తపోభూమిగా ఖ్యాతి పొందిన నైమిశారణ్యం దివ్యదేశమైనా అక్కడ ఆళ్వారులు కీర్తించిన ఆలయాలు ఇప్పుడు కనిపించడం లేదు.

దక్షిణ భారతంలో తమిళనాడులో 84 దివ్య దేశాలు నెలకొనగా కేరళలో 11, ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఉన్నాయి. చారిత్రకంగా పరిశీలిస్తే పెన్నా కావేరి నదుల మధ్య భాగాన్ని చోళనాడుగా వ్యవహరిస్తారు. ఈ ప్రాంతంలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీరంగం. వైష్ణవ ధర్మ ప్రచారకులు తమ ధర్మప్రచారానికి శ్రీరంగం నుంచి శ్రీకారం చుట్టేవారు. కావేరికి దక్షిణాన పాండ్యరాజులు పాలించిన ప్రాంతం పాండ్యనాడు. ఈ ప్రాంతంలో మధురై ప్రసిద్ధ దివ్యదేశం. ఇక్కడ మూలవిరాట్టును ‘కూడలాళగర్‌’ అంటారు. చేరవంశీకులు పాలించిన నేటి కేరళ, తమిళనాడులోని కొంత ప్రాంతాన్ని మలైనాడుగా చరిత్ర పేర్కొంటోంది. ఈ భూభాగంలో తిరువనంతపురంలోని అనంతపద్మనాభ స్వామి ఆలయం ప్రసిద్ధమైనది. వివిధ కాలాల్లో పల్లవులు, చోళులు పాలించిన భూప్రాంతాన్ని ‘నడునాడు’ అంటారు. అంటే మధ్య దేశమని అర్థం. ఇక్కడ రెండు క్షేత్రాలున్నాయి. పల్లవులు పాలించిన ప్రాంతం తొండైమండలం. ఈ ప్రాంతంలో కంచి, మహాబలిపురం ప్రముఖమైనవి. ఇక్కడ దివ్య దేశాలు గొప్ప శిల్ప కళాశోభితాలు. సువర్ణముఖీనదికి ఉత్తరాన గల ప్రాంతం వడనాడు. తెలుగునాటగల తిరుపతి, అహోబిలం ఇక్కడి దివ్యదేశాలు. ఈ దివ్య తిరుపతుల్లో వైఖానస, పాంచరాత్ర ఆగమ పద్ధతుల్లో పూజలు జరుగుతాయి. ఆళ్వారు తిరునక్షత్ర ఉత్సవాలు నిర్వహిస్తారు. మూలవిరాట్టుల్లో నిలుచున్న భంగిమలో 60, కూర్చున్నవి 21, శయనాకృతిలో 27 మూర్తులు ఉన్నాయి.

- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

Read latest Editorial News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని