Published : 12 May 2022 00:36 IST

అన్నవరం కల్యాణం

తూర్పు గోదావరి జిల్లాలో పంపానది తీరాన అన్నవరం గ్రామంలో రత్నగిరి అనే కొండ ఉంది. త్రిమూర్త్యాత్మక రూపకుడైన శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి రమా సమేతుడై పూర్వం ఒకానొక ఖరనామ సంవత్సర శ్రావణ శుద్ధ విదియనాడు ్టదానిపై స్వయంభువై వెలశాడు. అక్కడి అంకుర చెట్టు పొదలో తాను శిలా రూపంలో ఉన్నట్లు కర్ణంపూడి సంస్థానాధీశుడు రాజా వేంకట నారాయణకు స్వామి కలలో కనిపించి చెప్పడంతో, అక్కడ పెద్ద దేవాలయం నిర్మితమైంది.

నారద మహర్షి భూలోకంలోని పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ, పంపానదీ తీరానికి రాగా రత్నగిరీంద్రుడు గొప్పగా స్తోత్రం చేసి మహర్షిని సంతోషపరచాడు. నారదుడు ‘ఓ గిరిరాజా! శ్రీ మహావిష్ణువు మహానారాయణ యంత్రాలంకృతుడై శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామిగా నీ శిఖరాన్ని అధిరోహించి భక్త కోటిని రక్షిస్తా’డని వివరించాడు. భద్రుడు, రత్నాకరుడు అన్నదమ్ములు. వారిద్దరూ శ్రీహరి కోసం తపస్సు చేశారు. స్వామి ప్రత్యక్షమై భద్రుడు భద్రాద్రిగా, రత్నాకరుడు రత్తగిరిగా రూపుదాల్చేట్లు అనుగ్రహించాడు. మేరు పర్వత రాజకుమారుడు రత్నగిరి, ముని కన్య ‘పంప’ ప్రేమించుకున్నారు. అది గమనించిన పంప తండ్రి రత్నగిరిని పర్వత రూపం ధరించమని, పంపను నదీ రూపం పొందుతావని శపించాడు. శ్రీమన్నారాయణుడు సత్యదేవుడిగా రత్నగిరిపైన వేంచేస్తాడని, పంపానది ఆ ప్రాంతాన్ని సుక్షేత్రంగా, సస్యశ్యామలం చేస్తుందని నారదుడు చెప్పాడని పురాణ కథనం.

అన్నవరం క్షేత్రం వెలసిన కొద్ది కాలంలోనే బదరీనాధ్‌ నుంచి తీసుకువచ్చిన వైకుంఠ మహాపారాయణ యంత్రాన్ని గర్భాలయం దిగువన ప్రతిష్ఠించారు. 24 వృత్తాలతో ఉన్న ఈ యంత్రంలో అనేక బీజాక్షరాలు, నవవిధ దేవతా స్వరూపాలు గాయత్రీ మంత్రాలున్నా యని పండితులు పేర్కొన్నారు. గర్భా లయంలో స్వామికి ఎడమ వైపున అనంతలక్ష్మీ సత్యవతీదేవి, కుడివైపున పరమేశ్వరుడు గోచరిస్తారు. యంత్ర రూపంలో ఒక దేవుడి ప్రతిష్ఠాపన జరిగింది. అందుకే ఇది సత్య, శివ, సుందరధామంగా విరాజిల్లుతోంది. గర్భాలయంలో స్వామి మూల విరాట్టు పదమూడు అడుగుల మహావిగ్రహంగా దర్శనమిస్తుంది. ఈ దేవస్థానం పంచ విమానాల రథాకృతిలో కనిపిస్తుంది. స్వామి వెెలవక ముందు నుంచే ఈ క్షేత్రంలో నిత్యాన్నదానం జరిగేదని చెబుతారు. అందుకే ఇది ‘అన్నవరం’ అయిందంటారు.

స్వామి వారికి ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నుంచి వైశాఖ బహుళ పాడ్యమి వరకు పంచాహ్నికంగా, స్మార్త ఆగమ విధాన పూర్వకంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఏకాదశి నాడు స్వామివారి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. ఈ ఉత్సవాలకు రత్నగిరి క్షేత్ర పాలకులైౖన శ్రీ సీతారాములు సారథ్యం వహిస్తారు. అలాగే భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణానికి సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మీ అమ్మవారు పెళ్ళి పెద్దలుగా వ్యవహరిస్తారు.

స్కాంద పురాణంలోని రేవాఖండంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానం వివరంగా ఉంది. తెలుగువారి ఇలవేలుపు, కొంగుబంగారం సత్యనారాయణ స్వామికి వ్రతాధిష్ఠాన దైవంగా ఎంతో ఖ్యాతి ఉంది. గృహప్రవేశాలు, వివాహాది శుభకార్యాల సందర్భంగా భక్తులు స్వామి వ్రతం ఎంతో భక్తిశ్రద్ధలతో చేస్తారు. సకల అభీష్ట సిద్ధికి సత్యదేవుడి వ్రతం సర్వోత్కృష్టమైందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయిదు అధ్యాయాలు గల స్వామి వ్రతం ఆచరించినా, వ్రత కథ విన్నా, తీర్థ ప్రసాదాలు స్వీకరించినా, కోరుకున్న కోర్కెలన్నీ తీరుతాయని, సకల పాపహరణం జరిగి, మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.

- చిమ్మపూడి శ్రీరామమూర్తి

Read latest Editorial News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని