శాస్త్ర జ్ఞానం

మంచి స్వభావం, ఉత్తమ నడవడిక, మార్గదర్శనం మనకు శాస్త్రాల నుంచి లభిస్తుంది. శాస్త్రాలు తల్లి వంటివి, ఆ పరమాత్మ శాస్త్రాలకు తండ్రివంటి వాడని చెబుతారు పండితులు.శాస్త్రం ఎప్పుడూ ప్రామాణికమే. శాస్త్ర జ్ఞానం ప్రతి మనిషికీ ...

Published : 13 May 2022 00:15 IST

మంచి స్వభావం, ఉత్తమ నడవడిక, మార్గదర్శనం మనకు శాస్త్రాల నుంచి లభిస్తుంది. శాస్త్రాలు తల్లి వంటివి, ఆ పరమాత్మ శాస్త్రాలకు తండ్రివంటి వాడని చెబుతారు పండితులు.

శాస్త్రం ఎప్పుడూ ప్రామాణికమే. శాస్త్ర జ్ఞానం ప్రతి మనిషికీ ఉండి తీరాలని పెద్దల మాట. కాని ఆ అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. అప్పుడు శాస్త్ర జ్ఞానం గల గురువుల నుంచి ప్రతి ఒక్కరూ తమ సందేహాలు తీర్చుకోవాలి.
వేద, వేదాంగ, వేదాంత రహస్యాలు తెలుసుకోగల అదృష్టం కొంతమందికి మాత్రమే లభిస్తుంది. దీపం నుంచి దీపం వెలిగించినట్లుగా వారు ఆ జ్ఞానాన్ని అందరికీ అందజేయాలి. తద్వారా, సమాజంలో అజ్ఞానం క్రమంగా అంతరిస్తుంది. శాంతి నెలకొంటుంది.

ఉత్తమ గ్రంథాలను శ్రద్ధాసక్తులు లేకుండా కాలక్షేపానికి ఎంతమాత్రం చదవకూడదు. దానివల్ల ఆశించిన ప్రయోజనం పొందలేం. ఎందుకంటే, ఆహారాన్ని చూస్తే ఆకలి తీరదు. ఆరగిస్తేనే రుచి తెలుస్తుంది. శక్తి లభిస్తుంది. శాస్త్ర అధ్యయనం అటువంటిదే. శాస్త్రాలను భక్తితో, శ్రద్ధతో అధ్యయనం చేయాలి. అప్పుడే మనోవికాసం కలుగుతుంది. మనసు ధార్మికత్వం వైపు ప్రయాణిస్తుంది.

ప్రపంచంలో ఏ దేశానికీ లభించని గొప్ప వరం మన భారతదేశానికి లభించింది. అదే వేద వాఙ్మయం. వేద శబ్దానికి అర్థం విజ్ఞానం. సార్వజనీనమైన జ్ఞాన సంపదను మహర్షులు మనకు అందించారు. మనమందరం సూర్యచంద్రులు లాగా సన్మార్గంలో నడుద్దామని బోధిస్తోంది వేదం.

ఆదికావ్యమైన రామాయణం సనాతన ధర్మానికి,నైతిక విలువలకు నిలువెత్తు ప్రతీకలా నిలిచి నిత్యజీవితంలో మనిషి ఎలా నడుచుకోవాలో చెబుతుంది. పితృ ధర్మానికి, ఏకపత్నీ వ్రతానికి, సోదర ప్రేమకు, స్నేహ ధర్మానికి, శరణాగత రక్షణకు నిర్వచనం శ్రీరాముడు. ధర్మమార్గంలో నడవాలని, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు రాముడు. అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు.

మహాభారత సందేశాలన్నీ అమూల్యమైనవి. సర్వ కాలాలకు, సమయాలకు వర్తించేవి. నీకు కష్టం కలిగించే పని ఇతరుల పట్ల చేయవద్దని చెబుతోంది భారతం. భారతంలో లేనిది మరింకెక్కడా లేదంటారు. అందుకే అది పంచమ వేదమైంది.
నీ కర్తవ్యాన్ని నీవు సక్రమంగా నెరవేర్చు, కర్తవ్య దీక్షలో పిరికితనం పనికిరాదంటుంది భగవద్గీత. ఇలా ప్రతి శాస్త్రం- ధర్మమే జయిస్తుంది, అధర్మం అపజయం పాలవుతుందన్న సిద్ధాంతాన్ని ప్రచారం చేసింది. సత్యం, ప్రేమ, ధర్మం వంటివి పాటించమని, సన్మార్గంలో నడవమని బోధించింది.

శాస్త్ర జ్ఞానం మనిషిని మనీషిగా, దానవుణ్ని దైవంగా, భోగిని యోగిగా, రాగిని విరాగిగా మార్చి అలౌకికానంద ప్రాప్తి కలిగిస్తుంది.

ఈ లోకంలో ఏ సంపదైనా తరిగిపోవచ్చు. ఆధ్యాత్మిక జ్ఞాన సంపద మాత్రం ఎన్నటికీ తరిగిపోదు. మానవుణ్ని మాధవుడిగా మార్చే ఈ శాస్త్రాలను ఆకళింపు చేసుకుని, వాటిని మన జీవన సంవిధాన ప్రక్రియకు సమన్వయం చేసుకోవాలి. అంతేకాకుండా, శాస్త్రాలలో ఉన్న అద్భుతమైన జ్ఞానాన్ని పదిమందికీ పంచాలి. ఇదే జ్ఞానయజ్ఞం. ఇదే శ్రేష్ఠమైన యజ్ఞం. అది నిర్వర్తించినవారికి భగవంతుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది.

- విశ్వనాథ రమ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని