నృసింహశరణ్యం

శ్రీశంకరభగవత్పాదులు జగద్గురువులు. ఆయన స్థాపించిన సిద్ధాంతం అద్వైతం. అద్వైతం అంటే జీవుడికి, దేవుడికి భేదం లేదని చెప్పడం. పైకి చూస్తే భేదం ఉన్నట్లు కనబడుతున్నా- లోతుగా చూస్తే ఏ భేదమూ లేదని, జీవుడు కూడా దేవుడిలోని వాడేనన్న....

Published : 14 May 2022 00:14 IST

శ్రీశంకరభగవత్పాదులు జగద్గురువులు. ఆయన స్థాపించిన సిద్ధాంతం అద్వైతం. అద్వైతం అంటే జీవుడికి, దేవుడికి భేదం లేదని చెప్పడం. పైకి చూస్తే భేదం ఉన్నట్లు కనబడుతున్నా- లోతుగా చూస్తే ఏ భేదమూ లేదని, జీవుడు కూడా దేవుడిలోని వాడేనన్న నమ్మకం కలుగుతుంది. ఉదాహరణకు చేతిలో మట్టి ముద్దను తీసుకొని, దాన్ని ఒక కుండలా రూపొందించవచ్చు. కుండగా కనిపిస్తున్న మట్టి, నేలలో ఉన్న మట్టి ఒక్కటే. కుండ పగిలిపోతే మట్టిలోనే కదా కలిసిపోయేది? ఎన్నటికైనా మట్టి ఒక్కటే శాశ్వతం, కుండ అశాశ్వతం అని తెలుసుకోవడమే అద్వైతం.

ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని ఆసేతుహిమాచలం పర్యటించి, ప్రబోధించిన శంకరులు శివకేశవభేదం లేకుండా దేవతలందరిపైనా అమూల్య స్తోత్రాలను రచించారు. అజ్ఞానాన్ని దూరం చేయాలని ప్రార్థించారు. అందరినీ కష్టకాలంలో ఆదుకొమ్మని వినుతించారు. అందుకే ఆయన జగద్గురువులయ్యారు. శంకరభగవత్పాదులు రచించిన అమూల్య స్తోత్రరత్నం లక్ష్మీనృసింహ కరావలంబస్తోత్రం. ఇందులో జగద్గురువులు మానవాళిపై అపారమైన సహానుభూతితో నృసింహస్వామిని అనేక విధాలుగా కొనియాడారు. చేయూతనిమ్మని వేడుకున్నారు. అందుకే దానికి ‘కరావలంబ’ (చేయూతను ప్రసాదించే) స్తోత్రం అనే పేరు వచ్చింది.

ఓ దేవదేవా! నీవు యోగీశ్వరుడివి. శాశ్వతుడివి. సంసారసాగరంలో నిలిచిన నౌక వంటివాడివి. స్వామీ! నాకు చేయూతనిచ్చి కాపాడు! ఈ సంసారం భయంకరమైన దట్టమైన అడవి వంటిది. ఇందులో కోరికలు అనే సింహాలు సంచరిస్తాయి. కోరలు సాచిన ఆశలు క్రూరమృగాల్లా వెంటాడతాయి. ఈ అడవిలో ఎంతదూరం సంచరించినా భయంపోదు... స్వామీ! ఈ అడవిలో నీ చేయూతనిచ్చి నన్ను కాపాడు.

ఈ సంసారం ఒక అగాధమైన బావిలాంటిది. ఇది ఎంత లోతుగా ఉందో తెలియదు. లోతులోకి దిగితే కష్టాలు పాములై కాటువేస్తాయి... ఈ ఘోర కూపంలో నీ చేయూతనిచ్చి నన్ను కాపాడు!
ఈ సంసారం సాగరంలాంటిది. ఈ సముద్రంలో భయంకరమైన మొసళ్లున్నాయి. తిమింగిలాలున్నాయి. అంతులేని ఈ సాగరంలో ఈదలేకపోతున్నాను. స్వామీ! నీ చల్లని చేయిని అందించి రక్షించు!

ఈ సంసారం విషవృక్షం లాంటిది. ఎంతో ఎత్తుకు ఎగబాకిన ఈ చెట్టుపైనుంచి కిందికి దిగలేకపోతున్నాను. స్వామీ! నీ చేయూతనిచ్చి నన్ను రక్షించు! ఈ సంసారం ఒక మహా విషసర్పం లాంటిది. దాని విషం భయంకరంగా ఉంది. నన్ను కాటువేయడానికి విషసర్పం కోరలుసాచి బుసలుకొడుతోంది. కనుక శేషశయనా! నీ చేయూతను అందించి నన్ను కాపాడు! ఈ సంసారం ఒక దావాగ్ని వంటిది. అడవి అంతా తీవ్రమైన మంటలతో తగలబడిపోతుంటే ఎటూ దారి   కానరాక మంటలలో చిక్కుబడి ఉన్నాను. దేవదేవా! నీ చేయూతనందించి కాపాడు! ఈ సంసారం ఒక వలలాంటిది. కష్టాల వలలో పడి చేపలా కొట్టుకుంటున్నాను. స్వామీ! నీ చేయూతనందించి నన్ను రక్షించు!

ఈ సంసారం మదపుటేనుగు వంటిది. అది నన్ను తొండంతో పట్టుకొని,  నేలకేసి కొట్టి చంపివేయాలని చూస్తోంది. స్వామీ! నీ చేయూతనందించి ఉద్ధరించు! అజ్ఞానం నన్ను గుడ్డివాడిగా చేస్తోంది. ఇంద్రియాలు దొంగల్లా నన్ను నిత్యం దోచుకుంటున్నాయి. వ్యామోహం అనే అగాధంలో పడిపోతున్నాను. స్వామీ! నీ చేయూతనందించు! నీవే నాకు శరణు! మధుసూదనా! కేశవా! జనార్దనా! వాసుదేవా! లక్ష్మీనృసింహా! నన్ను రక్షించు!
ఈ స్తోత్రాన్ని పఠిస్తే సమస్త భయాలూ దూరమవుతాయంటారు. లక్ష్మీనృసింహుడి కారుణ్యం అమృతంలా వర్షిస్తుందని చెబుతారు.

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని