Published : 15 May 2022 00:06 IST

వైశాఖ బుద్ధ పూర్ణిమ

రమ శాంతి పల్లవించే మనోహరమైన, దివ్యమైన పలుకులకు నెలవు-  శాంతి స్వరూపుడు గౌతముడు. తల్లి పేరుతో చరిత్ర గతిని మార్చేశాడు. దివ్యమైన అంతరంగ ఆనంద తరంగాలు కనురెప్ప వాల్చకుండా అతడిని చూడగలిగే సామర్థ్యాన్ని మనకు ప్రసాదిస్తాయి. అతడి సన్నిధిని అనుభవించిన వారెందరో మహా చైతన్యపు లోతులు చూశారు.

అతడు ఊరూ పేరూ లేనివాడు కాదు. పేద కుటుంబంలో పస్తులున్నవాడు కాదు. రథాలు, పల్లకీలు, సేవకులు, వజ్రవైఢూర్యాలతో తులతూగే మహా చక్రవర్తి కుమారుడు. ఆ స్థితి అతడికి తృణప్రాయం. అందుకే అన్నీ వదిలేశాడు.

నిరాడంబరుడై, నిత్యం భిక్షాటన చేస్తూ, ముఫ్ఫై ఏళ్లకే దివ్య జ్ఞానం పొంది,  తరవాత మరో ఏభై ఏళ్లు బతికాడు...కాలి నడకన వేల మైళ్లు తిరిగాడు. దుఃఖ నివారణ మార్గం కనుగొన్నాడు. మానవాళికి శాశ్వత శాంతి బాటను ప్రసాదించాడు. అతడే- తొలుత సిద్ధార్థుడు. తరవాత బుద్ధుడు. వైశాఖ పూర్ణిమ రోజున అతడు భూమి మీదకు వచ్చి, మళ్ళీ అదే రోజున భూమికి శరీరాన్ని అర్పించాడు.

బుద్ధుడు, అతడి శిష్యులు, ప్రతి సంవత్సరం అష్టాంగ యోగ మార్గం గురించి చర్చించి, ఆచరించేవారు. ఈ బోధనలను భద్రపరచి ప్రచారం చెయ్యడానికి బుద్ధుడి నిర్యాణం తరవాత ఒక సంఘం ఏర్పడింది. ఒక శతాబ్దం తరవాత మరో సంఘం ఏర్పడింది. ఈ రెండు సంఘాలు బుద్ధుడి బోధనలను ప్రచారం చేశాయి.

ఒకరోజు బుద్ధ భగవానుడు భిక్షాటన చేస్తూ ఓ ఇంటి ముందు నిలబడ్డాడు. రుసరుసలాడుతూ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది ఇల్లాలు. ఎదురుగా నిలబడి ఉన్న బుద్ధుడిని చూసి- ఇలా అడుక్కోకపోతే ఏదైనా పనీ పాటా చేసుకుని బతకవచ్చుగా...నీవు సోమరిగా తయారవడమే కాకుండా నీ శిష్యులని చెప్పుకొంటున్న వీరిని కూడా సోమరులుగా తయారుచేస్తున్నావని తిట్టింది. బుద్ధుడు చిరునవ్వుతో ఆమె పరుష వాక్కుల్ని విన్నాడు. కానీ, ఏమీ అనలేదు. పట్టరాని కోపంతో ఊగిపోతున్న శిష్యులను చూసి వారించాడు.

తరవాత ప్రసన్నవదనంతో, ‘మాతా! చిన్న సంశయం తీరుస్తారా?’ అన్నాడు. అందుకు ఆమె ‘సరే... చెప్పు’ అంది. బుద్ధుడు తన చేతిలోని భిక్షాపాత్రను చూపుతూ ‘తల్లీ! నేను నీకు ఓ వస్తువును ఇచ్చినప్పుడు దాన్ని తిరస్కరిస్తే ఎవరికి చెందుతుంది?’ అని ప్రశ్నించాడు. అందుకు ఆమె, ‘నేను తీసుకోకుండా తిరస్కరించాను కాబట్టి, ఆ వస్తువు నీకే చెందుతుంది’ అని వేళాకోళంగా బదులిచ్చింది.

‘అయితే... తల్లీ! నేను నీ తిట్లను స్వీకరించడం లేదు’ అన్నాడు. ఆమె తన తప్పును తెలుసుకుని సిగ్గుతో తలదించుకుంది.
ఈ సంఘటనతో బుద్ధుడు గొప్ప ధర్మాన్ని బోధించాడు. మంచి చేసేటప్పుడు కూడా మనల్ని అవమానించేవాళ్లు, వేళాకోళం చేసేవాళ్లు చుట్టూ చాలామంది ఉంటారు. కొందరు బహిరంగంగా విమర్శిస్తే, ఇంకొందరు చాటుగా విమర్శిస్తుంటారు.

వాటిని మనం పట్టించుకోనంత వరకు మన దారిలో ఎలాంటి ఆటంకాలూ ఉండవు. ఎప్పుడైతే వాటిని పట్టించుకుని, బాధపడతామో... ఇక ముందుకు వెళ్ళలేం. విమర్శ హృదయాన్ని బాధించేలా కాక మనసును ఆలోచింపజేసేదిగా ఉండాలి.

బుద్ధుడి మార్గంలో జనన మరణాలు చైతన్య స్థాయిలో భేదాలు. సాధకుడు అష్టాంగ యోగ మార్గంలో సాధన చేసి, నిర్వాణం పొందగలడు. అత్యుత్తమమైన ప్రశాంతిని అనుభవించగలడు. ఎక్కడా, ఎవరినీ వ్యక్తిగత ఆరాధన చేయనవసరం లేదు. అప్పోదీపోభవ అని చెప్పారు. అంటే, ఎవరికి వారే వెలుగై దారి చూపాలి!

- ఆనందసాయి స్వామి

Read latest Editorial News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని