కళాత్మక జీవితం

జీవన వైశాల్యం విశ్వమంత విశాలమైంది. మౌలికంగా సౌందర్యభరితమైంది. ప్రాకృతికంగా క్రియాశీలమైంది. అన్నింటికీ మించి విలువైంది. అందువల్లే మనిషి చేసిన మొత్తం జీవన ప్రయాణంలో విడుదలైన జీవనోత్సవాన్ని, దుఃఖ భాండాగారాన్ని,

Published : 16 May 2022 01:33 IST

జీవన వైశాల్యం విశ్వమంత విశాలమైంది. మౌలికంగా సౌందర్యభరితమైంది. ప్రాకృతికంగా క్రియాశీలమైంది. అన్నింటికీ మించి విలువైంది. అందువల్లే మనిషి చేసిన మొత్తం జీవన ప్రయాణంలో విడుదలైన జీవనోత్సవాన్ని, దుఃఖ భాండాగారాన్ని, ఇంకా తదితర పార్శ్వాల సమ్మిశ్రితాన్ని ఒడిసి పట్టుకుని నిక్షిప్తం చెయ్యడానికి పెద్ద మొత్తంలో కృషి జరిపినవి కళలేనని చెప్పాలి.

శతాబ్దాలు, సహస్రాబ్దాల కాలాల నాటి ప్రాచీన జీవన సంస్కృతిని, బతుకు చిత్రాన్ని, ఘనమైన ఆనాటి వైభవాన్ని... తమ వీపులపై ముద్రించుకుని వేల ఏళ్లుగా మోసుకుంటూ చెక్కు చెదరకుండా ఇప్పుడూ కనుల వాకిట ఆరబోస్తున్న శిల్పాలు- సజీవ దృశ్యాలు.

విశాలంగా పరుచుకున్న జీవన మైదానాన్ని ఒక కళతో ఎంత చిత్రిక పట్టినా పట్టుబడని పార్శ్వం ఎంతో ఇంకా మిగిలే ఉంటుంది. ఆ భాగాన్నీ పట్టుకుని పూరించడానికి మిగతా కళలు రంగంలోకి దూకుతాయి. చెయ్యాల్సిన కార్యాల్ని భుజాన ఎత్తుకుంటాయి. సమగ్రతను పరిపుష్టి గావించడానికి, శాశ్వతత్వాన్ని నెలకొల్పడానికి, ఉపరితలంపైన బతుకు రూపాన్ని, ఆంతరంగిక సామ్రాజ్యంలోని జీవన తాత్విక నేపథ్యాన్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించడానికి శతవిధాలా ప్రయత్నిస్తాయి.

తరాలెన్ని మారినా, యుగాలు గడచినా కళలు ఎందుకు పాతబడి పోలేదు? మానవ మస్తిష్కాల్లోంచి ఎందుకని వెళ్ళిపోలేదు? ఎందుకంటే- జీవన సౌందర్యాన్ని, అందులోని సత్యాన్ని మనసు ముందు పరచి దాన్ని ఆహ్లాద పరచి నిద్రపుచ్చే మంత్రశక్తి కళకు ఉంది. నిద్రపుచ్చడమంటే చిన్నప్పుడు నాన్నమ్మో, అమ్మమ్మో పిట్టకథలు చెబుతూ జోలపాటలు పాడుతూ నిద్రలోకి జార్చడం మాత్రమే కాదు. మెలకువగా ఉన్నప్పుడూ మనసును కదలకుండా కూర్చోబెట్టే శక్తి ఒక్క కళకు మాత్రమే ఉంది. అందుకే కళలంటే మనుషులకు మక్కువ ఎక్కువ.

జీవన మైదానంపై కళ ఎన్ని రూపాల్లో ప్రవహించినా వాటన్నింటి వద్దకూ వెళ్లడానికి మనుషులు ఉబలాట పడతారు. అవి వెదజల్లే జీవన సౌరభాల్ని ఎగబడి ఏరుకుంటారు. భూమ్మీద నదులు పారిన చోటల్లా నాగరికతలు వెలశాయి. కళానిధులు వికసించిన ప్రాంతాలూ మనిషిని తీర్చిదిద్దాయి. ఉన్నతుణ్ని చేశాయి. జీవితం పట్ల అపారమైన ప్రేమ పెంచాయి.

ఒక చెంచా పంచదార ద్రావణం ఒక గ్లాసునీళ్లలో పోసినప్పుడు ఉండే గాఢత అదే ద్రావణం బకెట్‌ నీటిలో కలిపినప్పుడు ఉండదు. అది పలచబడుతుంది. నిజ జీవితంలోనూ అంతే. బయట ఒక విషాద సంఘటన జరిగినప్పుడు- క్షణ క్షణానికీ విస్తరించుకుంటూ సాగిపోయే విశాలాకాశంలో అది కరిగిపోతుంది. ఆ దృశ్యమానం విడుదల చేేసే సాంద్రత తగ్గిపోతుంది. అదే సంఘటనను ఒక కళారూపంలో ప్రదర్శించినప్పుడు ప్రేక్షకుడైన మనిషి చలించిపోతాడు. అప్పుడు, అతడి లోపల దాగిన సహజాతి సహజమైన మానవత్వం కట్టలు తెంచుకుని బయటకు వస్తుంది. ఏ పని చేసినా అందులో కళాత్మకత ఉట్టిపడాలి. అందువల్ల అది(పని) చేసే వారితో పాటు దాన్ని చూసే వారికీ అనేక ప్రయోజనాలు చేకూరతాయి.

శిల్పకారుడు శిలలోని వృథా భాగం తొలగించి ఆఖరున ఒక చక్కని(దేవుడి) శిల్పం ఆవిష్కరిస్తాడు. ధ్యాన సాధనలో సాధకుడూ అంతే. తనను తానే చెక్కుకుంటూ ముందుకు వెళతాడు. అది(ధ్యానం) ఓ అత్యద్భుత కళ.

- మునిమడుగుల రాజారావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని