Published : 19 May 2022 00:24 IST

పంచమవేదం

హాభారతానికి వేదవ్యాసుడు తొలుత నిర్దేశించిన పేరు ‘జయం’. వ్యాసమహర్షి శిష్యులను ఆశ్వలాయన గుహ్య సూత్రాలు- ‘భారత మహాభారత ఆచార్యులు’గా అభివర్ణించాయి. అంటే వ్యాసశిష్యుల మూలంగా జయం- భారతంగా మహాభారతంగా ఆవిర్భవించిందని అర్థం. ఆ క్రమంలో సంస్కృత భారతం లక్షా అయిదు వందల శ్లోకాలుగా విస్తరించింది. ఆదిపర్వంలోని పర్వానుక్రమణికలో ఇది నన్నయభట్టు వెల్లడించిన లెక్క.

వ్యాసమహర్షి జయ కావ్య రచనను లోక హితం కోరి ప్రచారం చేసే బాధ్యతను శిష్యులు, మునులు స్వీకరించారు. నారదుడు దేవలోకంలోను, దేవలుడు పితృలోకాల్లోను, జనమేజయుడికి భారతాన్ని వివరించే క్రమంలో వైశంపాయన మహర్షి మానవ లోకంలోనూ- వ్యాసకృతికి లోకోత్తర ప్రాచుర్యాన్ని చేకూర్చారు. వైశంపాయనుడు చెబుతున్న సమ యంలో ఉగ్రశ్రవసుడు అనే సూతుడు ఆ కథను విన్నాడు. ఆయన ఆ కాలంలో సుప్రసిద్ధ పౌరాణికుడు. నైమిశారణ్యంలో పన్నెండు సంవత్సరాల పాటు శౌనక మహర్షి సత్త్రయాగాన్ని నిర్వహించిన సందర్భంలో అక్కడి మునుల కోరికపై అదే సూతమహర్షి భార తాన్ని వినిపించాడు. ఆ సమయంలో శ్రోతలకు కలిగిన సందేహాలకు, లేవనెత్తిన ప్రశ్నలకు బదులిస్తూ సూతుడు- వ్యాస హృదయాన్ని మరింత స్పష్టంగా ఆవిష్కరిం చేందుకై కొన్ని వివరణలు జోడిం చాడు. ఇలా ఒకరితో ఒకరు అనగా అనగా... విస్తరించిన బృహత్‌ గ్రంథమే ఇప్పుడు మనముందున్న మహాభారతం. చిన్నప్పుడు మనం విన్నకథలన్నీ ‘అనగనగా...’ అంటూ ఆరంభమయ్యే అద్భుతమైన సంప్రదాయంలోని అసలు రహస్యం ఇదే!

ఆద్యంతం కొనసాగే అసలైన కథకు ఆఖ్యానం అని పేరు. దాన్ని మరింతగా తేటతెల్లం చేసేందుకు అనుబంధంగా అల్లుకొనే కథలను ‘ఉపాఖ్యానాలు’ అంటారు. ఉపాఖ్యానాలు హుందాగా ఔచిత్యభరితంగా ఉండాలన్నాడు జగన్నాథ పండితరాయలు. అందమైన విషయాన్ని చెబుతూ, మధ్యలో అసలు కథకు పరిపోషకంగా వేరే సంగతులను ఎంతో నైపుణ్యంగా పొదిగి శ్రోత దృష్టిని ఆకట్టుకొనే క్రమాన్ని ఆయన ‘గుణీభూత వ్యంగ్య కావ్యప్రకారం’ అంటూ నిర్వచించాడు. అలాంటి ఉటంకింపులు ఉదాహరణలు అనుచరుల ఇంట శుభకార్యానికి తరలివచ్చిన రాజువలె దర్జాగా ఉండాలని ఆ ముంగండ పండితుడి తీర్మానం. అవి పాలు, పంచదారలా కలగలిసిపోవాలని తాత్పర్యం.

వేదాలు ఉపనిషత్తులు బ్రాహ్మణాలు పురాణాలు... వంటి వేదధర్మాన్ని విపులీకరించే సాహితీశాఖలు- జయకావ్యానికి ఎంతో ముందువే. వాటి సారాంశాన్ని మనం ఇప్పుడు చెప్పుకొంటున్న ‘పాఠకమిత్ర’ వ్యాఖ్యాన రూపంలో, ఒక ఇతిహాసంగా రూపొందించే కర్తవ్యాన్ని వ్యాసమహర్షి చేపట్టారు. అది జయకావ్యం. దాన్ని ఆయా కాలాల్లోని ప్రజలకు చేరువ చేసే విధంగా, ధార్మిక జీవనసూత్రాలను అనుసంధానిస్తూ, మనుగడను మంగళకరంగా మలచే దిశగా వ్యాసశిష్యులు- జయకావ్యాన్ని భారతంగా, మహాభారతంగా తీర్చిదిద్దారు. అది ఆనాటి యుగధర్మం. కాలానుగుణమైన ధర్మ సమన్వయాలు- యుగావసరాలు. విశ్వశ్రేయస్సు పరమలక్ష్యంగా వేదాల సారాంశం ఇలా క్రమంగా ధార్మిక విశ్వరూపాన్ని సంతరించుకొన్న ఇతిహాసం కాబట్టి- మహాభారతానికి ‘పంచమవేదం’ అనే ఖ్యాతి వచ్చింది. ఇంతకాలంగా జ్ఞానదీపమై వికాసాన్ని పంచుతూ వస్తోంది. పంచుతూనే ఉంటుంది!

- ఎర్రాప్రగడ రామకృష్ణ

Read latest Editorial News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని