బ్రహ్మజ్ఞానం

మనిషి ఏది సాధించినా, అది దైవానుగ్రహంగా భావించాలి. మనిషికి ఏది ప్రాప్తించినా, దైవ ప్రసాదంగా స్వీకరించాలి. కష్టసుఖాలు, జయాపజయాలు, మానావమానాలు... ఇవన్నీ దైవలీలలు. పెద్దలు చెప్పే ఈ

Published : 20 May 2022 00:25 IST

మనిషి ఏది సాధించినా, అది దైవానుగ్రహంగా భావించాలి. మనిషికి ఏది ప్రాప్తించినా, దైవ ప్రసాదంగా స్వీకరించాలి. కష్టసుఖాలు, జయాపజయాలు, మానావమానాలు... ఇవన్నీ దైవలీలలు. పెద్దలు చెప్పే ఈ మాటల్లో ఎంతో రహస్యార్థం దాగి ఉంది. మనిషి పొందే ప్రతి అనుభవం పరమాత్మ వల్లనే కలుగుతుందని శాస్త్రం అంటుంది. వస్తువులు కంటికి కనపడాలంటే వెలుతురు ఉండాలి. మనం ఒక వస్తువును చూస్తున్నామంటే, ఆ వస్తువుతోపాటు వెలుతురునూ చూస్తున్నామన్నమాట. అలాగే మనిషి చూస్తున్నా నడుస్తున్నా శ్వాసిస్తున్నా ఆలోచిస్తున్నా, అతడిలో ఆత్మచైతన్యం ఉన్నందువల్లనే వీలవుతోంది. ఆ చైతన్యాన్ని ఆత్మగాను పరమాత్మగాను చెబుతారు. ఈ మహోన్నత సత్యాన్ని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం.

వెన్నెలకు మూలం చంద్రుడని అజ్ఞానం, సూర్యుడని విజ్ఞానం, పరమాత్మ అని బ్రహ్మజ్ఞానం చెబుతాయి. ఈ దివ్యజ్ఞానాన్ని సాధించాలంటే యోగ్యత కావాలి. నేను నాది అనే అహంకార మమకారాలు లేని శుద్ధమనసు, సూక్ష్మబుద్ధి మనిషికి ఉండాలి. మనిషి తన తప్పులను తానే సవరించుకునే గుణం, వాస్తవాలను ప్రతిబింబించే ఆలోచన, సంస్కారాలను సరిజేసుకునే చిత్తం కలిగి ఉండాలి.

బ్రహ్మం, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మా నందం, బ్రహ్మవిద్య అనే అంశాలను ఉపనిషత్తులు చర్చిం చాయి. ఇవి సగటు మనిషి మనసుకు బుద్ధికి అందనివని, వీటిని బోధనాంశాలుగా కాకుండా సూచనాత్మకంగా తెలుపుతాయి. సృష్టికి మూలమైన బ్రహ్మపదార్థాన్ని అగో చరం అనిర్వచనీయం అరూపం అనంతం అని చెబుతూనే, ఆ తత్త్వాన్ని సూచించేందుకు ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క పదాన్ని ప్రయోగించింది. సత్యం జ్ఞానం అనంతం అని తైత్తిరీయం, సత్‌ అని ఛాందోగ్యం, తురీయం అని మాండూక్యం, అక్షరమని ముండకోపనిషత్తు అన్నాయి. ఈ బ్రహ్మతత్త్వాన్ని అర్థం చేసుకునేందుకు మనిషి ఎక్కడెక్కడో వెతకనవసరం లేదని, సర్వవ్యాపకమైనందువల్ల మనిషి హృదయంలోనూ ఆత్మగా ఉందని, అక్కడే అన్వేషించమంటాయి. సూక్ష్మబుద్ధితో చేసే ఈ అన్వేషణను బ్రహ్మవిద్యగా, దీని ఫలితాన్ని బ్రహ్మానందంగా ఉపనిషత్తులు చెబుతాయి.

ఆత్మను వస్తువుగా భావించడం, ఆత్మసాక్షాత్కారాన్ని దైవదర్శనాన్ని పొందాలనుకోవడం అజ్ఞానంగా వీరికి తోస్తుంది. ధ్యానంలో దైవదర్శనమైనా, అది కేవలం మనోకల్పితంగానే భావిస్తారు. బ్రహ్మానుభవం అనేది వేరే ప్రత్యేకంగా వీరికి ఉండదు. దేవతార్చనకన్నా మానవోద్ధరణే శ్రేష్ఠమైన సత్కర్మగా వీరు భావిస్తారు. దైవాన్ని విగ్రహానికి మండపానికి ఆలయానికి పరిమితం చేయరు... ప్రతి ప్రాణిలోనూ దర్శిస్తారు. ఏ ఆడంబరాలూ లేనందు వల్ల శిష్యుల ద్వారానే వీరు లోకానికి పరిచయమవుతారు. సత్‌ సాంగత్యం అనే నావలో పయనించేవారికే వీరు తారసపడతారు. లోకానికి హితబోధ చేయాలన్నా మార్గదర్శనం చూపాలన్నా ఈ ఉత్కృష్టజ్ఞానం కలిగినవారే అర్హులు.

- పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని