Published : 21 May 2022 00:11 IST

దయాదృష్టి

రెండు రాజ్యాల మధ్య భీకర పోరు సాగుతోంది. చివరికి ఒక రాజ్యానికి చెందిన యువరాజు వైరి వీరుడైన వృద్ధరాజును ఓడించి కత్తిని అతడి కుత్తుకపైన పెట్టాడు. వృద్ధరాజు కళ్లలో ప్రాణభీతి కనిపించింది. చేతులు జోడించి చంపవద్దంటూ యువరాజును శరణుకోరాడు. అరివీరభయంకరుడైన యువరాజు హృదయంలో జాలి, కరుణ గంగలా వెల్లువెత్తాయి. క్షమించి వృద్ధరాజును ప్రాణాలతో వదిలేశాడు. అది చూసిన ఇరుపక్షాల సైనికులూ ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. వృద్ధరాజు శౌర్యవంతుడైన యువరాజుతో సంధిచేసుకుని తన కుమార్తెనిచ్చి పెళ్ళి చేశాడు. చరిత్రలో ఇలాంటి గాథలెన్నో ఉన్నాయి. మహాభారత రణరంగం చివరి ఘట్టంలో నాయకుడైన దుర్యోధనుడి మెప్పుకోసం నిద్రిస్తున్న ఉపపాండవుల గొంతులు కోశాడు గురుపుత్రుడైన అశ్వత్థామ. అర్జునుడి ప్రతీకార చేష్టతో ఘోర అవమానానికి గురయ్యాడు. ద్రౌపది దయాభిక్షతో ప్రాణాలను దక్కించుకున్నాడు. పాండవులకు ఆదిగురువై అగ్రతాంబూలం అందుకుంటున్న వేళ కృష్ణపరమాత్మ పట్ల అసూయ, వైరిభావం కనబరచి వినరాని మాటలతో నిందించాడు శిశుపాలుడు. అతడి తల్లికిచ్చిన వరాన్ని దృష్టిలో ఉంచుకుని నూరుతప్పుల వరకు దయాదృష్టితో భరించాడు కృపా ళువైన పరమాత్మ. ఆపై కఠినంగా శిక్షించక తప్పలేదు. యుద్ధరంగంలో నిరాయుధుడైన శత్రువును ప్రాణ భయంతో పరుగులు తీసే ప్రత్యర్థిని, విరథుణ్ని, పిరికి పందలను, స్త్రీ బాల వృద్ధులను దయతో వదిలివేయమని బోధించింది యుద్ధనీతి.
చంపదగిన శత్రువుకైనా కీడు చెయ్యక మేలు చేయమని ఏనాడో చెప్పాడు వేమన. శరణన్న శత్రువును విడిచిపెట్టే జాలి, కరుణ, దయ మన దేశవాసుల్లో మెండుగా ఉన్నాయి. అందుకే ప్రాణాలను తీసిన నరహంతకులకు సైతం పశ్చాత్తాపానంతరం వారి ప్రవర్త నలో వచ్చే మార్పునుబట్టి క్షమాభిక్ష అమలుచేస్తారు. మనిషికంటే మానవత్వం గొప్పది. నీతి, న్యాయం, ధర్మం, సమాజ విలువలు అంతకంటే గొప్పవి. ప్రాణం ఇంకా గొప్పది. వీటిని కాపాడుకోవలసిన బాధ్యత అందరిదీ. ఎన్నో తప్పులు చేసిన దోషి ఒక్కోసారి శిక్షనుంచి తప్పించుకోవచ్చేమోగానీ- నిర్దోషి శిక్షకు లోనుకాకూడదని న్యాయశాస్త్రం చెబుతోంది. భగవంతుడికి ఆర్తత్రాణ పరాయణుడని పేరు. కష్టాల్లో కుంగేవారు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే స్వామి తప్పక రక్షిస్తాడు. మకరితో పోరుకు పాల్పడిన గజేంద్రుడు స్వశక్తితో ఎంతగా నిలువరించినా విజయం లభించలేదు. ప్రాణం కడగట్టే సమయంలో ఆర్తితో- నీవుతప్ప ఇతరులెవ్వరూ రక్షించలేరని ఎలుగెత్తి శ్రీహరిని ప్రార్థించాడు. కరుణాంతరంగుడైన స్వామి పరుగులు పెడుతూ వచ్చి దయావర్షం కురిపించి కరిరాజును కాపాడాడు. కురుసభలో వస్త్రాలు హరిస్తున్నప్పుడు సిగ్గువదలి చేతులెత్తి మనసారా ప్రార్థించిన ద్రౌపది మొరను కూడా కరుణాదృష్టితో ఆలకించాడు పరమాత్మ. రావణుడిచేతిలో అవమానం పొంది లంకనుంచి బహిష్కృతుడైన విభీషణుడు భయకంపితుడై శ్రీరాముణ్ని శరణుకోరాడు. సుగ్రీవ జాంబవంతాదులు అడ్డుకుని శత్రువర్గంలోని వ్యక్తి అని సందేహించినా ‘దీనులకు అభయమివ్వడమే నా శపథం’ అన్నాడు శ్రీరాముడు స్థిరనిశ్చయంతో. కాళ్లకు మొక్కి నమస్కరించిన విభీషణుణ్ని ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలడిగాడు రాఘవుడు. అతణ్ని ఊరడించి, ధైర్యాన్ని నింపాడు. అందుకే రాముడు దేవుడయ్యాడు.
అజ్ఞానంతో పాపజీవనం గడిపిన వ్యక్తులు తమ తప్పులు తాము తెలుసుకోవాలి. పరివర్తనతో ద్రోహచింతనం విడనాడాలి. మనసా వాచా భగవంతుణ్ని శరణుకోరితే అతి శీఘ్రంగా వారు దైవకృపకు పాత్రులవుతారు. రెక్కల చాటున పిల్లల్ని దాచి భయాన్ని పోగొట్టే పక్షిలా తోడుంటాడు పరంధాముడు. ఇదే భగవదవతార రహస్యం!

- మాడుగుల రామకృష్ణ

Read latest Editorial News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని