Published : 22 May 2022 00:29 IST

భగవద్దాసు రామదాసు

తారక మంత్రంలోని రుచిని ఆస్వాదించి, అందరికీ పంచిన భక్త శిఖామణి కంచర్ల గోపన్న. ఇతడు రాముడికి పరమ భక్తుడు. అందువల్ల రామదాసుగా ప్రసిద్ధుడయ్యాడు. పూజా పునస్కారాలు లేకుండా భద్రగిరి మీద ఉన్న సీతారామలక్ష్మణ విగ్రహాలకు ఈయన కోవెల, ప్రాకారాలు లాంటివన్నీ కట్టించాడు. ఆ సమయంలో ఆయన భద్రాచలం తహసీల్దారుగా పనిచేసేవాడు.

బాల్యంలోనే గోపన్న మనసులో రామభక్తి పాదుకొంది. అప్పుడే ‘ఏల పుట్టకపోతి ఆనాడే రాముల తోడు’ అని సంకీర్తనలు చేయడం ప్రారంభించాడట.

ఎప్పుడూ భజన గోష్ఠులతోనూ, భాగవత సత్కారాలు చేస్తూ కాలం గడిపేవాడు గోపన్న.  కబీరుదాసు అతడి దగ్గరకే వచ్చి రామతారక మంత్రాన్ని ఉపదేశించాడని ప్రచారంలో ఉన్న కథ. ఆ సందర్భంలోనే గోపన్న ‘తారకమంత్రము కోరిన దొరకెను ధన్యుడనైతిని ఓరన్నా’ అనే కీర్తన రచించాడు. ఉన్న సంపాదనను హరిదాసులకు ఇచ్చేసి కట్టుబట్టలతో మేనమామలైన అక్కన్న, మాదన్నల సహాయంతో భద్రాచలానికి ఉద్యోగంలో చేరడానికి వెళ్ళిపోయాడు.

రాజద్రవ్య అక్రమ వినియోగ నేరంతో చెరసాల పాలయ్యాడు రామదాసు. ఆ సందర్భంలో ‘ఏటికి దయ రాదు’ అనే కీర్తనలో ‘పన్నెండేండ్లాయెనే శ్రీరాములు బందిఖానాలో యున్నాను’ అని పాడుకొన్నాడట.

ప్రపంచమంతా రామమయంగానే భావించాడాయన. ఆ విషయాన్ని ఉదాహరణలతో తన కీర్తనలలో పొందుపరిచాడు. ‘అంతా రామ మయం, ఈ జగమంతా రామ మయం’ అనే కీర్తనలో ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ‘రాముడు మనకు అండగా ఉంటే మనకు తక్కువేమిటి?’ అనే గాఢ విశ్వాసాన్ని ‘తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ’ అనే కీర్తనలో చెప్పాడు. ‘రాముని వారము మాకేల విచారము’ అనే కీర్తనలో ‘రాముడు తోడుండగా మనకెందుకు విచారం’ అను కుంటూ తన భక్తిని, ఆయన పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. దొంగల బాధ నుంచి తప్పించమని రాముణ్ని వేడుకుంటూ ‘క్రమ్ముకొని శత్రువులు హమ్మనుచు వచ్చెదరు. ఒమ్మైన బాణములిమ్మ రావ! ప్రభో పాహి రామప్రభో’ అని వేడుకుంటూ కీర్తించాడు.

రామదాసు రచనలుగా గుర్తుపట్టగలిగిన కీర్తనలు 108 వరకు మాత్రమే లభ్యమవుతున్నాయి. వీటి సంగీత సరళి స్పష్టమైన భావస్ఫురణతో సామాన్య జనానికీ అందుబాటులో ఉండేటంత సుగమంగా ఉంటుంది. ఆనందబైరవి రాగంలో కీర్తనలు చేసిన మొదటి వాగ్గేయకారుడు రామదాసేనని చరిత్ర చెబుతోంది. సంస్కృత కీర్తనలలోనూ రాముణ్ని కీర్తించాడు రామదాసు.

‘ఏ తీరుగ నను దయచూసెదవో’, ‘గరుడగమన రారా నను నీ కరుణనేలుకోరా’, ‘ఓ రాఘవాయని పిలిచిన ఓహోయనరాదా’ మొదలైన కీర్తనలు ఆర్తితో కూడిన రామదాసు భక్తికి నిదర్శనాలు. అవి భక్తిపూర్వకంగా రాముడి పాదాల చెంత ఉంచిన స్వరపుష్పాలు.

కేవల భక్తి మార్గమే కాకుండా జ్ఞాన మార్గాన్ని తోడు చేసుకొన్న యోగి పుంగవుడు రామదాసు.  ‘భళి వైరాగ్యమెంతో బాగైయున్నది చంచలమైన నా మనసు నిశ్చలమై యున్నది’ అనే సైంధవి రాగ కీర్తన దీనికి ఉదాహరణ.

‘పాహిరామ ప్రభో’ అనే కీర్తన రాముడి రూపాన్ని కన్నులలో నింపుకొని రాసినది. ఇలా భక్తి, ఆర్తి, అనురక్తి, నిందాస్తుతులతో ఆ జగదభి రాముణ్ని కీర్తిస్తూ ఆయనలోనే ఐక్యమైన దాసాను దాసుడు రామదాసు.

- గంటి ఉషాబాల

Read latest Editorial News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని