Published : 24 May 2022 00:21 IST

ఆత్మస్తుతి-ఆత్మనింద

త్మస్తుతి,  ఆత్మనింద రెండూ చాలా చెడ్డవి. కొన్ని సందర్భాల్లో కొందరు ఆత్మనింద చేసుకుంటారు. అలాంటి చర్యకు అనాలోచితంగా  కొందరు,  ఏమవుతుందిలే అని మరికొందరు పాల్పడతారు. ఏదేమైనా ఆత్మస్తుతి లాగానే ఆత్మనింద వల్లా మనిషికి చెప్పలేని నష్టం కలుగుతుంది.

నిత్యజీవితంలో మనకు అనేకానేక ఘటనలు ఎదురవుతాయి. సహవిద్యార్థులు, సహోద్యోగులు ఉన్నత పదవులు అలంకరించినప్పుడు సామాన్యుడిగా మిగిలిపోయిన  వ్యక్తి  ఆత్మన్యూనతకు లోనవుతాడు. ఆత్మన్యూనతవల్ల- సామర్థ్యం కలిగిన అంశాల్లో సైతం మనిషి వెనకబడిపోతాడు. ఆధిక్య(నేను గొప్ప అనే)భావన ఎంత నష్టం కలగజేస్తుందో ఆత్మన్యూనత సైతం అంతే కీడుచేస్తుంది.

ఇంద్రియాలలో మనసు, ప్రాణులందలి బుద్ధి తానే అంటాడు శ్రీకృష్ణభగవానుడు. అదీ మనసు గొప్పతనం! అది  తెలుసుకుని మనిషి ఆత్మన్యూనత, ఆత్మాధిక్యత వంటి భావాలను విడనాడాలి. నిందాస్తుతుల పట్ల సమభావం గలవాడు తనకు ప్రీతిపాత్రుడని గీతలో భగవానుడు చెప్పడం విశేషం!

మనిషి విజయాలు పొందినప్పుడు తనను తాను గౌరవించుకోవాలని, అలా చేయడంవల్ల శారీరక, మానసిక శక్తి స్థాయులు పెరుగుతాయని మానసిక నిపుణుల సూచన. ఎదుటివారిని గౌరవించడం ఎంత ముఖ్యమో తన సామర్థ్యం పట్ల ప్రశంసాపూర్వక భావన కలిగి ఉండటం సైతం అంతే ముఖ్యమని,  అది వ్యక్తి  ఎదుగుదలకు మానసిక సామాజిక పురోగతికి తోడ్పడుతుందని నిపుణులు చెబుతారు.

ఏదైనా ఒక పనిని పదేపదే చేసినప్పుడు   అలవాటుగా మారుతుంది. మనం మన గురించి మంచి అభిప్రాయం కలిగి ఉండటం,   సద్భావనతో కూడిన సందేశాలను పదేపదే  అంతశ్చేతనకు పంపడంవల్ల,  సుప్తచేతనాత్మక మనసు దాన్ని పదిలం చేసుకుని  మనలోని సానుకూల భావ పరంపరను అలవాటుగా మారుస్తుంది.

మన ఆలోచనలు మంచివైనప్పుడు మనసుపట్ల ప్రశంసాపూర్వక భావం ప్రదర్శించాలి. అప్పుడు మనసు మనతో స్నేహం చేస్తుంది. ఏదైనా కార్యసాధన చేసినప్పుడు;  ఒకప్పుడు సాధించలేని గొప్ప కార్యాన్ని సాధించినప్పుడు  ఆత్మకు ప్రశంసాపూర్వక కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇక అప్పుడు జరిగే సానుకూలత పరిధి,  విస్తృతి వర్ణించలేనివి.  మానసిక శక్తిస్థాయులు విశేషంగా పెరుగుతాయి. అంతే కాక  కార్యసాధన చేయలేని సమయంలో సైతం  తాను తక్కువ అని భావించక పోవడంవల్ల ఆవిర్భవించే సానుకూలశక్తి వల్ల కార్యాన్ని సాధించే శక్తి ప్రవర్ధిల్లుతుందని  పెద్దలు చెబుతారు. ఆత్మస్తుతే కాదు, ఆత్మనింద సైతం ఎన్నడూ పనికిరాదు. మరొకరు వినగలిగేలా ఆత్మనింద చేసుకుంటే  తన వినమ్రత, నిరాడంబరత వ్యక్తమై అలా తాను గౌరవం పొందవచ్చునని భావిస్తే అది పొరపాటు. అది ఎంతమాత్రం సరికాదన్నది  విజ్ఞుల భావన. సానుకూల, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు సమభావం కలిగి ఉండటం వ్యక్తి  ప్రతిష్ఠను, శ్రేయస్సును ఇనుమడింపజేస్తుంది.
ఇది మహాభారతం, భీష్మ పర్వంలోని భగవద్గీత ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మానవాళికి ఇచ్చిన దివ్య సందేశం.

- గోపాలుని రఘుపతిరావు

Read latest Editorial News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని