ఆంజనేయం... మహావీరం!

శ్రీమద్రామాయణంలో రాముడు నాయకుడిగా అన్ని కాండల్లో కనిపిస్తాడు. కాని, రామాయణానికి ఆత్మ సదృశమైన సుందరకాండకు హనుమంతుడే నాయకుడు. రాముడు బాహ్యంగా నరుడే అయినా, అంతర్లీనంగా అనంత పరబ్రహ్మ చైతన్యం.

Published : 25 May 2022 00:43 IST

శ్రీమద్రామాయణంలో రాముడు నాయకుడిగా అన్ని కాండల్లో కనిపిస్తాడు. కాని, రామాయణానికి ఆత్మ సదృశమైన సుందరకాండకు హనుమంతుడే నాయకుడు. రాముడు బాహ్యంగా నరుడే అయినా, అంతర్లీనంగా అనంత పరబ్రహ్మ చైతన్యం. ఆ పరమాత్మను సేవించి, తరించిన వేదమూర్తి- ఆంజనేయుడు! హనుమ అనే పదానికి ఉపనిషదర్థం వేదసారం.

నిరుపమాన భక్తిభావన, నవ నవోన్మేష ఆచరణాత్మక కార్యసాధనకు అంజనానందనుడు ప్రతీక. భక్తి అనే మాట విస్తృతి పొందితే ధర్మం అవుతుంది. ధర్మస్వరూపుడైన రాముణ్ని అనుసరించి భక్తి అనే ధర్మానికి పట్టాభిషేకం చేసిన పావన చరితుడు- హనుమ. మాటలో మంచితనం, పనిలో దృఢసంకల్పంతో అడ్డంకులు అధిగమించి కర్తవ్యమే పరమావధిగా తన మూర్తిమత్వాన్ని పవనాత్మజుడు ప్రతిఫలింపజేశాడు. అకార, ఉకార, మకార సంయోగంతో ఏర్పడిన ‘ఓం’ అనే ఏకాక్షరం పరబ్రహ్మాకృతికి సంకేతం. ఇందులో ‘మ’కారాత్మక రుద్రస్వరూపమే మారుతి- అని పరాశర సంహిత పేర్కొంది. ‘హర’ అనే శివ శబ్దం లోని ‘హ’కారం హనుమ వాచకం, ‘ర’కారం రామ సూచకం. సమస్త దేవతాశక్తులు, సకల దేవగణాల యుక్తుల సమ్మిళిత రూపంగా హనుమను వాల్మీకి దర్శించాడు.

ధర్మకర్తృత్వం, భక్తి భోక్తృత్వం, జ్ఞాన జ్ఞాతృత్వాల మేలుకలయిక హనుమ. బుద్ధి, ధైర్యం, శక్తి, జాగృతి, ఆరోగ్యం, ప్రసన్నత్వం, ప్రళయత్వం, విధేయత అనే అష్ట విధ గుణాల వజ్రాంగ దేహుడు- ఆంజనేయుడు. సర్వేసర్వత్రా పరుల హితం కోసమే పాటుపడి తన జీవితాన్ని ధన్యం చేసుకున్న ఆదర్శమూర్తి- వాయునందనుడు. శ్రీమద్రామాయణం ఉత్తరకాండలో ఆంజనేయుడి సమగ్ర అవతార తత్త్వం గోచరమవుతుంది. ఈశ్వరాంశతో విద్యుల్లతల రాశిగా అంజనకు హనుమ సాకారమయ్యాడు. సూర్యమండలానికి తరలి వెళ్ళి, అఖిల విద్యారూపుడిగా ఆవిష్కారమయ్యాడు. దేవతల వరాల సిరులతో వీరాంజనేయుడిగా విలసిల్లాడు. జితేంద్రియుడిగా అహంకార, మమకారాల్ని పరిత్యజించి ఆనందమయ సుప్రసన్నాంజనేయుడిగా అజేయ పరాక్రమవంతుడిగా ప్రాదుర్భవించాడు.

వైశాఖ బహుళ దశమినాడు అంజన-కేసరి దంపతులకు ఆంజనేయుడు జన్మించాడు. అంజన అంటే అత్యున్నతమైన తపోనిష్ఠ. కేసరి అంటే సర్వశ్రేష్ఠం. సర్వోత్కృష్ట, అత్యున్నత భక్తిసాధనా రీతితో భగవదంశను ప్రతిఫలంగా పొందారు. దశమి తిథి కలిమికి, బలిమికి, చెలిమికి ప్రతీక. మాధవమాసం వైశాఖం. శ్రీరాముడిని తన కలిమితో ప్రసన్నం చేసుకుని, వానరుల చెలిమితో రామకార్యాన్ని సాధించి, తన బలిమిని ప్రదర్శించిన కారణజన్ముడు హనుమంతుడు. వైశాఖంలో వైధృతి యోగంలో విశిష్ట దివ్యగుణాల సమ్మిళితంగా జన్మించిన అనిల కుమారుడు అనితరసాధ్యుడని వానరగీతి కీర్తించింది. పరమాత్మ రాముడి రూపంలో అవతరిస్తే, ఆ పరమాత్మ వైభవాన్ని లోకానికి సాధికారికంగా చాటి చెప్పడానికి వేదసార స్వరూపమే హనుమగా వెల్లివిరిసింది. శబ్ద బ్రహ్మమయమైన వేద హృదయం రామాయణంలో అణువణువునా తొణికిసలాడుతుంది. వేద ధర్మాన్ని ఆచంద్ర తారార్కం నిలిపి ఉంచడానికి హనుమ వేదపురుషుడిగా అవతరించాడు. నిర్మల, నిరంజన, నిష్కామ్య భక్తి విశేషంతో పరమాత్మను చేరుకోవడం ఎవరికైనా సులభ సాధ్యమవుతుందని తన మూర్తిమత్వం ద్వారా నిరూపించాడు.

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని