శత్రుబాధలు

అజాతశత్రువుకైనా శత్రుబాధ తప్పదు. ధర్మరాజు ఎంత శాంతచిత్తుడు, వినయమూర్తి అయినా యుద్ధరంగంలో శత్రుసంహారం చెయ్యక తప్పలేదు. అటు పైన ‘అశ్వత్థామ హతః కుంజరః’ అనే అబద్ధం కూడా ఆడాల్సి వచ్చింది.

Updated : 29 May 2022 06:39 IST

జాతశత్రువుకైనా శత్రుబాధ తప్పదు. ధర్మరాజు ఎంత శాంతచిత్తుడు, వినయమూర్తి అయినా యుద్ధరంగంలో శత్రుసంహారం చెయ్యక తప్పలేదు. అటు పైన ‘అశ్వత్థామ హతః కుంజరః’ అనే అబద్ధం కూడా ఆడాల్సి వచ్చింది.

తనకు దీటైన శత్రువు జీవించి ఉండగా ‘కంటికి నిద్దుర వచ్చునే’ అన్నాడొక కవి. కంటిలోని నలుసు, చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ కంటె శత్రుబాధ ఎక్కువంటారు. అసలు శత్రుత్వానికి కారణం ఏమిటని ఆరాతీస్తే- ఎదుటివారిని చూసి ఓర్వలేనితనం, అత్యాశ, అతిస్వార్థం, అమానుషత్వం, అతికామం వంటివి కరకు బాణాల్లా కనిపిస్తాయి.

మనకు కలిసివచ్చే కాలంలో సిరిసంపదలు, పేరు ప్రఖ్యాతులు వస్తే అకారణ శత్రువులు ఏర్పడతారు. వీరు ఎంత లౌక్యులంటే- వారి చూపుల్లో గాని, ప్రవర్తనలోగానీ ఎక్కడా వారి క్షుద్రభావాలు వెల్లడి కావు. పంచదార పలుకులతో మనల్ని ప్రలోభపెడతారు. పైకి మిత్రులు, ఆత్మీయులు. లోపల అసూయ లావా కుతకుతలాడుతున్న అగ్నిపర్వతాలు.

అవకాశం లభిస్తే మొదటి అపకారం వీళ్లే చేస్తారు. చాటున మన గురించి తీవ్రమైన దుష్ప్రచారం చేస్తారు. మనల్ని ఏకాకుల్ని చేయడానికి మిత్ర, బంధువర్గాల్లో మనకున్న మంచి పేరు చెడగొట్టడానికి శతథా యత్నిస్తారు. ఔషధ సేవనంతో రోగవిముక్తి పొందవచ్చు. కాని, శత్రు విముక్తికి ఎలాంటి ఉపాయమూ లేదు.  

‘అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి’ అన్నాడు సుమతీ శతకకారుడు. అంతటితో శత్రుత్వం నశిస్తుందనలేదు. నేర్పుగా ఎలా జీవించాలో చెప్పాడంతే. నేర్పు అంటే దుష్పరిణామాల నుంచి ఉపాయంగా తప్పించుకోవడం. పాము పడగవిప్పి కాటు వెయ్యాలని మీద మీదకు దూకుతుంటే పాములు పట్టేవాడు ఎలా తప్పించుకుంటాడు? చివరకు పాము తలను దొరకబుచ్చుకుంటాడు...  అదీ నేర్పు అంటే!

ఇలాంటి నేర్పు పొందాల్సిన అవసరం కల్పించేవాడే శత్రువు. సోమరిపోతు, నిద్రాప్రియుడు కూడా ఇంట్లోకి పాము ప్రవేశించిందనగానే అప్రమత్తమై వేయికళ్లతో పాము జాడల కోసం వెతుకుతాడు. కనిపించగానే వెర్రి ఆవేశంతో కర్రదెబ్బలు కొడతాడు. ఇక్కడ పామే శత్రువు. దాన్ని చంపకపోతే అది మనల్ని చంపేస్తుంది.

శరీరం బాగున్నంతకాలం దిలాసాగా తిరిగే మనిషి రోగం సంక్రమించగానే డీలాపడిపోతాడు. పీనాసి కూడా ఎంతైనా వెచ్చించి వైద్యం చేయించుకుంటాడు. ఇక్కడ రోగమే శత్రువు.

ఇవన్నీ ప్రాపంచిక శత్రుబాధలు. అలౌకిక శత్రుబాధలూ ఉంటాయి. అవి ఆధ్యాత్మిక వైరం, నాస్తికత్వంతో అదృశ్యంగా వేధిస్తాయి. మనసును కలుషితం చేస్తాయి. అందువల్ల అసహజ, కృత్రిమ ప్రవర్తన కలిగి ఉంటారు. హేతువాద దృష్టితో అందరిలోనూ తప్పులు వెదుకుతారు. తద్వారా అందరూ వీరిని దూరంగా ఉంచుతారు. లేదా తామే దూరంగా ఉంటారు.

శత్రుబాధ వల్ల మనశ్శాంతి ఉండని మాట నిజమే. కాని, నిద్రాణంగా ఉండే శారీరక, మానసిక శక్తుల్ని అది వేగంగా జాగృతం చేస్తుంది. మనిషిని ఎల్లవేళలా సమర సన్నద్ధుడిగా ఉంచుతుంది. అదే శత్రులాభం.

విద్యార్థులు పరీక్షలను, దీనుడు దరిద్రాన్ని, వ్యాధిపీడితుడు రోగాన్ని, మోక్షాభిలాషి అరిషడ్వర్గాలను శత్రువులుగా గుర్తించి ఊరు కోకూడదు. తమలో నిద్రాణంగా ఉన్న అమోఘ శక్తులను జాగృతం చెయ్యాలి. వాటికి పదును పెట్టాలి. ప్రతిబంధకాలను చీల్చివేస్తూ విజయం వైపు సాగిపోవాలి.

- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని