ప్రాణవిద్య

ప్రాణాన్ని ఆధారంగా చేసుకుని సాగించే దైవాన్వేషణను ప్రాణవిద్య అంటారు. యంత్రాలు విద్యుచ్ఛక్తితో పనిచేస్తాయి. అలాగే విశ్వం అనే మహాయంత్రం దైవశక్తితో నడుస్తోంది. విద్యుచ్ఛక్తి కనపడకపోయినా, ఆ శక్తి కలిగిన తీగలను మనం చూడగలుగుతున్నాం. ...

Published : 07 Jun 2022 00:44 IST

ప్రాణాన్ని ఆధారంగా చేసుకుని సాగించే దైవాన్వేషణను ప్రాణవిద్య అంటారు. యంత్రాలు విద్యుచ్ఛక్తితో పనిచేస్తాయి. అలాగే విశ్వం అనే మహాయంత్రం దైవశక్తితో నడుస్తోంది. విద్యుచ్ఛక్తి కనపడకపోయినా, ఆ శక్తి కలిగిన తీగలను మనం చూడగలుగుతున్నాం. అలాగే దైవం అగోచరమైనా, దైవశక్తి అయిన ప్రాణాన్ని మాత్రం మనం గుర్తించగలుగుతున్నాం. మన మనుగడకు ఆధారమైన ప్రాణమే దైవమనే సత్యాన్ని తెలుసుకుని, కాలాన్ని ఆయువును దేహాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పెద్దలు మనకు బోధించారు. నిర్గుణదైవాన్ని పరమాత్మ అని, సగుణస్వరూపాన్ని ప్రాణమని వేదం అంటుంది. పరమాత్మను సూచించేందుకు ప్రాణశబ్దాన్ని వాడటం శాస్త్ర సమ్మతమంటారు పెద్దలు. ఆత్మ నీడగా, ఆత్మ ప్రతినిధిగా, ఆత్మ ప్రకాశంగా దీన్ని అభివర్ణించారు.

కాంతికిరణాలు అంతటా ప్రసరిస్తున్నా, వస్తువుపై పడితేగాని ప్రకాశించవు. అలాగే దైవం సర్వవ్యాపకుడైనా, ప్రాణశక్తి అనేదే లేకపోతే, ఆ దైవాన్ని ప్రతిబింబించే మాధ్యమం ఉండనందువల్ల ప్రకటితం కాడు. సర్వవ్యాపకమైన దైవశక్తి మనం పూజించే విగ్రహాల్లోను యంత్రాల్లోను కలశాల్లోను ప్రతిబింబించాలంటే, వీటిలో ముందుగా ప్రాణాన్ని ప్రతిష్ఠించాలన్నది ఆగమశాస్త్ర నియమం. ఆలయమూర్తులకు దైవశక్తిని ధారపోసే ఈ వైదిక ప్రక్రియను ప్రాణప్రతిష్ఠ అంటారు. ప్రశ్నోపనిషత్తు ప్రాణశక్తిని ఇలా కీర్తించింది- ‘సూర్యుడై ప్రకాశిస్తుంది, అగ్నిగా మండుతుంది, మేఘమై వర్షిస్తుంది, ఇంద్రుడిగా పాలిస్తుంది, చంద్రుడిగా పోషిస్తుంది, విశ్వానికి ప్రభువై లోకాలను ఏలుతుంది, చలించని పరమాత్మను ఆధారంగా చేసుకుని చలించే లోకాలను సృజిస్తుంది, సృష్టి స్థితి లయ కార్యాలను నిర్వహిస్తుంది, పంచభూతాలకు శ్రద్ధ మనసు ఇంద్రియాలకు జన్మనిస్తుంది’.  విశ్వపాలనకు వీలుగా ప్రాణశక్తి తనను తాను, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానమనే విభాగాలుగా చేసుకుంటుంది. ఇందులో మొదటిదైన మూలప్రాణం, సూర్యుడై విశ్వాన్నంతా  నడుపుతుంది. మేఘమై వర్షించి, భూమిని సారవంతం చేసి, అన్నంగా రూపొంది, పురుషుడి రేతస్సుగా స్త్రీ గర్భాన ప్రవేశించి, దేహాన్ని దాలుస్తుంది. భూమిని స్థిరకక్ష్యలో ఉంచి సమస్థితిని కలిగించేది అపానమని, వాయువై విశ్వమంతా వ్యాపించేది వ్యానమని, అగ్నితత్వమే ఉదానమని, భూమి ఆకాశాల మధ్య సంచరిస్తూ నక్షత్ర గ్రహగతులను నియంత్రించేది సమానమని శాస్త్రాలు చెబుతాయి.

మనిషిలో వ్యష్టి ప్రాణంగా, ప్రకృతిలో సమష్టి ప్రాణంగా ఉండే ఈ మహాప్రాణాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్రాణవిద్య మనకు బోధిస్తుంది. అన్నమే ప్రాణమని తెలుసుకుని, ప్రాణాయస్వాహా, అపానాయస్వాహా.... అనే పంచప్రాణాహుతులతోనే అన్నాన్ని దైవానికి నివేదించాలని, తానూ భుజించాలని చెబుతుంది. జీవులను కాచే భూమిని నీటిని పరిశుభ్రంగా ఉంచమని, ప్రాణవాయువును అందించే వృక్షాలను పరిరక్షించమని అంటుంది. సర్వజీవుల్లోని ప్రాణమే దైవమని గ్రహించి, జీవహింసలకు పాల్పడరాదని హెచ్చరించింది. ఈ ప్రాణవిద్యను శ్రద్ధగా ఆచరించే వ్యక్తికి, ఆత్మవిద్య సహజంగానే సిద్ధిస్తుంది.

- పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని