అసలైన ఆస్తిపాస్తులు

వీరుడైన ఒక రాజు శత్రురాజ్యాలను జయించి వారి సంపదలను కొల్లగొట్టి తనవిగా చేసుకొన్నాడు. విజయగర్వంతో విర్రవీగాడు. తన ఉన్నతికి తన శక్తిసామర్థ్యాలే తప్ప లక్ష్మీకటాక్షం కారణం కాదని లక్ష్మిని

Published : 08 Jun 2022 00:26 IST

వీరుడైన ఒక రాజు శత్రురాజ్యాలను జయించి వారి సంపదలను కొల్లగొట్టి తనవిగా చేసుకొన్నాడు. విజయగర్వంతో విర్రవీగాడు. తన ఉన్నతికి తన శక్తిసామర్థ్యాలే తప్ప లక్ష్మీకటాక్షం కారణం కాదని లక్ష్మిని అవమానించాడు. కోపించిన అష్టలక్ష్మి తన స్వరూపాలనుంచి ఒక్కొక్కటిగా దూరమైంది. ఏడుగురు లక్ష్ములు మాయమయ్యేసరికి రాజుకు రకరకాల బాధలు ఎదురయ్యాయి. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. చివరగా వెళ్ళిపోతున్న ధైర్యలక్ష్మి పాదాలపై పడి క్షమను అర్థించాడు. మనిషి ఏ సంపదను పోగొట్టుకొన్నా తిరిగి పొందవచ్చు గానీ ధైర్యాన్ని దూరం చేసుకొంటే జీవితమే లేదని వెళ్లవద్దని ప్రార్థించాడు. జాలిపడిన లక్ష్మి ఇతర స్వరూపాలతో అతనింట మళ్ళీ కొలువుతీరింది. మనోధైర్యం కోల్పోయిన మనిషి ప్రాణం లేని బొందితో సమానం. కొద్దిపాటి ధైర్యంనుంచి ప్రాణాలకు తెగించే సాహసం వరకు మనిషిని ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేస్తుంది. పిల్లల్ని దారికి తెచ్చేందుకు చీకటిని, బూచిని చూపించి భయపెడతారు తల్లిదండ్రులు. పిరికితనంతో పెరిగినవారు సమాజానికి ఉపయోగపడకపోగా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తారు.

పిల్లల పాలనలో పోషణలో కన్నవారి ఆలోచనలు స్థిరంగా ఉండాలి. పెంపకంలో ఇద్దరి పాత్రలు సమానమే అయినా ఆడపిల్లకు అమ్మ తక్షణ రక్షణ. గురువు, స్నేహితురాలు, మార్గదర్శి, అబల, అనుమానం, అజ్ఞానం, అనవసర భయాలు అనే గోడల్ని కూల్చి అమ్మాయిలు ధైర్యంగా పెరగాలి. పిరికితనంతో ఎదిగితే బతుకు భయంగా మారుతుంది. యౌవనం ఓ కీలక దశ. శరీరంలో, మనసులో వచ్చే మార్పుల్ని అర్థం చేసుకునే స్థాయికి చేరుకొంటారు. సమాజంలో తమ స్థానమేమిటో స్పష్టంగా అర్థమవుతుంది. ఆటపాటల్లో, చదువుసంధ్యల్లో ముందుకు దూసుకువెళతారు. ఎంతటి కష్టంలోనైనా కన్నీటిబొట్టు నేల రాల్చక నిలిచే ధీమంతులవుతారు. సుఖాల పల్లకిలో ఊరేగించక కష్టాల కడలిని కూడా చూపించాలి. పరిస్థితుల్ని ఢీ కొట్టి ఒంటరితనంలో ఓరిమితో నిలిచే పాఠాలు బోధించాలి. ప్రలోభాలకు లొంగకుండా విద్యల్లో రాణించేలా తీర్చిదిద్దాలి. కబళించే మేకవన్నె పులుల నుంచి తమను తాము కాపాడుకొనేలా తర్ఫీదునందించాలి. వివేకంతో లోకాన్ని చదివే తెలివిని నేర్పాలి. పిల్లల ప్రవర్తనలో ఊహించని మార్పులొస్తే పసిగట్టి లాలనతో చేరదీసి సమస్యను సహనంతో పరిష్కరించాలి. స్నేహాల హద్దుల్ని నియంత్రించి నిఘానేత్రంతో అనుక్షణం వారిని గమనించాలి.

ఒంటరి అంకె లాంటిది ఆడపిల్ల.తోడుగా పక్కన చక్కని మరో అంకెను చేర్చి ఆమె జీవితం పరిపూర్ణమయ్యేలా చేసేది అమ్మానాన్నలే. కారుచీకట్లో ఎన్నో భయాలు, సంశయాలు. చిరుమెరుపు ఆ చీకటిని చీల్చి వెలుగురేఖ నింపినట్లు లేత బతుకులకు అమ్మ తోడూనీడై నిలిస్తే- వారి బతుకులు బంగరుమయమే. క్షణికావేశంలో పిరికితనంతో ఎవరూ జీవితాన్ని అంతం చేసుకోకూడదు. సమస్యకు బలమైన ఆలోచనే పరిష్కారం. తల్లిదండ్రులు బిడ్డలకు ఇవ్వవలసిన ఆస్తులు- మేడలు మిద్దెలు, నగలు నాణ్యాలు, చీరెలు సారెలు కాదు. సమస్యల లోకంలో నిర్భయంగా బతికేందుకు పిడికెడు ధైర్యం, చిటికెడు ఆత్మవిశ్వాసం. అవే వెలకట్టలేని నిజమైన ఆస్తులు. బిడ్డల యోగక్షేమాలు నిరంతరం కాపుగాసి కాపాడితే కన్నవారి జీవితాలు, పిల్లల భవిష్యత్తు స్వర్గతుల్యమవుతాయి.

- మాడుగుల రామకృష్ణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని