శుభరాత్రి

మనిషికి నిత్యజీవితంలో పగటివేళ ఎంత ముఖ్యమో, రాత్రివేళ కూడా అంతే కీలకం. పగలంతా కష్టపడే మనిషికి రాత్రి విశ్రాంతిని ఇస్తుంది. తల్లివలె ప్రాణులను తన ఒడిలోకి చేర్చుకొని, సేదదీరుస్తుంది రాత్రి.

Updated : 09 Jun 2022 01:06 IST

మనిషికి నిత్యజీవితంలో పగటివేళ ఎంత ముఖ్యమో, రాత్రివేళ కూడా అంతే కీలకం. పగలంతా కష్టపడే మనిషికి రాత్రి విశ్రాంతిని ఇస్తుంది. తల్లివలె ప్రాణులను తన ఒడిలోకి చేర్చుకొని, సేదదీరుస్తుంది రాత్రి. అందుకే రాత్రిని వేదం కూడా ప్రస్తుతించింది. ఋగ్వేదంలోని దశమ మండలంలో ఏకంగా రాత్రి గురించి ఒక సూక్తమే కనబడుతుంది.

రాత్రికి నిఘంటువులలో ఎన్నో పేర్లున్నాయి. వాటిలో శర్వరి, నిశ, నిశీథిని, త్రియామ, క్షణద, క్షప, విభావరి, తమస్విని, రజని, యామిని, తమి, తమిస్ర, తామసి మొదలైనవి ముఖ్యమైనవి. శర్వరి అంటే వ్యాపారాన్ని శ్రమనూ నిలిపేవి. పనులు మానుకొనే సమయం అని అర్థం. నిశ అన్నా అదే అర్థం నిశీథిని అంటే నడిరేయి కలిగింది. సుఖాన్ని ఇచ్చేది కనుక రాత్రి అనిపేరు. త్రియామ అంటే మూడు జాములకాలం ఉండేది. జాముకు నాలుగుగంటలు. మూడు జాములకు పన్నెండు గంటలు. రాత్రివేళ పన్నెండు గంటలే కదా!

క్షణద అంటే యౌవనంలో ఉన్న యువతీయువకులకు ఆనందాన్ని ఇస్తుంది అని అర్థం. క్షప అంటే క్రియా చేష్టలను నిలిపి, విశ్రాంతిని ఇచ్చేది అని అర్థం. విభావరి అంటే సూర్యకాంతిని కప్పివేసి, చీకటిని సృష్టించేది అని అర్థం. తమస్విని అంటే చీకట్లకు నెలవైంది.

ఋగ్వేదంలోని రాత్రి సూక్తంలోని వర్ణనలు రమణీయంగా కని పిస్తాయి. తననుఆశ్రయించే వారికి ప్రశాంతతను ప్రసాదించే చల్లని తల్లిగా వేదం వర్ణించింది. కొండలు, లోయలు, సమతల ప్రదేశాలు, అరణ్యాలు, జనపదాలు, నగరాలు, దేశాలు అనే తేడా లేకుండా అంతటా పరచుకొని తన ప్రభావంతో రక్షించే దేవతగా రాత్రి కనిపిస్తుంది.

రాత్రి అగ్రజ(అక్క) వంటిదని, ఉషస్సు అనుజ(చెల్లి) వంటిదని, రాత్రి అనే అగ్రజ, ఉషాదేవిగా ఉన్న చెల్లెలికి ఆశ్రయం ఇచ్చే వాత్సల్యహృదయ అనే ప్రస్తుతి వేదంలో సాక్షాత్కరిస్తుంది.

‘ఓ తల్లీ! రాత్రీ! నీవు మా సమీపంలోకి క్రూరజంతువులు, దొంగలు, దుష్టులు, విషకీటకాలు రాకుండా మమ్మల్ని రక్షించు’ అనే మంత్రాలు రాత్రి సూక్తంలో దర్శనమిస్తాయి. రాత్రికి వేదం ఎంతటి ఉన్నత స్థానాన్ని కల్పించిందో ఈ సూక్తం వల్ల స్పష్టంగా తెలుస్తుంది. ఏ వస్తువునైనా నల్లగా మార్చి, కనబడకుండా చేసేది రాత్రి. దీనివల్ల రాత్రి ఎంత శక్తిమంతం అయిందో తెలుసుకోవచ్చు. రాక్షసులు రాత్రివేళలో సంచరిస్తారు. అందుకే వారికి ‘రాత్రించరులు’ అనే పేరు ఉంది. క్రూరకర్మలు చేసేవారు తమను ఎవరూ గుర్తించకుండా ఉండాలని రాత్రివేళలో సంచరిస్తుంటారు.

ప్రతి వస్తువులోనూ గుణదోషాలు రెండూ ఉంటాయి. మనిషి విజ్ఞతతో గుణాన్ని స్వీకరించి, దోషాన్ని వదిలేయాలి. రాత్రి విషయంలోనూ అదే వర్తిస్తుంది. రాత్రివేళను విశ్రాంతి తీసుకోవడానికి, సుఖంగా నిద్రించి, ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఉపయోగించుకుంటే మనిషికి సత్ఫలితాలు కలుగుతాయి. చెడుపనులు చేయడానికి రాత్రిని వాడుకుంటే జీవితమంతా కల్మషాల మచ్చ అలాగే ఉండిపోతుంది. ఏది స్వీకరించాలో మనిషి వివేకంతో తెలుసుకోవాలి.

బ్రహ్మసృష్టిలో ‘రాత్రి’ ఒక అమృతప్రసాదం. అది మధురానుభూతులకు నెలవు. అనురాగాలకు కొలువు, ఆనందాలకు వారధి.

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని