గరుడ చరిత్ర

సభ ప్రారంభంలో సభాసదులకు ఆహ్వానం పలికే సందర్భంలో ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు’ అనడం రివాజుగా కనబడుతున్నది. ఇది త్యాగరాజు కీర్తన. నారదాదులను మహాత్ములుగా పేర్కొన్నారు త్యాగరాజు. ఆ వరసలోనే గరుత్మంతులవారు వస్తారు.

Published : 11 Jun 2022 01:16 IST

భ ప్రారంభంలో సభాసదులకు ఆహ్వానం పలికే సందర్భంలో ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు’ అనడం రివాజుగా కనబడుతున్నది. ఇది త్యాగరాజు కీర్తన. నారదాదులను మహాత్ములుగా పేర్కొన్నారు త్యాగరాజు. ఆ వరసలోనే గరుత్మంతులవారు వస్తారు. గరుత్మంతుడి మాతృభక్తి లోకానికి గొప్ప ఆదర్శం. అందువల్లనే మనకు పూజనీయుడయ్యాడు.

గరుత్మంతుడు సర్వ ఉత్తమ గుణాలకు ఆలవాలం. అతడి పవిత్ర చరిత్రను మననం చేసుకున్నవారికి ఉత్తమ గుణశీలాలు అలవడతాయని నమ్మకం. విష్ణుదేవాలయాల్లో గరుత్మంతుడి పూజ ఉంటుంది. వేణుగోపాలస్వామి ఆలయంలో గరుడస్తంభం పూజలందుకుంటుంది. స్వామి విగ్రహానికి ఎదురుగా గరుడస్తంభాన్ని నిలుపుతారు. విష్ణువు గరుడధ్వజుడు. శ్రావణ శుద్ధ పౌర్ణమిని గరుడపంచమిగా కొందరు పాటిస్తారు. ఆదిశేషుడి బొమ్మకింద గౌరీదేవిని పెట్టి పూజ చేయడం సంప్రదాయం. పుట్టను పూజించే ఈ పద్ధతిని గరుడపంచమి వ్రతం అంటారు.

గరుత్మంతుడికి అంతటి ప్రాధాన్యం లభించడానికి కారణం- ఆయన లోకహితైక దృష్టి.

గరుత్మంతుడు పుట్టుకతోనే అమిత బలశాలి. తల్లి వినత- ఆమె అక్క అయిన కద్రువ వద్ద దాసిగా ఉండవలసి వచ్చింది. పెద్దతల్లి ఆజ్ఞవల్ల గరుత్మంతుడు కద్రువ కుమారులైన సర్పాలను వీపుపై మోయవలసి వచ్చింది. తనకు ఎంత బలపరాక్రమాలున్నా ధర్మాన్ని వీడకూడదు. తల్లిని దాస్య విముక్తురాలిని చేయడం తన ముఖ్య కర్తవ్యం!

‘మా అమ్మకు ఈ దాస్యం నుంచి విముక్తి లభించాలంటే ఏం చేయాలి?’ అని సూటిగా కద్రువ కుమారులనే అడిగాడు గరుత్మంతుడు. ‘అమృతం తెచ్చి ఇస్తే... మీ అమ్మకు దాస్యవిముక్తి కలుగుతుంది’ అని సర్పాలు సమాధానమిచ్చాయి. మరుక్షణమే గరుత్మంతుడు అమృతాన్ని సంపాదించి తేవడానికి బయలుదేరాడు. అనేక ఇబ్బందులు తలెత్తాయి. వాటినన్నింటినీ అవలీలగా అధిగమించాడు. గజ, కచ్ఛపాలను రెండు చేతుల్లో ఇరికించుకున్నాడు. వాటితో ఒక వృక్షంపై వాలాడు. ఆ చెట్టు పేరు రోహిణం. ఆ బరువుకు రోహిణం కొమ్మ విరిగిపోయింది. ఆ చెట్టు కొమ్మను ఆధారం చేసుకొని వాలఖిల్యులనే మునులు తపస్సు చేసుకుంటున్నారు. గరుత్మంతుడు వాలఖిల్యులు గాయపడకుండా జాగ్రత్తపడ్డాడు.

అమృత సాధన సులభం కాదు. గరుత్మంతుడు తన బలాన్ని సరైన సమయానికి ఉపయోగించాడు. సాధించాడు. అమృతాన్ని స్వార్థానికి ఉపయోగించుకోలేదు. అతడి కార్యదీక్షకు విష్ణువు సైతం సంతోషించాడు. గరుత్మంతుడికి ప్రత్యక్షమయ్యాడు.

‘వరం కోరుకో ప్రసాదిస్తా’ అన్నాడు స్వామి వాత్సల్యంతో.

‘స్వామీ! ఎల్లప్పుడూ మీ సమక్షంలోనే, మీ ముందు ఉంటూ, సదా మిమ్మల్ని సేవించుకొనే వరం అజరామరత్వం ప్రసాదించండి’ అని వేడుకున్నాడు గరుత్మంతుడు. స్వామి అనుగ్రహించాడు. విష్ణువుకు ధ్వజంపై చిహ్నంగా గరుత్మంతుడు నిలిచాడు. విష్ణువు తనకు తానే గరుత్మంతుడిని సారథిగా ఎన్నుకున్నాడు. ఈ విధంగా తన ఆదర్శ పవిత్ర జీవన విధానంలో గరుడ ఆళ్వారుగా పూజలందుతున్నాడు!

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని