పండంటి జీవితానికి...

మానవ జీవితం సుసంపన్నం కావడానికి గాను ప్రవర్తనా నియమావళిలో కొన్ని న్యాయాలను పాటించాలని, అవి పన్నెండు అని చెబుతున్నాయి గ్రంథాలు.     వాటిలో మొదటిది- ఇచ్చిపుచ్చుకొనే న్యాయం. తాము ఏదైనా పొందాలనుకునే వారు ముందుగా

Published : 12 Jun 2022 02:07 IST

మానవ జీవితం సుసంపన్నం కావడానికి గాను ప్రవర్తనా నియమావళిలో కొన్ని న్యాయాలను పాటించాలని, అవి పన్నెండు అని చెబుతున్నాయి గ్రంథాలు.     వాటిలో మొదటిది- ఇచ్చిపుచ్చుకొనే న్యాయం. తాము ఏదైనా పొందాలనుకునే వారు ముందుగా ఇవ్వడం నేర్చుకోవాలి. మొక్కలు, చెట్ల నుంచి ఫలాలు కావాలనుకునేవారు వాటికి సంరక్షణను ఇవ్వాలి.

తాము మారి ఆదర్శంగా నిలిచి ఎదుటివారిని మార్చే ప్రయత్నం చేయడం మానవతా న్యాయం. మూడోది- బాధ్యతా న్యాయం. అంటే... ‘ఎవరు చేసిన పనులకు వారే నిజాయతీగా బాధ్యత వహించాలి. అది మంచిదైనా చెడ్డదైనా సరే. అంతే తప్ప... మంచి జరిగితే తన ప్రతిభేనని, జరగరానిది జరిగితే ఎదుటివారి పైకి నెట్టే ప్రయత్నం చేయడం సరైన పద్ధతి కాదు. తరవాతది- ఏకాగ్రతా(లగ్న) న్యాయం. చేసే పనిపట్ల ఎప్పుడూ ఏకాగ్రత కలిగి ఉండాలి. ఎప్పటి పని అప్పుడే చెయ్యాలి. పనిమీదే మనసు లగ్నం చేయాలి. ఒకేసారి రెండు, మూడు పనులు చేయకూడదు. నేడు మానవ ప్రవర్తనలో ఇది ఎక్కువగా ఉంది. తింటూ చదవడం, బండి నడుపుతూ ఫోను మాట్లాడటం లాంటివి దీనికి ఉదాహరణ. దీనివల్ల ప్రయోజనానికి బదులు ప్రమాదాలు జరిగే అవకాశాలే ఎక్కువ.

తెలిసో, తెలియకో జరిగిన పొరపాట్లను తలచుకుంటూ ఉండడం వల్ల ప్రయోజనం ఉండదు. గతాన్ని నెమరువేసుకుంటూ కూర్చోకుండా జరగవలసిన కార్యాల గురించి ఆలోచించాలి అనేది ‘గతజలసేతు బంధన’ న్యాయం. ‘ఓర్పు బట్టే ప్రతిఫలం అనేది మరొక న్యాయం. విసుగు, విరామం లేకుండా గట్టి పట్టుదలతో ప్రయత్నించండి.  ఓడిపోయినా నిరాశపడకుండా ఓర్పు వహించి మరల మరల ప్రయత్నించండి. ఫలితం బాగుంటుంది’ అనేది దీని బోధనా సారాంశం. ప్రతిదీ మనం అనుకున్నట్టు జరగదు. జరిగేటట్లు ప్రయత్నం చేయాలి. లేదా జరిగిన దానిలోని మంచిని గ్రహించే ప్రయత్నం చేయాలి. ఆ తత్వాన్ని అలవాటు చేసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. దీన్ని ‘కృత్య న్యాయం’ అని పేర్కొంటున్నాయి గ్రంథాలు.

మనల్ని మనం మార్చుకోగలిగితే మన జీవితాలూ మారతాయి. జీవితంలో ఒకసారి కోల్పోతే తిరిగి తీసుకోలేనివి కొన్ని ఉంటాయి. ఎదుటివారి పైకి విసిరిన రాయి, నోటినుంచి వెలువడిన మాట, ఒకసారి తప్పిపోయిన అవకాశం, గడిచిపోయిన కాలం, కోల్పోయిన నమ్మకం... అలాంటివే ఇవి జరగకుండా జాగ్రత్త పడాలని చెబుతోంది ‘ఎదుగుదల న్యాయం’. గతం, వర్తమానం, భవిష్యత్తు... ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. దానికి తగినట్లుగా సంబంధ బాంధవ్యాల పట్ల శ్రద్ధ వహించాలని చెప్పేది ‘సంబంధ బాంధవ్య న్యాయం’. ఆలోచనల్ని బట్టే మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. సరైన ఆలోచనలు చేయాలి అనేది ‘ఆలోచనా న్యాయం’.

చరిత్ర లక్షణం పునరావృతం అవుతూ ఉండటం. ఆయా మార్పులకు అనుగుణంగా తమ మార్గాన్ని, ప్రవర్తనను, జీవన విధానాన్ని మార్చుకుంటూ వెళ్ళాలి. ఇది ‘అనుసరణ న్యాయం’. మన ప్రయత్నాలను బట్టే ఫలితం ఉంటుంది. కాబట్టి ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అనే మాటను మననం చేసుకుంటూ ముందుకు సాగడం ‘ప్రేరణ న్యాయం’.

ఈ పన్నెండు సూత్రాలను కచ్చితంగా పాటిస్తే ‘పండంటి జీవితం మన సొంతం’ అని చెబుతోంది మన వాంగ్మయం.

- అయ్యగారి శ్రీనివాసరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని