ఏరువాక పున్నమి

‘జలసిరులతో పుడమి పులకించాలి. వర్షాలు హర్షాతిరేకంగా కురిసి ప్రకృతి పచ్చదనంతో శోభిల్లాలి. సేద్యం చేసే కర్షకుల జీవితాలు కళకళలాడాలి’ అని వేదం ఆకాంక్షించింది. ఆ శుభకామనలకు సాకార రూపమే- ఏరువాక పున్నమి. జాతికి అన్నంపెట్టే రైతులు

Published : 14 Jun 2022 01:07 IST

‘జలసిరులతో పుడమి పులకించాలి. వర్షాలు హర్షాతిరేకంగా కురిసి ప్రకృతి పచ్చదనంతో శోభిల్లాలి. సేద్యం చేసే కర్షకుల జీవితాలు కళకళలాడాలి’ అని వేదం ఆకాంక్షించింది. ఆ శుభకామనలకు సాకార రూపమే- ఏరువాక పున్నమి. జాతికి అన్నంపెట్టే రైతులు, తమ వ్యవసాయ పనుల్ని ఏరువాక పున్నమినుంచే ప్రారంభిస్తారు. ఏరు అంటే నాగలి. వాక అంటే దుక్కి దున్నడం. నాగలితో దుక్కిదున్ని, తమ కృషికి తగిన ఫలితం రావాలనే ప్రకృతిని, పరమాత్మను రైతులు వేడుకుంటారు. ‘నీటి బండిపై తరలివచ్చే వరుణదేవా! నీ దివ్య రథాన్ని యథేచ్ఛగా ఈ భూమిపై విహరింపజేయి. నీ అడుగుల సవ్వడితో పసిడిరాశులు పండాలి. కుటుంబాలన్నీ సౌఖ్యంగా, సుభిక్షంగా వర్ధిల్లాలి’ అని వరుణ సూక్తం అభిలషిస్తుంది. వేద విదులకు మంత్ర జపమే యజ్ఞం. గోపాలకులకు గోసేవే యజ్ఞం. రైతులకు వ్యవసాయమే యజ్ఞం- అని శ్రీమద్భాగవతం పేర్కొంది. సీత అంటే నాగేటి చాలు. జ్యేష్ఠ పౌర్ణమినాడు ఆరంభించే సీతాయజ్ఞం పవిత్ర కార్యక్రమం జాతి మనుగడ కోసం నిర్వహించే పర్వం.

తొలకరి పలకరించిన తరవాత, వచ్చే జ్యేష్ఠ పౌర్ణమినాడు కర్షకులు ఎడ్లను కడిగి, కొమ్ములకు రంగుల్ని పూసి, కాళ్లకు గజ్జెలు కట్టి మెడలో గంటల్ని అలంకరిస్తారు. ఎడ్లను కట్టే కాడిని పసుపు కుంకుమలు, పుష్పమాలికలతో తీర్చిదిద్దుతారు. ఎడ్లకు పాలపొంగలిని ఆహారంగా సమర్పిస్తారు. గ్రామంలోని రైతులంతా మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా పొలాలకు తరలివెళ్ళి దుక్కిదున్నడం ప్రారంభిస్తారు. గోగునారతో రక్షల్ని తయారుచేసి, పశుసంపద వృద్ధి చెందాలని కోరుకుంటూ పశువుల మెడలో గవ్వలు, నల్లపూసలతో కలిపి దండగా వేస్తారు. ఈ మాలికను ‘ఏరువాక బంధం’గా వ్యవహరిస్తారు. బసవేశ్వరుడు ఏరువాకను ప్రాకృతిక శక్తిగా దర్శించాడు. ప్రకృతిని భక్తిశ్రద్ధలతో పూజించడానికి, తమ పురోగతికి ఉపకరించే పశుగణాన్ని సమాదరించడానికి రైతులు ఏరువాక పున్నమిని జరుపుకొంటారు. ఈ పున్నమినాడు రైతులు భూమి పూజ నిర్వహించాలని రుగ్వేదం చెబుతోంది. తమ వ్యవసాయ భూమి మధ్యలో నవ ధాన్యాలు చల్లి, కొత్తకుండలో నీరు నింపి, ఆ నీటిలో పసుపు, కుంకుమలు, మృత్తిక, గోమయం వేసి ఆ పవిత్ర జలాన్ని పొలమంతా చల్లి, సస్యలక్ష్మి అనుగ్రహాన్ని ఆకాంక్షించాలని వేదం వివరించింది. ఏరువాక పున్నమిని వృషభోత్సవంగా, అనుడోత్సవంగా అధర్వవేదం ప్రస్తావించింది. కన్నడిగులు కారుణిపబ్బం అంటారు. మహారాష్ట్రలో కృషి ఉత్సవ్‌గా, ఉత్తరభారతంలో హల్‌యజ్ఞదివస్‌గా ఆచరిస్తారు.

కపిలవస్తు నగరంలో శుద్ధోదన మహారాజు ఏరువాకను లాంఛనంగా ప్రారంభిస్తూ, బంగారు నాగలితో దుక్కిదున్నేవాడని బౌద్ధజాతక కథలు వెల్లడించాయి. ఏరువాక పున్నమిని రైతు విజయోత్సవంగా పేర్కొంటారని గాథాసప్తశతి వివరించింది. శ్రీకృష్ణ దేవరాయలు ఏరువాక ఆరంభం సందర్భంగా రైతుల్ని సత్కరించి, వారికి వ్యవసాయ పరికరాల్ని అందించే సంప్రదాయాన్ని ఏర్పరచాడని ‘రామవాచకం’ ప్రకటించింది. ఏరువాక సందర్భంగా కాకతీయ సామ్రాజ్యంలో వ్యవసాయ క్షేత్రాల్లో చక్రవర్తులు నృత్యోత్సవాల్ని నిర్వహించి, రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించేవారని జాయపసేనాని ‘నృత్యరత్నావళి’లో పేర్కొన్నాడు. పంటలు చేతికి వచ్చాక రైతులు సంబరంగా జరుపుకొనే పండుగ సంక్రాంతి. బంగారు పంటలు పండటానికి, నవ్యక్రాంతులతో ఇంటింటికీ సంక్రాంతి తరలిరావాలని ఆరంభించే ఆనందాల ప్రాతిపదిక- ఏరువాక! అందరి ఆకలి బాధలు తీర్చడానికి అన్నదాతగా తాను అహరహం శ్రమించడానికి పునరంకితమవుతూ, ఆరుగాలం కష్టానికి సమాయత్తమయ్యే కర్షక జీవన కరదీపిక... ఏరువాక!

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌పటేల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని