వినదగునెవ్వరు చెప్పిన...

నువ్వు విన్నా వినకపోయినా, ఆచరించినా ఆచరించకపోయినా నీకు ప్రతిరోజూ ఎవరో ఒకరు ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. ప్రాథమికంగా చుట్టూ ఉన్నవారి మాటలు వింటూ కంటితో చూస్తూ విన్నదాన్ని

Published : 17 Jun 2022 00:10 IST

నువ్వు విన్నా వినకపోయినా, ఆచరించినా ఆచరించకపోయినా నీకు ప్రతిరోజూ ఎవరో ఒకరు ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. ప్రాథమికంగా చుట్టూ ఉన్నవారి మాటలు వింటూ కంటితో చూస్తూ విన్నదాన్ని చూసిన దానితో అనుసంధానం చేసుకుంటూ జ్ఞానాన్ని పెంపొందించుకుంటాం, మార్గాన్ని నిర్దేశించుకొంటాం. తల్లిదండ్రులు, గురువులు, బంధువులు, శ్రేయోభిలాషులు, పెద్దలు మన మంచిని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి మాటలు చెబుతూ ఉంటారు. ‘పెద్దలమాట చద్దిమూట’ అంటారు.  అవి జీవితాంతం పుష్టిని చేకూర్చేవే.

సద్గురువుల మాటలు సర్వదా శిరోధార్యం. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞానుల మాటలు,   గుండె లోతుల్లోంచి వచ్చిన అనుభవశాలి మాటలు, సర్వదా హితంకోరే స్నేహితుల మాటలు, కుటుంబ శ్రేయస్సు కోసం జీవిత భాగస్వామి ఇచ్చే అర్థవంతమైన  సలహాలు  సదా ఆచరణీయం... మనలోని లోపాలు మనకంటే ఎక్కువగా తెలిసిన శత్రువు మన గురించి మాట్లాడే మాటలూ జాగ్రత్తగా వినాలి. ఆ లోపాలు సరిచేసుకోవాలి.  పొగడ్తకన్నా లోతైన అగడ్త లేదు. పొంగిపోతే లేవకుండా పడిపోతాం. అసూయతో కూడిన మాటల్ని లక్ష్యపెట్టకూడదు.

రాముడితో తాటకిని ఆడదని చూడక వధించమని విశ్వామిత్రుడు  చెప్పాడు. అర్జునుడితో  శ్రీకృష్ణుడు విరథుడని చూడక కర్ణుడిపై బాణం వేయమని  చెప్పాడు. సందేహ మనస్కులై కూడా చెప్పింది చెప్పినట్లు చేశారు, ధర్మాన్ని ప్రతిష్ఠించారు. సాక్షాత్‌ గురువే, మన శ్రేయస్సు కోసమే, మంచిమాట చెప్పినా దాన్ని నిరాకరించే పరిస్థితి రావచ్చు. వామనమూర్తికి బలిచక్రవర్తి మూడడుగులు దానమిచ్చే సందర్భంలో రాక్షస గురువు శుక్రాచార్యుడు  ‘ప్రాణ మాన విత్త భంగమందు, బొంక వచ్చు నఘము పొందరధిప’ అని   చెప్పినా ‘మాట తిరుగ లేరు మానధనులు’ అని బలిచక్రవర్తి నిరాకరించాడు.  ఇంద్రుడు మారువేషంలో కర్ణుడి వద్దకు కవచకుండలాలు దానంగా గ్రహించటానికి వస్తున్నాడు అని తెలిసి, అతడికి దానమివ్వవద్దని తండ్రి సూర్యభగవానుడే చెప్పినా- కర్ణుడు సున్నితంగా తిరస్కరించాడు. బలి, కర్ణుడు చిరకీర్తిని ఆర్జించారు.

రాముడు రాజ్యాన్ని వదిలి పదునాల్గు సంవత్సరాలు అడవికి వెళ్ళమన్న తండ్రి దశరథుడి మాటలు ఆచరించి పితృవాక్య పరిపాలకుడు అయ్యాడు. మన మంచి, శ్రేయస్సు కోరుకునేవారి మాటలు మనకు కఠినంగా అయిష్టంగా అనిపిస్తాయి. వయసులో ఉన్నప్పుడు తాత్కాలిక సుఖాన్ని ప్రోత్సహిస్తూ మనలోని మానసిక బలహీనతలను వాడుకొనే కొంతమంది సహచరుల మాటలు తీయగా అనిపిస్తాయి. ఫలితం నైతిక పతనం.  దురలవాట్లపాలై విద్య భ్రష్టుపట్టి భవిష్యత్తు నాశనమవుతుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో వినేవాళ్లుంటే అందరూ చెప్పేవాళ్లే. అయినా వేమన చెప్పినట్లు ఎవరు చెప్పినా వినాలి. ఏది విన్నా, చూసినా తొందరపాటు నిర్ణయానికి రాకూడదు. విన్నదాంట్లో, చూసినదాంట్లో ఒక పార్శ్వమే మన అవగాహనలోకి వచ్చే సందర్భాలు ఎక్కువ. బుద్ధితో విని, మనోనేత్రంతో చూసి వాటిలో  మంచి చెడు, నిజానిజాలు వాటివల్ల వచ్చే పరిణామాలు ఎవరికి వారు బేరీజు వేసుకోవాలి. విచక్షణతో నిర్ణయించుకోవాలి. అప్పుడే  ఎంచుకోవలసిన దారి స్పష్టంగా ఉంటుంది.

- కస్తూరి హనుమన్నాగేంద్ర ప్రసాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని