భాగవత సందేశం

రామాయణ భారతాలలో లేనిది- భాగవతం వివరించింది జీవన్ముక్తి గురించే! భయంతో విలవిలలాడిన పరీక్షిత్తుకు కనువిప్పు కలిగించి, మోక్ష మార్గం చూపించింది భాగవతం. పరీక్షిత్తు అంటే ఎవరో కాదు...

Published : 18 Jun 2022 00:40 IST

రామాయణ భారతాలలో లేనిది- భాగవతం వివరించింది జీవన్ముక్తి గురించే! భయంతో విలవిలలాడిన పరీక్షిత్తుకు కనువిప్పు కలిగించి, మోక్ష మార్గం చూపించింది భాగవతం. పరీక్షిత్తు అంటే ఎవరో కాదు... మనమే! పరీక్షిత్తు మాదిరిగా చావుకు భయపడే ప్రతి వ్యక్తీ పరీక్షిత్తే.

మృత్యువుకు భయపడి దాక్కుంటూ వచ్చిన పరీక్షిత్తుకు భాగవత కథలు వినడం పూర్తయ్యేసరికి మృత్యువును జయించడం ఎలాగో అర్థమైంది. చావు నుంచి పారిపోవడానికి బదులుగా చావును ఎదుర్కొనే ఉపాయం తెలిసిపోయింది. తీరాచేసి అది చాలా చిన్న విషయం. మృత్యుభీతిని జయిస్తే మృత్యువును జయించినట్లే అవుతుందన్నది అతడు కనుగొన్న సత్యం. అదే భాగవత సారాంశం.

తక్షకుడనే పాము దేన్నయితే కాటువేయనున్నదో దాన్ని పరీక్షిత్తు ఇంతకాలం ‘నేను’ అనుకుంటూ వచ్చాడు. ఆ నేనుని  రక్షించుకోవాలనే అంతగా ప్రయాస పడ్డాడు. తక్షకుడు నిజంగా కాటువేయగలిగేది దేన్ని? తన దేహాన్ని! ఏ దేహమైనా మృత్యు లక్షణాలతోనే పుడుతుంది. దాన్ని స్వీకరించక ముందు తానున్నాడు. దేహాన్ని విసర్జించాకనూ తాను ఉంటాడు. మధ్యలో వచ్చి పోయేది ఆ మాయదారి దేహమే కానీ తాను కాదు! ఇక ఆ దేహం తక్షకుడి కాటువల్ల పోతేనేం, యుద్ధంలో వీరోచితంగా పోతేనేం? పోయేది తాను కాదుగా! దేహం పోతున్నది, అదీ అసలు విషయం.

భాగవత శ్రవణం కారణంగా ఈ సత్యం బోధపడేసరికి, అతడికి పండిన వెలగపండు గుల్లకు అంటకుండా ఆ గుల్ల లోపలే విడిగా ఉంటున్న పద్ధతిలో తన దేహం నుంచి వేరుగా జీవించడం నేర్చుకున్నాడు. దేహం వేరు, నేను వేరు అని స్పష్టంగా గమనించడం తెలిసింది. ఆ రకంగా పరీక్షిత్తు మృత్యువు నుంచి వేరుపడ్డాడు. మృత్యుభీతి నుంచి బయట పడ్డాడు. ఇది భాగవతం మనకు నేర్పే ముఖ్యమైన పాఠం.

మృత్యువు అనే పదానికి ఉపనిషత్తులు ఏమరిపాటు అనే అర్థాన్ని చెప్పాయి. ఏమరిపాటు అంటే తెలియకపోవడం లేదా గమనించకపోవడం. ఏమిటి తెలియక పోవడం? నేను అంటే ఏమిటో తెలియక పోవడం. అందుకే పరీక్షిత్తు ముందు రోజుల్లో మృత్యువు అంటే భయపడ్డాడు. భాగవతం వినడం పూర్తయ్యేసరికి మృత్యువునే జయించాడు. పరీక్షిత్తు  విషయంలో- భాగవతం వినకముందు నేను వేరు, భాగవతం అర్థమయ్యాక నేను వేరు. అదే మనమూ నేర్చుకోవలసిన పాఠం. భాగవతం వింటే మృత్యుంజయులం అవుతామన్న  మాటకు అర్థం అదే!  ‘శ్రీ కైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్‌... భాగవత మహా పురాణాన్ని తెలుగు చేస్తాను... పునర్జన్మంబు లేకుండగన్‌’ అని  పోతన అంత గట్టిగా చెప్పగలగడం లోని రహస్యం అదే!  చివరికి వచ్చేసరికి పరీక్షిత్తు-  తక్షకుడు నన్ను కాటు వేయడు అన్నాడు. ఎందుకంటే అతడు కాటువేయగలిగేది పై గుల్లను- అనే సంగతి  పరీక్షిత్తుకు రూఢిగా తెలిసిపోయింది. జీవన్ముక్తుడు మాత్రమే అనగలిగే మాట అది. దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే, మనం అందరం కూడా జీవన్ముక్తులు కాగలం. అందుకే భాగవతాన్ని ఈ జాతి ఇన్ని యుగాలుగా నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నది!

- వై.శ్రీలక్ష్మి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని