ఆ తపనకు జేజేలు!

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నారు. ద్వితీయ స్థానంలో ఉన్న అద్వితీయమైన వ్యక్తి నాన్న. పిల్లల వెనక నీడలా, ముందు నిలువెత్తు అద్దంలా అనుక్షణం భరోసా నింపే అనురాగ రూపం

Updated : 19 Jun 2022 08:38 IST

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నారు. ద్వితీయ స్థానంలో ఉన్న అద్వితీయమైన వ్యక్తి నాన్న. పిల్లల వెనక నీడలా, ముందు నిలువెత్తు అద్దంలా అనుక్షణం భరోసా నింపే అనురాగ రూపం నాన్న. ఓర్పునకు మారుపేరు, మార్పునకు మార్గదర్శి, పిల్లల ప్రగతి సోపానం- నాన్న.

తండ్రితో సమానమైన ఆదిగురువు ప్రపంచంలో ఎవరూ ఉండరు. అక్షరాలు అక్కర్లేని జీవిత పాఠాలు బోధించేవాడు నాన్న. నాన్న భావాలకు భాషతో పని లేదు. అమ్మ చెప్పే నమ్మకం నాన్న. జీవితాంతం వెంట ఉండే నీడ నాన్న. అమ్మ పేగుబంధం అయితే, నాన్నది పెరిగే బంధం. అమ్మ జన్మనిస్తే, నాన్న పిల్లల కోసమే జీవితాంతం జీవిస్తాడు. అమ్మ ఆయువు ఇస్తే, నాన్న ప్రాణవాయువు అవుతాడు. అమ్మ గోరుముద్దలు తినిపిస్తే, నాన్న విద్యాబుద్ధులు నేర్పిస్తాడు. బాల్యంలో అమ్మ మాటలు నేర్పిస్తే, నాన్న ఎదగడానికి అవసరమైన భాషలు నేర్పించి, బాటలు వేస్తాడు.

నాన్నంటే బాధ్యత, ధైర్యం, భద్రత, భరోసా. అన్నిటినీ మించి త్యాగానికి మారుపేరు నాన్న. పిల్లల సుఖం కోసం తన అవసరాలు, ఆరోగ్యం, ఆనందాల్ని పక్కన పెడతాడు. పిల్లలు ఒక్కో మెట్టు ఎక్కుతూంటే లోలోపల పొంగిపోతాడు. పిల్లల విజయాన్ని తన విజయంగా భావించి చిన్న పిల్లాడిలా, పదిమందితో పంచుకుంటాడు. యుక్తవయస్సు వచ్చిన పిల్లలను స్నేహితులుగా భావించే తొలి వ్యక్తి నాన్న. ఎదిగిన పిల్లలతో నాన్న మాట్లాడే విధానంలో, స్పర్శలో స్నేహ గాఢత స్పష్టంగా తెలుస్తుంది.
పిల్లలు ఎంత ఎదిగినా వాళ్ల దృష్టిలో తొలి కథానాయకుడు నాన్నే. బాల్యంలో పిల్లలు ఎక్కే తొలి విమానం నాన్న భుజాలే. కొడుకును బడికి పంపుతూ ఉపాధ్యాయుడికి ఓ తండ్రి ఉత్తరం రాశాడు. అందులో ‘నా కొడుక్కి చదువుతోపాటు, తప్పు చేయడానికి భయపడే స్వభావాన్ని నేర్పించండి’ అని రాశాడు. ఆయనే అబ్రహాం లింకన్‌.

ప్రతి వ్యక్తి జీవితంలోనూ మొదటి బ్యాంక్‌ నాన్న జేబే. ఆ బ్యాంకుకు తిరిగి అప్పు తీర్చాల్సిన అవసరం లేదు. చెల్లించాలని ఏ తండ్రీ ఆశించడు. ఎందుకంటే నాన్న కష్టానికి మూల్యం ఎవరం చెల్లించలేం.

అమ్మ ఆలన. నాన్న పాలన. అమ్మ ఆలనలో లాలిత్యం దాగుంటుంది. నాన్న పాలనలో కాఠిన్యం వెన్నంటి ఉంటాయి. బాల్యంలో వేలు పట్టుకుని నడక నేర్పిస్తాడు. తప్పటడుగులు వేస్తే సరి చేస్తాడు. జీవితంలో తప్పుటడుగులు వేస్తే, నడత సరిదిద్దడానికి కాఠిన్యం ప్రదర్శిస్తాడు. అయినా పిల్లలకు ఏ కష్టం వచ్చినా తక్షణం మనసులో ప్రత్యక్షమయ్యే దైవం నాన్నే.

పిల్లల అభివృద్ధిని అంబరాన్ని తాకేంతగా మనసులోనే నిస్వార్థ సంబరాలు చేసుకుని మురిసిపోయే ఏకైక వ్యక్తి నాన్న. తన పిల్లలు ఎప్పుడూ తనకంటే ఉన్నతంగా ఉండాలని తపిస్తాడు నాన్న. పిల్లల దీర్ఘకాలిక ప్రగతికి దిక్సూచి నాన్న. అమ్మ ప్రేమ ఆమె కళ్ళతో చూస్తే, నాన్న ప్రేమ ఆయన హృదయంతో చూస్తుంది.

ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి పట్ల పుత్ర వాత్సల్యంతో పక్షపాత వైఖరి ప్రదర్శించేవాడు. అది పిల్లల్ని పతనం వైపు అడుగులు వేయిస్తుంది. అందుకే ఏ తండ్రీ పిల్లల్ని వాళ్ల ముందు పొగిడేందుకు ఇష్టపడడు. వందమంది గురువుల కంటే తండ్రి స్థానం గొప్పదని శాస్త్రాలు చెప్పాయి.

నాన్న త్యాగాలు, నిస్వార్థ ప్రేమ నిరంతరం మనసా, వాచా మనతోనే నీడలా ఉన్నా, విశ్వమంతా ఒకే రోజు నాన్నను స్మరించుకునే రోజున- ప్రపంచంలో ఉన్న నాన్నలందరికీ జేజేలు!

- ఎం.వెంకటేశ్వరరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని