స్వార్థం దుఃఖహేతువు

మనుషులలో అత్యధికులు స్వార్థపరులే. నేను-నాది అని నిత్యం తపిస్తూ సంపద కూడబెట్టడమే పరమార్థమనుకుంటారు. భగవంతుడి సృష్టిని మొత్తం తామే అనుభవించాలనుకుంటారు. ధర్మమా, అధర్మమా

Updated : 20 Jun 2022 07:48 IST

మనుషులలో అత్యధికులు స్వార్థపరులే. నేను-నాది అని నిత్యం తపిస్తూ సంపద కూడబెట్టడమే పరమార్థమనుకుంటారు. భగవంతుడి సృష్టిని మొత్తం తామే అనుభవించాలనుకుంటారు. ధర్మమా, అధర్మమా అని ఆలోచించకుండా సంపాదించే స్వార్థపరులు తమ సంపాదనకు సహకరించాలని సృష్టికర్తనే అర్థిస్తారు. నాకిది, నీకిది అంటూ భగవంతుడికే తమ అక్రమార్జనలో వాటా ఇవ్వజూపుతారు. ఒక కోరిక తరవాత మరో కోరిక తీరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ అంతులేని కోరికలతో సతమతమవుతుంటారు.
స్వార్థం మనిషి ఆలోచనా శక్తిని నశింపజేస్తుంది. మానవత్వాన్ని మంటగలుపుతుంది. స్వార్థపరత్వం మాత్సర్యాన్ని ప్రేరేపిస్తుంది. ఎదుటివారి పతనాన్ని కోరుకుంటుంది. స్వార్థపరుడు లోభిగా మారతాడు. లోభం మనసులో ఆశలు రేపుతుంది. దురాశ ధర్మవిరుద్ధమైన పనులను ప్రోత్సహిస్తుంది.

పాండవులకు అయిదు ఊళ్లయినా ఇవ్వజూపని దుర్యోధనుడి స్వార్థం కౌరవ వంశ నాశనానికి దారితీసింది. తన కుమారుడికే రాజ్యాభిషేకం చేయాలన్న కైకమ్మ స్వార్థపరత్వం దశరథుడి ప్రాణాలు తీసింది. తన స్వార్థం కోసం ఇతరులను బాధించాలనుకోవడం వినాశకరం.

శ్రీ రామానుజులవారు గురువుగారి నుంచి మంత్రోపదేశం పొందారు. మంత్రార్థాన్ని తన ఊరి వారందరికీ బోధించారు. గురువుగారు కోపగించారు. వాగ్దాన భంగం చేసినందుకు తానొక్కడినే నరకానికి వెడతానని, ఎంతోమంది భక్తులు ముక్తిమార్గంలో పరమాత్ముడిని చేరుకోగలిగితే కలిగే ఆనందం నరకం కన్నా మిన్న అన్న శ్రీ రామానుజులవారు పూజనీయులయ్యారు. నిస్వార్థ భావం మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.

దానం సర్వశ్రేష్ఠమైనదని, న్యాయార్జిత విత్తాన్ని పాత్రుడికి దానం చేస్తే పరలోకంలో ఉన్నతమైన ఫలం లభిస్తుందని అరణ్యవాస సమయంలో వ్యాసమహర్షి ధర్మరాజుకు ఉపదేశించినట్లు మహాభారతం చెబుతోంది.

పాండవుల మహాప్రస్థానంలో ఒక కుక్క వారిని అనుసరించింది. దారిలో ద్రౌపది, సోదరులు పడిపోగా, చివరి వరకూ ధర్మరాజును కుక్క అనుసరించింది. ఇంద్రుడు రథంపై వచ్చి సశరీరంగా ధర్మరాజును స్వర్గానికి తీసుకు వెళతానంటాడు. ధర్మరాజు తనను అప్పటిదాకా అనుసరించిన కుక్కకు కూడా స్వర్గప్రాప్తి కలిగించమంటాడు. అందుకు ఇంద్రుడు అంగీకరించకపోతే ధర్మరాజు తానూ స్వర్గానికి రాలేనంటాడు. అప్పుడు కుక్క రూపంలో ఉన్న ధర్మదేవత యుధిష్ఠిరుణ్ని కొనియాడుతూ- ఒక కుక్క కోసం ఇంద్రుడి రథాన్ని కూడా పరిత్యజించిన ధర్మరాజుకు సమానులెవరూ స్వర్గంలో లేరని అంటాడు. అలా ధర్మరాజు పరమోత్కృష్టమైన దివ్యగతిని పొంది సశరీరంగా స్వర్గానికి వెళ్తాడు.

నిస్వార్థ సేవకు ప్రతీక ప్రకృతి. నిస్వార్థంగా సేవ చేయాలన్న సత్యాన్ని మనిషి ప్రకృతి నుంచి నేర్చుకోవాలి. ఇతరుల ప్రయోజనాలు విస్మరించి అన్నీ తనకే కావాలన్న స్వార్థపరత్వం దుఃఖానికి హేతువవుతుంది. పరమేశ్వరుడైన తనను నిరంతరం అనంత భక్తితో చింతన చేస్తూ నిష్కామ భావంతో సేవించేవారి యోగక్షేమాలను తానే వహిస్తానని భగవానుడి గీతోపదేశం. భగవంతుడు మనిషికి సేవ చేసే శక్తిని, బుద్ధిని ప్రసాదించాడు. నిస్వార్థంగా సేవచేసే వారికి భగవంతుడి అండ లభిస్తుందనడంలో సందేహం లేదు.
మానవ జన్మ ఉత్తమమైనది. మానవుడు జ్ఞానవంతుడు. జ్ఞానానికి వివేకం తోడైతే మనిషి రాణిస్తాడు. మంచిచెడుల విచక్షణ తెలుసుకుని స్వార్థాన్ని    కట్టడి చేయగలవాడే ఉత్తముడు. ఒకరికొకరు సహాయం చేసుకున్నప్పుడే  మనుషుల మధ్య స్నేహ సంబంధాలు పరిఢవిల్లుతాయి. నిస్వార్థ సేవకులతో సమాజం శోభిస్తుంది.

- ఇంద్రగంటి నరసింహమూర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని