యోగదర్శనం

యోగం అంటే ఆత్మ పరమాత్మల అనుసంధానమనే అర్థం ఉన్నా, యోగశాస్త్రం దాన్ని చిత్తవృత్తుల నిరోధంగా నిర్వచించింది. చిత్తం అంటే మనసు. అది స్వాధీనమైతే, విశ్వమంతా అధీనమవుతుందనేది ఈ శాస్త్ర సారాంశం. మనిషి తనను తాను ఎలా నియంత్రించుకోవాలో, అనుకూల ...

Published : 21 Jun 2022 00:31 IST

యోగం అంటే ఆత్మ పరమాత్మల అనుసంధానమనే అర్థం ఉన్నా, యోగశాస్త్రం దాన్ని చిత్తవృత్తుల నిరోధంగా నిర్వచించింది. చిత్తం అంటే మనసు. అది స్వాధీనమైతే, విశ్వమంతా అధీనమవుతుందనేది ఈ శాస్త్ర సారాంశం. మనిషి తనను తాను ఎలా నియంత్రించుకోవాలో, అనుకూల ప్రతికూల స్థితుల్లో స్థిరంగా ఎలా ఉండాలో సందేశాన్నిచ్చి, నేడు ప్రపంచ మేధావులందరి మన్ననలను అందుకుంటోంది. ప్రాచీన భారతీయ ఋషి మేధకు, అనితరసాధ్యమైన అంతరంగ సూక్ష్మ శోధనా సామర్థ్యానికి నేడు ప్రపంచం పలికే జేజేలు ఈ శాస్త్ర ఔన్నత్యానికి అద్దం పడతాయి. ఛాందస భావాలకు దూరంగా శాస్త్రీయ దృక్పథానికి దగ్గరగా దీని బోధనలుంటాయి. మానసిక శాంతి, శరీర ఆరోగ్యం కోసం యోగశాస్త్రం అందరూ ఆచరించదగింది. దాని ఆధారంగానే ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రాలు, వ్యక్తిత్వ వికాస గ్రంథాలు, సానుకూల దృక్పథాన్ని ప్రబోధించే కేంద్రాలు పుట్టుకొచ్చాయి. యోగం మనిషిని సంస్కరిస్తుంది. మనసును కట్టడిచేస్తుంది. దేహాన్ని దృఢం చేస్తుంది. ఆయురారోగ్యాలను పెంచుతుంది. బుద్ధిని వికసింపజేేస్తుంది. చిత్తానికి శాంతిని విశ్రాంతిని ఇస్తుంది. వ్యక్తిగా మనిషిని, సమష్టిగా సంఘాన్ని సముద్ధరిస్తుంది.

యోగం ప్రస్తావన వేదాల్లో ఉన్నప్పటికీ, దాన్ని ఒక ప్రత్యేక శాస్త్రంగా తీర్చిదిద్దింది, షట్‌ దర్శనాలలో ఒకటిగా చేర్చింది మాత్రం- పతంజలి మహర్షి. న్యాయ, వైశేషిక, యోగ, సాంఖ్య, వేదాంత, మీమాంసలే షట్‌ దర్శనాలుగా ప్రఖ్యాతిగాంచాయి. క్రీ.పూ.రెండో శతాబ్దంలో జన్మించిన మహర్షి వేదాల్లో యోగవిద్యాసారాన్ని శాస్త్రీయంగా క్లుప్తీకరించి, యోగసూత్రాలను రచించారు. దోషరహితంగా, అసందిగ్ధంగా సారవంతమైన బహుచిన్న వాక్యాలుగా ఈ సూత్రాలుంటాయి. అభ్యాస వైరాగ్యాలను మనసుకు అలవాటు చేస్తే, నిలకడ సాధ్యమవుతుందంటాయి యోగసూత్రాలు. యమ నియమాలు, ఆసన ప్రాణాయామాలు, ప్రత్యాహార ధారణలు, ధ్యానసమాధులతో కూడిన అష్టాంగయోగాన్ని అభ్యసించాలని అవి సూచిస్తాయి.

మనసుపై పట్టు సాధించాలంటే దాని మర్మం బాగా తెలియాలి. ఏది సాధించాలన్నా మనిషికి మనసే ఆధారం. నిజానికి మనసు బాహ్యరూపమే మనిషి. మనిషికి బలం బలహీనత అదే. మనసును మనసుతోనే జయించాలి. మనసు చంచల స్వభావి. స్పందించడం, చలించడం, విసుగు, విరామం, విశ్రాంతి లేకుండా సంచరించడం... మనసు నైజాలు. బాహ్య విషయ వాంఛలవైపు పోకుండా మనసును ముందు అరికట్టాలి. యోగ పరిభాషలో దాన్ని ప్రత్యాహారమంటారు. దేనిపై మక్కువ ఎక్కువ ఉంటే, దానిపైనే మనసు నిలకడగా ఉంటుంది. ధ్యానంపై మనసుకు ప్రీతి కలిగించాలి. ధ్యానించాలనే భావనను మనసు ధారణచేయాలి. తరవాత నెమ్మదిగా ధ్యానాన్ని అలవరచాలి. గాలి వెలుతురు సమంగా ఉండి, శుభ్రంగా ఉన్న ఏకాంత ప్రదేశంలో సుఖాసనంపై స్థిరంగా కూర్చోవాలి. దృష్టి నలుదిక్కులా పోకుండా చూడాలి. నడుము మెడ తలను నిటారుగా(లంబకోణంలో) ఉంచాలి. అంటే వెన్నెముక వంచకూడదు. మనసును ముక్కుకొనపై గాని, కనుబొమల మధ్య గాని నిలపాలి. ఇదే ధ్యానం. ధ్యానం చక్కగా సాగేందుకు శరీరాన్ని దృఢంగా మనసును ఉల్లాసంగా ఉంచాలి. ప్రాణాయామంతో ప్రాణచలనాన్ని అరికట్టగలిగితే అది సాధ్యమవుతుంది. దీర్ఘశ్వాస తీసుకుని, బంధించి, తిరిగి నెమ్మదిగా వదలడాన్ని ప్రాణాయామం అంటారు. దానికి తోడుగా యోగాసనాలను క్రమం తప్పకుండా వేస్తే దేహాంగాల పనితీరు మెరుగవుతుంది. బ్రహ్మచర్యం, అహింస, ఈశ్వరభావన, ఆహార విహారాలలో నియంత్రణను పాటించాలి. వాటిని యమ నియమాలంటారు. వాటిని ఆచరిస్తూ ధ్యానాన్ని కొనసాగిస్తే మనసు ఆలోచనారహితమనే సమాధిని చేరుతుందంటుంది యోగశాస్త్రం.

- పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని