నామౌచిత్యం

ప్రాచీన కావ్యకర్తలు కేవలం కవులు  మాత్రమే కాదు. వారు భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాల్ని దర్శించగల రుషులు కూడా. పాత్రలకు నామకరణం చేసే సందర్భంలో ఆయా పాత్రల స్వభావం, మనస్తత్వం పేరులో ప్రతిబింబించేలా చూసుకునేవారు.

Published : 24 Jun 2022 05:11 IST


ప్రాచీన కావ్యకర్తలు కేవలం కవులు  మాత్రమే కాదు. వారు భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాల్ని దర్శించగల రుషులు కూడా. పాత్రలకు నామకరణం చేసే సందర్భంలో ఆయా పాత్రల స్వభావం, మనస్తత్వం పేరులో ప్రతిబింబించేలా చూసుకునేవారు.
రామ శబ్దానికి సంతోషింపజేసేవాడని అర్థం. శ్రీరాముడు అన్ని సమయాల్లోనూ పేరుకు తగ్గట్లుగానే నడుచుకున్నాడు. కొడుకుగా, భర్తగా, స్నేహితుడిగా, పాలకుడిగా ఏ కోణంలో దర్శించినా రాముడి పాత్ర పాఠకుల్ని సంతోషంతో అలరింపజేస్తుంది. నాగేటి చాలు/నాగలితో దున్నిన భూమిని సీత అంటారు. యజ్ఞ నిర్వహణ కోసం జనకమహారాజు హలంతో యజ్ఞ క్షేత్రాన్ని దున్నుతుండగా పెట్టెలో ఒక ఆడశిశువు దొరికింది. ఆ అమ్మాయికి సీత అనే పేరు పెట్టారు. జీవిత పర్యంతం భూమాతకున్నంత సహనం,ఓర్పును ప్రదర్శిస్తూ ఆ పేరుతోనే ప్రాచుర్యం పొందింది. సీతారాముల మధ్య ఎడబాటు కలగడానికి వారు అనేక కష్టాలను అనుభవించడానికి కారణం శూర్పణఖ. ఆ రాక్షసి ఎంత అందవికారమైందో ఆమె పేరే తెలియజేస్తుంది. శూర్పం అంటే ధాన్యాన్ని చెరిగే చేట. ఆమె గోళ్లు చేటల్లాగా పెద్దవిగా, పదునుగా ఉండేవన్న వాల్మీకి- ఆవిడ భీకరాకృతి ఎలాగుండేదో పాఠకుడి ఊహకే వదిలేశాడు.

అన్నింటినీ చేయగలవాడని కృష్ణ శబ్దానికి అర్థం. శ్రీకృష్ణుడు తన లీలా విలాసాలతో ఎటువంటి అద్భుత కార్యాలను నిర్వహించాడో, భారత భాగవతాలు తెలియజేస్తున్నాయి. నీలపు రంగును కృష్ణ వర్ణం అని అంటారు. శ్రీకృష్ణుడి దేహం నల్లని మేఘాన్ని పోలి ఉండటంతో కృష్ణుడి పేరుకు నామ సార్థకత లభించినట్లయింది. విశ్వం అనగా వ్యాపించే స్వభావం కలదని వ్యుత్పత్తి. ఎప్పటికప్పుడు విస్తృతమవుతున్న విశ్వమంతటా భగవంతుడు నిండి ఉన్నాడని భక్తుల నమ్మకం. ఈ విషయాన్ని విష్ణు నామం నిర్వచిస్తుంది. విష్ణు అనగా సర్వవ్యాపకుడని అర్థం.

నమశ్శివాయ అంటూ పంచాక్షరీ మంత్రమైన తన పేరును స్మరిస్తే పరమశివుడు మంచులా కరిగి పోయి రాక్షసుల్ని సైతం అనుగ్రహిస్తాడని పురాణ కథనం. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరీ మంత్రంగా ప్రసిద్ధి పొందిన విష్ణు నామాన్ని చదివి నారదుడు, ధ్రువుడు మొదలైన విష్ణుభక్తులు తమ జన్మల్ని చరితార్థం చేసుకున్నట్లు ప్రతీతి. దేవతలకు సంబంధించిన మంత్రాలన్నీ వారి పేర్లతో రూపుదిద్దుకొన్నవే కావడం విశేషం.

ఒక సందర్భంలో హయగ్రీవుడు అమ్మవారికి చెందిన వేయి నామాలను అగస్త్య మహర్షికి తెలియజేశాడు. అవి లలితా సహస్రనామాలుగా ప్రఖ్యాతి పొందాయి. భీష్ముడు అంపశయ్యపై మరణావస్థ భరిస్తూ తెలియజేసినవే విష్ణు సహస్రనామాలు. తిరుమలేశుడి దర్శనార్థమై భక్తులు ఏడు కొండలెక్కుతారు. ఆ సమయంలో గోవింద నామాలు స్మరించడం పరిపాటి. భగవంతుడి పేరును పెదవుల ద్వారా పలకడంతో అది మంత్రోచ్ఛారణగా మారుతుంది. పవిత్రమైన ఆ మంత్రమే భక్తుల ఇహపర తాపాలను అణచి మోక్షాన్ని అందించగలదు.

- గోలి రామచంద్రరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని