భిన్నరుచులు

‘లోకో భిన్నరుచిః’ అని సూక్తి! అంటే ఈ లోకంలో మనుషుల అభిరుచులు వేర్వేరుగా ఉంటాయని అర్థం. ఇలా ఉండటం లోకసహజం. బ్రహ్మసృష్టిలో ప్రాణులు ఎన్ని విధాలుగా ఉన్నాయో, అభిరుచులూ అన్ని విధాలుగా కనబడుతుంటాయి. వైవిధ్యం సృష్టిలోనే ఉంది. ఒకరికి తీపి అంటే ఇష్టం.

Published : 25 Jun 2022 00:09 IST

‘లోకో భిన్నరుచిః’ అని సూక్తి! అంటే ఈ లోకంలో మనుషుల అభిరుచులు వేర్వేరుగా ఉంటాయని అర్థం. ఇలా ఉండటం లోకసహజం. బ్రహ్మసృష్టిలో ప్రాణులు ఎన్ని విధాలుగా ఉన్నాయో, అభిరుచులూ అన్ని విధాలుగా కనబడుతుంటాయి. వైవిధ్యం సృష్టిలోనే ఉంది. ఒకరికి తీపి అంటే ఇష్టం. మరొకరికి కారంపై మమకారం ఎక్కువ. కొందరికి పులుపుమీదే ధ్యాస. కొందరికి ఉప్పు అంటే ఉల్లాసం. అన్ని రుచులూ మనిషికి అవసరమే.

అలవాట్లలోనూ భిన్నరుచిత్వం స్పష్టంగా కనిపిస్తుంది. కొందరు తొలిపొద్దునే మేలుకొంటారు. కొందరు పొద్దెక్కేదాకా లేవరు. కొందరికి సంగీతం వినడం ఇష్టం. కొందరికి నాట్యం అంటే ఆసక్తి. కొందరికి పుస్తకపఠనంపై మక్కువ. కొందరికి ప్రకృతిని దర్శించడం అభిమతం. ఎవరి మనసు ఏ విషయంలో ఉత్సాహపడుతుందో, వారు ఆ విషయాలపైనే ధ్యాస కనబరుస్తారు. ఎప్పుడూ ఒకే విధమైన జీవనసరళితో సాగుతుంటే మనిషిలో జడత్వం ఏర్పడుతుంది.

భగవంతుడు సృష్టిలో మనిషికి ఎన్నో వైవిధ్యాలను ప్రసాదించాడు. దృశ్య, శ్రవ్య, భాషణరూపాల్లో కళలను అనుగ్రహించాడు. వాటిని ఆసక్తిగా పరిశీలించి, సొంతం చేసుకొంటే ఆనందానికి అవధులు ఉండవు.

సంగీతం ఒక సాగరం. అందులో రత్నాలవలె అనేకరాగాలు మనసును ఆకట్టుకొంటాయి. నవరసాలనూ సంగీ తంలో పలికిస్తూ సంగీతజ్ఞులు చేసే రాగవిన్యాసాలకు ప్రపంచం మైమరచి పోతుంది. సంగీతం ఆపాతమధురం.

సంగీతం లాగానే సాహిత్యంలోనూ నవరసాలను పండించే మహా కవులున్నారు. వారు ఎన్నో ప్రక్రి యలలో రచనలు చేస్తూ ప్రపంచాన్ని ఆకర్షిస్తారు. కొందరు కవులకు వచనరచన అంటే ప్రీతి. కొందరికి పద్యం రాయడం అంటే అభిలాష. కొందరు గేయాలు రాసి ఆనందిస్తుంటారు. కొందరు అవధానక్రీడలతో అందరినీ అలరిస్తారు.

ఇష్టాలకు కారణాలుండవు. మనుషుల మనోగతధర్మాలను అనుసరించి అభిమతాలు పుడుతుంటాయి. ఇతరుల అభిమతాలను గౌరవించడం సభ్యత. అందుకే సమాజం భిన్నత్వంలో ఏకత్వానికి దర్పణంగా కనిపిస్తుంది. మనిషి చేతివేళ్లలోనే వైవిధ్యం ఉన్నప్పుడు స్వభావాల్లో తేడాలు ఉండటం అత్యంత సహజం.

పరతత్త్వం ఒకటే అయినా, ఆ తత్త్వాన్ని తెలుసుకునే మార్గాలు భిన్నభిన్నాలుగా కనిపిస్తాయి. అందుకే లోకంలో అనేకమతాలు ఆవిర్భవించాయి. లక్ష్యం ఒకటే అయినా దారులు అన్నివైపులనుంచీ ఉంటాయి.

జీవుడు వేరు, దేవుడు వేరు అని కొన్ని మతాలు చెబితే, జీవుడూ దేవుడూ వేరుకాదు అని మరికొన్ని మతాలు ప్రతిపాదిస్తున్నాయి. కుటుంబంలో అందరూ ఒకటే అయినా ఎవరి లక్ష్యాలు వారికి ఉంటాయి. ఎవరికి నచ్చిన శైలిలో వారు తమ భవిష్యత్తును నిర్ణయించుకొంటారు. అన్నదమ్ముల మధ్యనే అనేక వైవిధ్యాలు కనబడుతున్నప్పుడు ప్రపంచంలోని ప్రాణికోటి మధ్య వేర్వేరు అభిప్రాయాలు అనివార్యాలే అవుతాయి.

అభిమతాల్లో భిన్నత్వం ఉన్నా సహజీవనం చేయడానికి సంస్కారం తోడ్పడుతుంది. సంస్కారం వల్లనే మనిషి భిన్నరుచులను గౌరవించగలుగుతాడు. ఎన్ని వైవిధ్యాలు ఉన్నా అవన్నీ సహజీవనానికి ఆటంకాలు కాకూడదు అనేదే మనిషి వివేకం. మనిషి తన విజ్ఞతతో భిన్నరుచులను ఆస్వాదిస్తూ ముందుకుసాగాలి!

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని