Updated : 26 Jun 2022 05:35 IST

ఉత్తేజ ఇంధనం

ప్రశంస మనిషిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని ప్రేరేపించే తారక మంత్రం. ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించి ముందుకు నడిపించే ఇంధనం. మనిషి తాను సాధించిన విజయాలకు ఎదుటివారి గుర్తింపును ఆశిస్తుంటాడు. తద్వారా తన అస్తిత్వాన్ని చాటుకోవాలని తపిస్తుంటాడు.
విద్యా ప్రదర్శన సభలో తన పుట్టుకను ప్రశ్నించినప్పుడు కర్ణుడు అవమాన భారంతో తల దించుకుంటాడు. కర్ణుడిలోని అస్త్రవిద్యా ప్రావీణ్యాన్ని గుర్తించిన దుర్యోధనుడు అంగరాజ్యానికి రాజును చేసి ఆదరించినప్పుడు, అతడిలో ఆత్మవిశ్వాసం పెరిగి తుది దాకా రారాజుకు బాసటగా నిలిచి అర్జునుణ్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చింది.
పిల్లవాడు నడక నేర్చే క్రమంలో ఎన్నోసార్లు పడుతూ లేస్తూ ఉంటాడు. వాడు వేసే ప్రతి అడుగుకీ మురిసిపోతూ తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహమే వాణ్ని తిరిగి నడిపిస్తుంది. పరుగులు తీయిస్తుంది. శారీరక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంత అవసరమో మానసిక ఎదుగుదలకు ప్రశంసా అంతే అవసరం.
మనిషి అన్ని దశలలోనూ ప్రశంస, ప్రోత్సాహాల అవసరం ఉంటుంది. మనిషి కుంగుబాటుకు గురయినప్పుడు అతడి పూర్వ ప్రతిభను గుర్తుచేసి ప్రోత్సహిస్తే పడిలేచిన కెరటమై అపూర్వ విజయాలను అందుకుంటాడు.
ఏ వ్యక్తికైనా తల్లిదండ్రులే తొలి గురువులు. వారి ఆలనా పాలనలోనే వ్యక్తిత్వం రూపు దిద్దుకొంటుంది. పెద్దలపట్ల గౌరవం, ప్రేమ, సహకారం, సానుభూతి, కరుణ వంటి విలువలతో తల్లిదండ్రులు మెలగాలి. అప్పుడే పిల్లలు వారిని అనుకరిస్తారు. అనుసరిస్తారు. ప్రతి పిల్లవాడిలో ఏదో ఒక ప్రతిభ నిగూఢంగా దాగి ఉంటుంది. దాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే ఆ అంతర్గత శక్తిని అద్భుత శక్తిగా మార్చుకుని విజయం సాధిస్తారు.
‘నా ధీర యువకులారా! మీరందరూ మహత్కార్యాలు సాధించడానికి జన్మించారన్న విశ్వాసాన్ని కలిగి ఉండండి’ అంటూ తన ప్రసంగాల ద్వారా యువతలోని స్తబ్ధతను, నైరాశ్యాన్ని పారదోలే ప్రయత్నం చేశారు స్వామి వివేకానంద. వారిలో నిద్రాణమై ఉన్న అనంతశక్తిని వెలికితీసి, ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు. అదే బాటలో నడచిన అబ్దుల్‌ కలాం తన ప్రసంగాల ద్వారా యువతను ‘కలలు కనండి... ఆ కలలను సాకారం చేసుకోండి’ అని ప్రోత్సహిస్తూ, ప్రతిభ కనబరచిన యువతపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇంటి వాతావరణం, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలను పటిష్ఠపరచేందుకు తోడ్పడాలి. పరస్పర ప్రశంసలు పిల్లలపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను నిత్యనూతనం చేసి పరిమళింపజేసే శక్తి ప్రశంసకే సొంతం. ఆధునిక శాస్త్రవేత్తలు, మానసిక వైద్యులు సైతం చెప్పే మాట అదే.
ప్రశంస పొగడ్తలా మనిషిని ఆకాశంలో కూర్చోబెట్టేలా ఉండకూడదు. ప్రశంసకు, పొగడ్తకు వ్యత్యాసముంది. పొగడ్తలో అతిశయోక్తి ఉండవచ్చు. ప్రశంస నిజాయతీగా ఉండాలి. ప్రశంసలో ఎదుటివారి విజయానికి ఇచ్చే చిన్న మెచ్చుకోలు మాత్రమే ఉండాలి. పరిమితమైన ప్రశంస పథ్యం లాంటిది. అవసరమైన మేరకే శక్తినిస్తుంది. ప్రశంస స్ఫూర్తినిచ్చి, బాధ్యత పెంచేదిలా ఉన్నప్పుడే దానికి విలువ ఉంటుంది.
మనిషి తనలోని శక్తి సామర్థ్యాలను తనకు తానుగా తెలుసుకోవాలి. అప్పుడే ఎటువంటి ప్రశంసలకు పొంగిపోని, విమర్శలకు కుంగిపోని సమస్థితి అలవడుతుంది. స్థితప్రజ్ఞ ఏర్పడుతుంది. ఒకసారి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం మొదలు పెట్టాక అతడికి బాహ్య ప్రశంసల అవసరం ఉండదు. సాధకుడి దృష్టి అంతర్ముఖమై సాగుతుంది. అంతర్యామిని దర్శిస్తుంది.

- శశిధర్‌ పింగళి

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని