Published : 28 Jun 2022 01:09 IST

జీవన్ముక్తి

వేద పీఠానికి బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత మూడు కాళ్లు. ఈ మూడింటినీ కలిపి ప్రస్థానత్రయం అంటారు. వేద రుషులు మానవ సమాజానికి తరగని జ్ఞాన సంపదను సమకూర్చారు. శ్రుతులు, స్మృతులు ఆధ్యాత్మిక మార్గానికి ఇరువైపులా అమర్చిన దారిదీపాలు. వేద విజ్ఞానం వ్యాసమహర్షి ప్రసాదించిన ధనమే కాదు, ఒక తరగని వారసత్వంగా ప్రపంచానికే వెలుగు ప్రసరిస్తున్న దివ్య ప్రబంధం. మాక్స్‌ముల్లర్‌, ఎడ్విన్‌ ఆర్నల్డ్‌, ఆల్‌డస్‌ హక్‌స్లే వంటి పాశ్చాత్య మేధావులు వేద సారాన్ని ప్రపంచ దేశాలకు అందించారు.

ఆధునిక రుషి అరవిందులు ఉపనిషత్తులను, భగవద్‌గీతను మధించి తనదైన బాణీలో దివ్యజీవన ప్రబంధాన్ని ప్రపంచానికి అందించారు. వ్యక్తికి, విశ్వానికి, పరమాత్మకు ఉన్న అనుబంధాన్ని తన రచనల్లో అనుశీలించారు. దార్శనికపు తొలి కానుక అయిన ఈశోపనిషత్తు తొలి శ్లోకం ఈ సత్యాన్ని ఆవిష్కరిస్తున్నది. వ్యక్తి చైతన్య వికసనం అయినప్పుడే ఈ విశ్వమంతా ఈశ్వర స్వరూపమేనన్న ఎరుక కలుగుతుంది. ‘ఈశావాస్య మిదం సర్వం’ అని చెబుతూ అతిథిగృహం లాంటి ఈ లోకంలో మనిషి ఎలా ఉండాలో తెలియజేస్తున్నది తొలి శ్లోకం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని, అతిథిగృహం లాంటి భౌతిక ప్రపంచంలో అవసరాల మేరకు వస్తువులు సేకరించమని, పరుల సొమ్ము పామువంటిదని హెచ్చరిస్తోంది. కాలచక్షువు, కర్మసాక్షి అయిన సూర్యుడిని- నీ బంగారు పళ్లెం తొలగించి, నిజదర్శన భాగ్యం కలిగించమని అర్థించడం గమనించదగ్గ విషయం.

తత్త్వజ్ఞానం కలిగినప్పుడే ఈ ప్రపంచ నిజరూపం తెలుస్తుంది. నిద్ర నుంచి మేలుకోగానే స్వప్నలోకం మాయమై నట్లు ఇదీ కనిపించదు. అస్తిత్వం లేని తలకిందులుగా ఉన్న అశ్వత్థ వృక్షాన్ని వైరాగ్యమనే ఖడ్గంతో ఖండించాలి. అలాంటి తత్త్వజ్ఞానివై కృతార్థుడివి కావాలి- అని కృష్ణుడు చెప్పడంలో ఓ అంతరార్థం ఉన్నది.

సంసార జీవితాన్ని వదిలేసి పారిపోయేవాడు సన్యాసి కాదు, పిరికివాడు. కష్టసుఖాలు అనుభవించి, ఇంద్రియాల వల్ల జరిగే ఈ పరిణామాలు తాత్కాలికమైనవని గ్రహించినప్పుడే దృష్టి మరలి, శాశ్వతమైన ఆనందం కోసం ఉవ్విళూరుతుంది మనసు. దాని కోసం ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. అది లోపల ఉన్నందువల్ల ఎవరూ చిరునామా మార్చుకుని మోక్షం వెంట పరుగెత్తవలసిన పని లేదు. ఇక్కడే ఈ శరీరంతోనే శాశ్వతానందం పొందాలనుకుని ప్రయత్నం చేసే వ్యక్తిని జీవన్ముక్తుడు అంటారు అరవిందులు. అతడి జీవిత విధానమే దివ్యజీవనం. అంతర్గత యోగ సాధన ద్వారా పావనమైన జీవనమే దివ్య జీవనం. జీవితమే ఒక యోగం అయితే దివ్య శక్తి తనకు తానుగా అందులోకి ప్రవేశిస్తుంది. దివ్యశక్తికి మరో పేరు సచ్చిదానందం.

ఈ ప్రపంచం ఆ దివ్యశక్తి అభివ్యక్తి (ప్రకటన). దాని ప్రకటన వల్ల విస్తారమైన ఈ విశ్వాన్ని ఆ దివ్యశక్తే గమనిస్తున్నది- అంటున్నాయి ఉపనిషత్తులు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలంటే మనిషి అతిమానసిక స్థితికి ఎదగాలి. అంటే వ్యక్తి చైతన్యం పూర్తిగా వికసించాలి. దివ్య చైతన్యం, విశ్వచైతన్యం, వ్యక్తి చైతన్యం... మూడూ ఒకటి అని తెలుసుకోవడమే జీవన్ముక్తి. వివేకం, వ్యక్తిత్వ వికాసమే ముక్తికి రాజమార్గం.

- ఉప్పు రాఘవేంద్రరావు

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts