Updated : 29 Jun 2022 05:45 IST

కనకధారా స్తోత్రం

భగవంతుణ్ని పలు రూపాల్లో ఉపాసించే భక్తులు తమ అనుభూతికి, ఆత్మ నివేదనకు అక్షర రూపంగా అపారస్తోత్ర వాంగ్మయాన్ని సంతరించారు. ఈ స్తోత్రాలు పఠన పారాయణ యోగ్యతను పొందాయి. ఆది శంకరుల స్తోత్ర సాహిత్యం ఉజ్జ్వలమైంది. జ్ఞానంతో అద్వైత స్థితిని అందుకోలేని సామాన్యులు భక్తితో నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి శంకరుల స్తోత్రాలు ఉపకరిస్తాయి.

శంకరులు బాల బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒక మధ్యాహ్నం వేళ ఓ ఇంటిముందు నిలబడి భిక్షనర్థించారు. ఇల్లాలు ఇల్లంతా వెదికింది. బాల సన్యాసికి పెట్టేందుకు ఇంట్లో ఏమీ లేదు. పెరట్లోని ఉసిరిక చెట్టున ఒక కాయ ఉంది. ఆ ఉసిరిక తెచ్చి స్వామిచేతిలో ఉంచింది. తనవంటి దరిద్రులు ఇంకేమీ ఇవ్వలేరని దుఃఖిస్తూ గద్గదస్వరంతో పలికింది. బాలవటువు హృదయం ద్రవించింది. లక్ష్మీదేవిని ప్రార్థించాడు. మహాలక్ష్మి కరుణించింది. ఆ పేద ఇంట్లో బంగారు ఉసిరికల వానకురిసింది. ఆనాటి శంకరుల స్తోత్రమే కనకధారాస్తవం.

మనసు లగ్నం చేసి మహా భక్తులు ఏ స్తోత్రం చేసినా దేవతలు దిగి రావలసిందే. భక్తుల కోరికలు నెరవేర్చవలసిందే. శంకరుల స్తోత్రాల్లోని ఆర్ద్రత దేవతల్ని కదిలిస్తుంది. వారి స్తోత్రాల్లో అనిర్వచనీయ భావాలు, అపూర్వమైన వర్ణనలు, రమణీయమైన పదాల కూర్పు మేళవించి ఉంటాయి. కనకధారా స్తవం ఆదిశంకరుల రచనల్లో మొదటిదని పండితుల అభిప్రాయం.

ఆయన లక్ష్మీదేవి క్రీగంటి చూపును పరిపరి విధాల వర్ణించారు. ఏ దేవి క్రీగంటి చూపు సోకగానే సర్వవ్యాపియైన విష్ణువు సకల లోకాల పాలనకు పూనుకొంటాడో ఆ అమ్మ మందమైన ఓర చూపు తనపై ప్రసరించాలని కోరుకున్నారు. మహాలక్ష్మి శుభప్రదాయిని. ఆమె దృష్టి మంగళప్రదం. శ్రీమహావిష్ణువుకు ఆనందాన్నిచ్చే ఆమె సౌభాగ్య స్వరూపిణి. ఆమెది ప్రేమదృష్టి. ఆ దృష్టి క్షణకాలం సోకినా చాలు జన్మాంతరం సంక్రమించిన చింతలన్నీ మటుమాయమైపోతాయి. శ్రీహరి వక్షస్థలంపై కౌస్తుభమణి ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడే ఇంద్ర నీలమణుల హారం వలె శ్రీదేవి కడగంటి చూపు నిలిచి ఉంటుంది. మహావిష్ణువును మేఘంతోను, మహాలక్ష్మిని మెరుపుతోను శంకరులు పోల్చారు. మేఘం ఉన్నచోటే మెరుపు మెరుస్తుంది. పరమాత్మ ఉన్నచోటే ప్రకాశం ఉంటుంది. అమ్మవారి దయాపవనం వీచి కటాక్షమేఘం వర్షించాలని బాలసన్యాసి వేడుకోలు.

పద్మం జ్ఞానానికి సంకేతం. మహాలక్ష్మి కమలవాసిని. పద్మాల కాంతి వంటి ఛాయతో ప్రకాశిస్తుంది. ఆమె క్రీగంటి చూపు అక్షయ సంపదలను అనుగ్రహిస్తుంది. పాల సముద్రంలో పుట్టిన ఆ తల్లి చంద్రుడికి, అమృతానికి సహోదరి. చంద్రుడు చల్లదనాన్ని ఇస్తే, అమృతం అమరుల్ని చేస్తుంది. కరుణనిండిన చూపుల్ని తనపై ప్రసరించమని శంకరుల అభ్యర్థన. సృష్టి కాలంలో బ్రహ్మదేవుడి పత్నియైన శారదగా, స్థితికాలంలో విష్ణుదేవుడి సతియైన లక్ష్మీదేవి పేరుతో, లయకాలంలో శంకరుడి భార్య శాంకరిగా శోభిల్లుతూ ఉండే శ్రీమహాలక్ష్మికి ఆయన నమస్కరించారు.

లక్ష్మీదేవినే ప్రసన్నం చేసుకోగల శంకరుడు భిక్షకు వెళ్ళడంలోని ఆంతర్యాన్ని అవగతం చేసుకోవాలి. అది ఆశ్రమధర్మం. ఆయన ప్రార్థన తన కోసం కాదు. ఆర్తుల దుఃఖాన్ని, దారిద్య్రాన్ని తొలగించడమే ఆయన సంకల్పం. మహాత్ములది నిష్కామభక్తి. వారు పరమాత్మను కోరుకున్నా, వేడుకున్నా అది లోకహితం కోసమే.

- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts