Published : 30 Jun 2022 00:10 IST

ఆత్మశోధన

ప్రపంచంలో అందరూ తమ ప్రజ్ఞ గురించే పొంగిపోతుంటారు. లోపాలను దాచుకుంటారు. వాటిని బయటపడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. నత్తిని అణచివేస్తూ పట్టిపట్టి మాట్లాడటం, కుటిలత్వాన్ని కప్పిపెడుతూ తేనెపలుకులు పలకడం, అజ్ఞానాన్ని పండిత వేషంలో దాచడం... ప్రపంచ వ్యవహారంలో ఇలాంటివి కోకొల్లలు.

మెరిసిపోయేది నకిలీ బంగారమని, తళతళలాడేది వజ్రంలా భ్రమగొలుపుతున్న గాజుముక్క అని, ఉత్తముడిగా అగుపించేవాడు కుట్రదారుడనీ తెలిసినప్పుడు నివ్వెరపోతాం. బయటికి, లోపలికి పూర్తి వైరుధ్యం ఉన్నప్పుడు దేన్ని నమ్మాలో అర్థం కాదు. అందుకే పెద్దలు ‘గుడ్డిగా దేన్నీ నమ్మవద్దు’ అంటారు. అలాగని దేన్నీ నమ్మకుండా జీవించలేం. నమ్మకం కలిగించగల కారణాలను మనం పరిశీలించాలి. నమ్మకం కలిగించి ద్రోహం చేయడం కుట్రదారులకు వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి, ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ, నమ్మకం ప్రదర్శించాలి. అంతరంగంలో అనుమానంగానే ఉండాలి. నమ్మకద్రోహులు విశ్వాసం నటిస్తూనే విషం వెదజల్లుతారు. భారతంలో శకుని పాత్ర అలాంటిదే. శత్రువులతో చేతులు కలిపిన జయచంద్రుడులాంటి చారిత్రక ద్రోహుల గాథా అలాంటిదే. సమాజంలో మనకు నమ్మకద్రోహులు, నయవంచకులు ప్రచ్ఛన్నంగా పలురూపాలలో, వేషాలలో కనిపిస్తారు. పాములకు కోరలు, విషం ఉన్నా వాటి రూపాలు వేరయినట్లే, నమ్మకద్రోహులూ భిన్నంగా ఉంటారు. విషం లేని పాముల్లాంటివాళ్లూ ఉంటారు. కానీ, చాలా అరుదు. నమ్మకం అంటే విశ్వసనీయత.

ముందు మన ఆత్మకు మనం విశ్వసనీయంగా ఉండాలి. మన చర్యలన్నీ ఆత్మస్థితుడైన అంతర్యామి మౌనంగా గమనిస్తూ ఉంటాడు. మనం ఇతరుల్ని వంచిస్తున్నామంటే, మనల్ని కూడా మనం మోసం చేసుకుంటున్నట్లే. ఎందుకంటే, శరీరాలు వేరు తప్ప ఆత్మ ఒక్కటే. మన మోసాలన్నీ ఆత్మవంచనలే!

ప్రతి ఆత్మవంచనకీ అపరాధ శిక్షలుంటాయి. వాటిని నవగ్రహాలు కర్మదేవతలుగా అమలు చేస్తాయంటారు. ఆ బాధల నుంచి బయటపడటానికి గ్రహశాంతులు చేస్తుంటారు. అసలు అపరాధమే చేయకపోతే శిక్షలు ఉండవుకదా?

దైవ శాసనాలు ఎంత కఠినంగా ఉంటాయంటే, మనం సునాయాసంగా చెప్పే అబద్ధమూ శిక్షార్హమైన అపరాధం లేదా పాపం. ఆ విధంగా చూస్తే మనిషి నిత్యాపరాధి! అలాగని మనం బెంబేలు పడాల్సిన పనిలేదు. ఏ రోజు మురికి ఆ రోజు స్నానంతో శుభ్రం చేసుకున్నట్లు ఏ రోజు పాపాలు ఆ రోజే నశింపజేయగల జప, ధ్యాన క్రియలున్నాయి. దానాలు, పరోపకారాలు సైతం పాపాలను క్షాళన చేస్తాయి. ఒక విధంగా దీనజన సేవకే ఎక్కువ మహత్తు ఉంది. ఎందుకంటే, అందరూ ఆత్మస్వరూపులే, అంతర్యామికి కోవెలలే కదా?

ఆధ్యాత్మిక జీవితంలో మన మనోమాలిన్యాలను ఆత్మశోధన ద్వారా మనకు మనమే శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అద్దం ఏ విధంగా మన రూపురేఖలను వ్యక్తపరుస్తుందో, ఆత్మశోధనా మన వ్యక్తిత్వ లోపాలను స్పష్టంగా తెలియజేస్తుంది. ఆత్మశోధన అంటే ఆత్మను వెతుక్కోవడం కాదు. మనల్ని మనం వెతుక్కుని ‘నేను ఎవరు?’ అనే ప్రశ్నకు జవాబు రాబట్టడం. వసిష్ఠుడు రాముడికి చేసిన గీతాబోధలోని సారాంశం- ఆత్మశోధన మార్గం. అదే యోగవాసిష్ఠమైంది. ఇక్కడ రాముడు ఉపకరణంగా సమస్త ఆస్తికలోకానికి పరమాత్మ ప్రసాదించిన దివ్యబోధ అది. అవశ్యం ఆచరణీయమైనది.

- కె.విజయలక్ష్మి

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని