ప్రేమ కోసం

గృహిణి లేని గృహం అరణ్యమే! సాధుస్వభావం ఉన్న భార్య ఇంటిని స్వర్గం చేస్తుంది. మన కావ్యాల్లో భార్యనే ప్రేయసిగా కవులు పేర్కొన్నారు. కొడుకులు, కోడళ్లు, మనవళ్లు... సేవకులు ఎంతమంది ఉన్నా-

Published : 03 Jul 2022 00:09 IST

గృహిణి లేని గృహం అరణ్యమే! సాధుస్వభావం ఉన్న భార్య ఇంటిని స్వర్గం చేస్తుంది. మన కావ్యాల్లో భార్యనే ప్రేయసిగా కవులు పేర్కొన్నారు. కొడుకులు, కోడళ్లు, మనవళ్లు... సేవకులు ఎంతమంది ఉన్నా- భార్య లేకపోతే ఆ ఇల్లు కళ తప్పినట్లు అనిపిస్తుంది. ప్రేమ ఒక పెన్నిధి. అది ఒకరు నేర్పితే వచ్చే విద్య కాదు. ‘ఈ సుఖంబును దుఃఖంబును ఎందు కొరకు...?’ అని అడిగితే ‘ప్రేమ కొరకు’ అంటారు భావకవులు. ప్రేమ అనేది స్త్రీపురుషుల మధ్య మాత్రమే కాదు. అది పలు విధాలు.

ప్రేమకోసం త్యాగాలు చేసే కథలకు ఈ కాలంలో కొదవ లేదు. దేవదాసు, లైలామజ్ను లాంటి కథలు జనాదరణ పొందాయి. వాటికన్నింటికీ తలమానికం అని చెప్పదగ్గ కథ మహాభారతం ప్రారంభంలోనే ఉంది. మహావిష్ణువు పాదం నుంచి ఉద్భవించిన గంగలాగా వ్యాసభగవానుడి నోటి నుంచి వెలువడిన భారతంలో ఉన్న ప్రతి కథా రసవంతమైనదే, మన అభ్యున్నతికి ఉపయోగపడేదే! వాటిలో రురుడి కథ ఒకటి. చ్యవనుడి భార్య సుకన్య. కుమారుడు ప్రమతి. ప్రమతి భార్య పేరు ఘృతాచి. వారి కుమారుడు రురుడు. ప్రమద్వర అనే అమ్మాయిని అతడు పెండ్లి చేసుకుందామనుకున్నాడు. ఆమె స్థూలకేశుడనే మునికి పెంపుడు కూతురు. ఆమెకు రురుడితో వివాహం నిశ్చయం అయింది. ప్రమద్వర  తోటివారితో తోటలో ఆడుకుంటూ ఉండగా ఆమె కాలు ఒక పాముకు తగిలి అది కాటు వేసింది. చెలికత్తెలు ప్రమద్వర మరణించడం చూసి హాహాకారాలు గావించారు. ప్రమద్వరను తిరిగి బతికించడానికి గౌతమ, కౌశిక, భరద్వాజ, వాలఖిల్య, మైత్రేయాది మహామునులెందరో విఫలయత్నం గావించారు.

రురుడు శోకిస్తూ సర్వదేవతలనూ ప్రార్థిస్తున్నాడు. ‘దేవకార్యాలు, యజ్ఞాలు, పుణ్యకవ్రతాలు ఎన్నో చేశాను... దేవతలారా, నా ప్రియురాలు ప్రమద్వరను బతికించండి! మహా పురుషులారా... ప్రమద్వరను తిరిగి బతికిస్తే నా పుణ్యఫలం అంతా వారికి ధారపోస్తాను’ అని దీనంగా రురుడు ప్రార్థిస్తూ ఉండగా, అతడి దీనాలాపాలు ఒక దేవదూత చెవిన పడ్డాయి. ఆకాశ భాషణంతో దేవదూత ఇలా అన్నాడు- ‘కాలాన్ని అతిక్రమించడం అసాధ్యం... దీనికి ఒక ఉపాయం ఉంది. నీ ఆయుష్షులో సగం ప్రమద్వరకు ఇస్తే ఆమె బతుకుతుంది!’ అని దేవదూత చెప్పగానే- రురుడు సంతోషంతో అందుకు అంగీకరించి దేవదూత చెప్పినట్లు చేసి తన ప్రియురాలిని బతికించుకున్నాడు. ప్రమద్వరను పెండ్లాడి రురుడు సుఖించాడు.

ప్రేమానుబంధాలు పలు విధాలు. మనుషుల ప్రేమకు అంతులేదు. అది భక్తిగానూ పరిణమిస్తుంది. పరమశివుణ్ని బాలుడి రూపంలో అపురూపంగా వాత్సల్యంతో సాకిన అమ్మవ్వకు సాటి లేరు. సీతారాముల ప్రేమకు పోలిక సీతారాములే!

దేశ ప్రేమికులనే మనం దేశ భక్తులు అంటున్నాం. రామాయణ సందేశం- స్వదేశాన్ని ప్రేమించు! స్వదేశం స్వర్గంకంటే మిన్న అని రాములవారు స్పష్టం గావించారు. దేశమును ప్రేమించుమన్నా అని మన ఆధునిక కవులు గానం చేశారు. దేశం అంటే మట్టి కాదని మనుషులని, సాటి మనిషిని ప్రేమించడం నేర్చుకొమ్మని సందేశం ఇచ్చారు.

ఈ మట్టి మీద ప్రేమతోనే వేలాది దేశభక్తులు ఎంతటి త్యాగాలకైనా వెనకాడలేదు. తుదకు తెల్లవారి చేతిలో ప్రాణాలు పోయేటప్పుడు సైతం మాతృభూమినే స్మరించిన దేశ ప్రేమికులను మనం ఎన్నటికీ మరచిపోలేం!

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని