Published : 07 Jul 2022 00:29 IST

ఎక్కడ ప్రశాంతత?

మానవ జీవితం పుట్టుక మొదలుకొని మరణం వరకు నిత్య సంగ్రామంగానే సాగుతుంది. పుట్టిన వెంటనే పసిగుడ్డుకు సైతం ఆకలి బాధ తప్పదు. శైశవదశ దాటే సమయంలో బాలారిష్టాల రూపంలో అనారోగ్యాల కష్టాలు చుట్టుముడతాయి. పెరిగి పెద్దయ్యాక కుటుంబ సమస్యలు ముసురుతాయి. కష్టాల కడలిని దాటేలోగానే వృద్ధాప్యం ముంచుకొస్తుంది. ఆ తరవాత దైహిక, మానసిక బాధలు వర్ణనాతీతం. ఏ సమస్యా మనిషిని ప్రశాంతంగా ఉండనీయదు. ఒకదాని తరవాత మరొకటిగా కడలి కెరటాల్లా సమస్యలు విరుచుకొని పడుతుంటాయి. వేదాంతులు మానవ సంసారాన్ని సాగరంతో పోలుస్తారు. కష్టాలను కెరటాలతో సమానంగా భావిస్తారు. సమస్యలు లేని మనిషి ఈ భూ ప్రపంచంలో లేడనేది పరమసత్యం.

మనిషి చీకటిని చీల్చుకొని వెలుగుకోసం వెదికినట్లు అశాంతిలో నుంచే ప్రశాంతతను రాబట్టుకోవాలి. కష్టాలు నిప్పు కణికల్లాంటివి. వాటిలోంచే చల్లదనాన్ని పొందడానికి ప్రయ త్నించాలి. వేసవికాలంలో సూర్యుడి వేడి కారణంగా లోకమంతా తపించిపోతుంది. వేసవి ముగిసిన తరవాత చల్లని జల్లులు కురిసే వర్షాకాలం వస్తుంది. వేసవికి కారణమైన సూర్యుడే వర్షానికీ కారణభూతుడు. సూర్యుడి వేడిమితో సముద్రజలాలు వేడెక్కి, ఆవిరి పైకి ఎగసిన తరవాతే కదా ఆకాశంలో మేఘాలు ఉత్పన్నమై వర్షాలు కురుస్తాయి. కనుక సమస్యలోనే సమాధానం కూడా ఉంటుందనేది ప్రకృతి చెప్పే ఉపదేశం!

మనిషి తనకు తానుగా ఆందోళనలను సృష్టించుకొంటూ అశాంతికి గురవుతుంటాడు. గంధర్వ నగరాలను సృష్టించుకొని పగటికలలు కంటాడు. అందని ద్రాక్షపండ్ల కోసం అర్రులు చాస్తుంటాడు. ఏవో ఊహించుకొని గాలిలో తేలిపోతూ, గాలిమేడలు కడతాడు. వీటివల్లనే మానసిక ప్రశాంతతకు దూరమై అల్లాడుతుంటాడు. తన ఉనికిని మరచిపోతే మనిషికి అశాంతి గాక మరేమి లభిస్తుంది?

ప్రకృతి మనిషికి అన్ని వనరులనూ పుష్కలంగా అందించింది. వాటిని రక్షించుకోలేని అసమర్థుడిగా మనిషి మిగిలిపోకూడదు. పంచభూతాలు మనిషి ప్రశాంత జీవనానికి ఆధారాలు. వాటిని కలుషితం చేయడం ద్వారా ప్రపంచాన్ని ఒక చెత్తకుండీలా మార్చివేస్తున్నాడు మనిషి. చెట్లను విచక్షణారహితంగా నరికివేసిన పాపం, కాలుష్యపు ఉద్గారాలతో ప్రాణవాయువును విషపూరితం చేసిన శాపం మనిషికి మరణశాసనమై ప్రపంచాన్ని పీడిస్తోంది. ధ్వనికాలుష్యం గుండెలను ఛిద్రం చేస్తుంటే మనిషి ఆరోగ్యం మంటగలిసిపోతోంది. లక్షల ఏళ్లనాటి హిమ ఖండాలు కరిగిపోతూ, జలప్రళయాలను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయంటే పుడమిని వేడెక్కించిన మనిషి తప్పిదాల తీవ్రత స్పష్టమవుతుంది. మనిషి తన కుటుంబ జీవనంలోనూ ఎన్నో తప్పటడుగులు వేస్తున్నాడు. పెద్దలపై గౌరవం లేకపోవడం, వ్యక్తుల మధ్య ఆత్మీయతలు దూరం కావడం, పరస్పర స్నేహ సహకార భావాలకు తిలోదకాలివ్వడం... మనిషి ఒంటరిగా మారిపోతున్నాడు. మానవతా బంధాలను బందిఖానాలోకి నెట్టేస్తున్నాడు. సమైక్యజీవనం, సమభావం కొరవడుతున్నాయి.

అన్నింటినీ పోగొట్టుకొనే మనిషికి ప్రశాంతత ఎక్కడ లభిస్తుంది? తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. తనలోనే నిక్షిప్తమై ఉన్న ప్రసన్నతను, ప్రశాంతతను శోధించి, పట్టుకోవాలి.

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని