వినదగునెవ్వరు చెప్పిన...

వినదగునెవ్వరు చెప్పిన అంటూనే విన్న వెంటనే తొందరపడక నిజానిజాలు విచారించి తెలుసుకున్నవాడే నీతిమంతుడని వివరించింది సుమతీ శతకం. స్నేహితులతో సంభాషిస్తున్నప్పుడు అనేక సూచనలు,

Published : 20 Jul 2022 00:55 IST

వినదగునెవ్వరు చెప్పిన అంటూనే విన్న వెంటనే తొందరపడక నిజానిజాలు విచారించి తెలుసుకున్నవాడే నీతిమంతుడని వివరించింది సుమతీ శతకం. స్నేహితులతో సంభాషిస్తున్నప్పుడు అనేక సూచనలు, సలహాలు వినిపిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో కష్టాల కడలి నుంచి గట్టెక్కడానికి తరణోపాయం సూచించమని ఆత్మీయులను కోరుతుంటాం. ఎవరికి తోచిన పరిష్కారాలు వారు చెబుతుంటారు. అందరి మాటలు విని, మంచి చెడుల్ని ఆకళించుకుని కార్యాచరణకు శ్రద్ధగా పూనుకొన్నప్పుడే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. జ్ఞానుల హితబోధను అనుసరించడమే ఉత్తమం. అనుభవజ్ఞుల సలహాలకు ప్రాధాన్యమివ్వాలి. దుర్జనులతో సంభాషణను మొగ్గలోనే  తుంచేయాలి. వితండవాదులకు దూరంగా ఉండాలి. లోభులు, మూర్ఖుల మాటలను పరిగణనలోకి తీసుకున్నవారు కష్టాలను కొనితెచ్చుకుంటారు.

శ్రీరాముడి పట్టాభిషేకానికి ముహూర్తం నిశ్చయించినట్లు తెలియగానే గొప్ప శుభవార్త విన్నానని కైకమ్మ పొంగిపోయింది. అంతలోనే మంధర మాయమాటలకు లొంగిపోయింది. మంధర దుర్బోధతో యుక్తాయుక్త విచక్షణాజ్ఞానం కోల్పోయింది. ఫలితంగా, భర్త మరణానికి కారకురాల యింది. శ్రీరాముణ్ని అడవులపాలు చేసింది. చివరకు మనోవ్యధకు గురైంది.

రావణాసురుడు సీతాదేవిని అపహరిం చాడు. శ్రీరాముడు యుద్ధానికి బయలు దేరాడు. ధర్మం రాముడి పట్ల ఉందని, యుద్ధంలో శ్రీరాముడిదే విజయమని, లంకకు ఉపద్రవం రాబోతోంది కనుక సీతమ్మను రాముడికి అప్పజెప్పమని విభీషణుడు రావణుడికి హితబోధ చేశాడు. విభీషణుడి మంచి మాటలను రావణుడు లక్ష్యపెట్టలేదు. ఫలితం అనుభవించాడు.

శ్రీకృష్ణుడు కురు పాండవుల మధ్య సంధి చేయాలని ప్రయత్నించాడు. సంధి కుదరకపోతే కౌరవ వంశ నాశనం తప్పదని నిండు కౌరవ సభలో శ్రీకృష్ణుడు హెచ్చరించాడు. దుర్యోధనుడు శ్రీకృష్ణుడి హితోక్తులను పెడచెవిన పెట్టి శకుని దుష్ట సలహాలు స్వీకరించాడు. కౌరవ వంశ నాశనానికి కారకుడయ్యాడు. శ్రీకృష్ణుడి గీతోపదేశాన్ని అర్థం చేసుకున్న అర్జునుడు శత్రువులను సంహరించి విజేతగా నిలిచాడు.

అంపశయ్యపై ఉన్న భీష్ముడి ద్వారా రాజధర్మాలు విన్న ధర్మరాజు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసి ప్రజల మన్ననకు పాత్రుడయ్యాడు.

ఎందరో శిష్యులు రామకృష్ణులవారి మహోపదేశాలను ఆలకించి అజ్ఞానాంధకారం నుంచి బయటపడి ఆత్మవికాసం పొందారు. తల్లిదండ్రుల మాటలు విని ఆచరణలో పెట్టే సంతానం, గురువుల బోధనల్లోని సారాంశాన్ని గ్రహించి, అనుసరించే శిష్యులు తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుని జీవితంలో ఉన్నత స్థానంలో నిలబడగలుగుతారు.

నిత్యం సత్యం పలికేవారితో స్నేహం శ్రేయోదాయకం. ధర్మాత్ములైన సదాచారులు, శాస్త్రాలను క్షుణ్నంగా పరిశీలించిన పండితుల  ప్రవచనాలు వినడం వల్ల ధర్మసూత్రాలు అర్థమవుతాయి. జీవితాన్ని సార్థకం చేసుకునే మంచి మార్గాలు అవగతమవుతాయి. స్వరయుక్తమైన వేదపఠనం వింటున్నప్పుడు ఆ ధ్వని తరంగాలకు తనువు పులకిస్తుంది. భక్తి గీతాలాపన చెవిని సోకుతున్నప్పుడు మనసులో భగవంతుడిపై భక్తి కుదురుతుంది. మధురమైన సంగీతం వీనులవిందవుతుంది. శుభకరమైన మంచి మాట హృదయాన్ని రంజింపజేస్తుంది!

- ఇంద్రగంటి నరసింహమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని