రహస్య లిపి

‘పాండవులా కౌరవులా... ఎవరు దుర్మార్గులు, ఎవరు ధర్మాత్ములు... అనేది పెద్ద చర్చనీయ అంశమేమీ కాదు. అవి రెండు స్వభావాలు, విభిన్న చైతన్యాలు, విరుద్ధ శక్తులు. వాటి మధ్య సంఘర్షణ

Published : 21 Jul 2022 00:50 IST

‘పాండవులా కౌరవులా... ఎవరు దుర్మార్గులు, ఎవరు ధర్మాత్ములు... అనేది పెద్ద చర్చనీయ అంశమేమీ కాదు. అవి రెండు స్వభావాలు, విభిన్న చైతన్యాలు, విరుద్ధ శక్తులు. వాటి మధ్య సంఘర్షణ సహజసిద్ధమైనది. విభిన్నమైన రెండు శక్తుల మధ్య సంఘర్షణే- జగత్తు. ఆ జగత్తు గురించి వివరించడమే ఇతిహాసకర్త ఆశయం. అదే మహాభారత కథనం’ అన్నారు అరవింద యోగి- వ్యాసమహర్షి గురించి చెబుతూ.అరవిందుల అభిప్రాయం అర్థమైతే- మన చూపు మారిపోతుంది. మహాభారతం ఇతిహాసమా పురాణమా... అది జరిగిందా లేదా అనే సందేహాలు తీరిపోతాయి. ఆలోచన తేటపడుతుంది. అనంతమైన కాల సముద్రం ఒడ్డున ఎత్తుగా నిలిచి దారి చూపిస్తున్న దీపస్తంభంలా అది గోచరిస్తుంది. ‘మహాభారతం నిజంగా జరిగి ఉంటే అద్భుతం... అది వ్యాసుడి రచనే అయితే పరమాద్భుతం’ అన్న పాశ్చాత్య తత్త్వవేత్తల వ్యాఖ్యానం బోధపడాలంటే- అరవిందుల సూచనే చక్కని కరదీపిక. సృష్టి విశ్వభ్రమణ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సూచన సహాయపడుతుంది. ‘శ్వేతచ్ఛత్రం’ పేరుతో అరవిందులు ఈ రహస్యాన్ని లోకానికి వెల్లడించారు. భారతీయ రాజనీతి శాస్త్రానికి ‘శ్వేతచ్ఛత్రం’ అని పేరు. శ్వేతచ్ఛత్రమంటే తెల్ల గొడుగు. దాన్నే వెల్లగొడుగుగానూ సంబోధిస్తారు.

‘కర్ణుడు సూర్యుడి వరంతో జన్మించాడు. అతడు సూర్యాంశ సంభూతుడు. అది ఉష్ణశక్తి. అర్జునుడు చంద్రవంశీయుడు. అంటే శీతశక్తి. ఈ రెండు శక్తులూ పరస్పర విభిన్న చైతన్యాలు. వాటి స్వభావాలు సంఘర్షణాత్మకాలు. కర్ణుడు, అర్జునుడు ఒకరితో ఒకరు తీవ్రంగా సంఘర్షించిన వైనాన్ని భారతం చిత్రించింది. ఈ రెండూ నిజానికి పాత్రలు కావు... ప్రతీకలు. వారిద్దరూ ఎవరి కర్తవ్యాన్ని వారు సక్రమంగా నిర్వహించడమే- విశ్వభ్రమణ రహస్యం’ అన్నారు అరవిందులు. ఉదాహరణకు నీరు, నిప్పు అనేవి రెండు పరస్పర విరుద్ధ శక్తులు. అవి ఒకదానితో ఒకటి సంఘర్షించే సందర్భాల్లో... నీటిది పైచేయి అయితే నిప్పు ఆరిపోతుంది. నిప్పు తీవ్రమైనదైతే నీరు ఆవిరైపోతుంది. విడిగా ఉన్నప్పుడు దేని పని అది చేసుకుపోతూ ఉంటాయవి.
సృష్టి నడవడానికి ఆ రెండు శక్తులూ అవసరమే. నీరు లేనిదే పంట పండదు. నిప్పు లేనిదే గింజ ఉడకదు. సృష్టి క్రమంలో దేని ప్రయోజనం దానిదే. ఈ అంతస్సూత్రాన్ని మనిషి అర్థం చేసుకోవాలి. తన ప్రజ్ఞను దానితో అనుసంధానించుకోవాలి. సృష్టి రహస్యాన్ని గ్రహించాలి.

విష్ణువు ఇంద్రుడికి ‘యజ్ఞసఖుడు’ అంది రుగ్వేదం. మహాభారతం దగ్గరకు వచ్చేసరికి అది ‘నరనారాయణీయం’గా మారింది. ఇంద్రుడు నరుడై, విష్ణువు నారాయణుడయ్యాడు. నన్నయ పదేపదే అర్జునుణ్ని ‘నరుడు’ అని సంబోధించడంలోని ఆంతర్యమిదే. ఆయన ఇంద్రుడి కొడుకు అనడమూ ఒక సంకేతమే. నరుడు స్వయంగా సమర్థుడై రణరంగంలో నిలబడినప్పుడు నారాయణుడు ఆయనకు ‘యుద్ధసఖుడు’ అయ్యాడు. ‘నాకు ఏమీ రాదు. నీవే దారి... నీవే తప్ప ఇతఃపరంబు ఎరుగను’ అని శరణాగతి చేసిననాడు ‘ఇష్టసఖుడు’ అయ్యాడు. వాస్తవానికి భారత కృష్ణుడు యుద్ధసఖుడు... భాగవత కృష్ణుడు ఇష్టసఖుడు. నరుడు నారాయణుడయ్యే ప్రక్రియ పేరే- యజ్ఞం. యుద్ధాన్ని యజ్ఞమని భారతంలో పేర్కొనడంలోని రహస్యం అదే. ఈ సంకేత లిపిని గ్రహించినప్పుడు యుద్ధమే కాదు... జీవితమూ ఒక యజ్ఞమేనని అర్థమవుతుంది. అరవిందుల వంటి యోగుల హిత వచనాలతో జీవన సమరంలో దైవాన్ని యుద్ధసఖుడిగా స్వీకరించడం, జీవితాన్ని యజ్ఞంగా నిర్వహించడం సాధ్యం అవుతుంది. అదే వ్యాసమహర్షి రచనకు పరమ లక్ష్యం. భౌతిక అమరత్వసిద్ధికి మొదటి మెట్టు!

- ఎర్రాప్రగడ రామకృష్ణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని