మనోజ్ఞ స్వరూపం

మానవ జన్మ దుర్లభమని అంటారు. కోట్లాది ఇతర జీవరాశుల్లో లేని ప్రత్యేకత, సామర్థ్యం మనిషిలోనే ఉన్నాయి. మనిషి ఆలోచించగలడు. దుఃఖాన్ని తొలగించుకొని సంతోషంగా ఉండగలడు. ప్రాణాపాయం

Published : 22 Jul 2022 00:47 IST

మానవ జన్మ దుర్లభమని అంటారు. కోట్లాది ఇతర జీవరాశుల్లో లేని ప్రత్యేకత, సామర్థ్యం మనిషిలోనే ఉన్నాయి. మనిషి ఆలోచించగలడు. దుఃఖాన్ని తొలగించుకొని సంతోషంగా ఉండగలడు. ప్రాణాపాయం నుంచి తనను తాను రక్షించుకోగలడు. హర్షుడు రాసిన నాగానందంలో- మనిషి చేయలేని కార్యమే లేదన్నాడు.

ఈ భూమిమీద దైవం మనిషి కోసమే గాక సకల ప్రాణులకు అవసరమైన వస్తువులనెన్నింటినో అందుబాటులో ఉంచాడు. ఆ అవసరాలన్నీ వినియోగిస్తూ వాటిని జీవుల మనుగడ కోసం ఏర్పాటు చేసిన దైవం ఎంత దయాళువో! తానెవరో, ఎందుకు ఈ పృథ్వి మీద ఆ అదృశ్య శక్తి వెసులుబాట్లు కల్పించాడో తెలుసుకోవడం మనిషి కర్తవ్యం. ఈ వెతుకులాటలో సదా తపిస్తూ మహత్వపూర్ణమైన జీవితాన్ని పొందే ఆనవాళ్లకోసం శోధించాలని శతపథ బ్రాహ్మణానికి శాండిల్యుడు చేసిన వ్యాఖ్యానం చెబుతోంది.

శ్రీహరి వల్లే- ఈ భూమి, ఈ జీవకోటి, ఈ ప్రకృతి ఉన్నాయి. మనలోని ఈ ఎరుక కారణంగానే ఈ ప్రపంచం ఇలా ఆనందమయమై నిరంతరం సౌభాగ్యకరం అవుతోందని అరబిందో ఘోష్‌ తన పుస్తకం ది హ్యుమన్‌ సైకిల్‌లో ప్రస్తావించారు. సర్వ కాలాల్లో అత్యంత మహిమాన్వితమైన దైవాన్ని స్మరించడం ఉత్తమమైన సాధన అని ఆయన చెబుతారు. ఆ దైవం కరుణకు మారుపేరు. శ్రీహరే రక్షకుడు, పాలకుడు. భూమిపైని ఈ ప్రాకృతిక సౌందర్యాలు, శరత్కాలంలోని చంద్రుడిలోని చల్లదనాలు, సూర్య కిరణాల్లోని ఎన్నో ఔషధీయ గుణాలు, రుతువుల్లో మార్పులు... మనిషికి లభించిన వరాలు.

రక్షించేవాడు దైవం. అతడి మేనిఛాయ ఆకాశంలాగా నీలి వర్ణం. ఆ గగనం లాగానే అందడు. నిరంతరం చైతన్యంతో వెతుకులాడాలి. కన్నతండ్రిని సమ్మానించినట్లే ఆ తండ్రుల గన్న తండ్రిని ఆరాధించాలి, శ్లాఘించాలి, ప్రేమించాలి. జీవరాశులన్నింటికీ మూలమైన సముద్రమే ఆయన నిలయం. ఆయన సృజించిన ప్రకృతిలోని అందాలు దైవంలోని సొగసుకు ప్రతిరూపాలు. రంగురంగుల పువ్వుల్లోని సౌరభాలు ఆయన నిశ్వాసాలేనని విష్ణుపురాణం చెబుతోంది. వేదాల సారం ఆ దైవం.

‘రాజా... సోమరితనం అతినిద్ర పాపం అలక్ష్యం ఆడంబరాలు దురభిమానాలు విషయ సుఖాలు దుర్వ్యసన దురాచారాలను విడిచి పెట్టాలి’ అని రఘువంశం రాయడానికి ముందు ఉజ్జయిని కాళికాలయంలో తన రాజు విక్రమాదిత్యుడితో కాళిదాసు అన్నట్లు చెబుతారు. మానవ దేహం దుర్లభమైంది. ఇదే గొప్ప అని అనుకోరాదు. స్వర్గ సుఖం సైతం అల్పమైందే. దేవాదిదేవుడైన విష్ణుమూర్తిని చేరడమే మనిషి లక్ష్యం కావాలి. ఈ మానవ శరీరాన్ని ఇచ్చి తన ఉనికి కోసం వెతికే శక్తిని సైతం ప్రసాదించిన దైవానిది మనోజ్ఞ స్వరూపం. ఆ అందాలను చూడగలగాలి. మనిషి జీవితంలో అదృష్టం కంటే ఎక్కువ ఫలితాలనిచ్చేది దైవం కోసం నిరంతర సాధన. విష్ణు సహస్రనామ స్తోత్రంలో వివరించినట్లు- ఆ దైవం చతుర్భుజుడు, పంచాయుధాలను ధరించినవాడు, పాల సముద్రంలో శేషుడిపై పవళించినవాడు. శ్రీదేవి, భూదేవి చేత పూజలందుకొంటున్నవాడు. శ్రీవత్సచిహ్నాన్ని కౌస్తుభాన్ని, జయంతీ మాలను ధరించినవాడు. ఆ గరుడవాహనుడైన శ్రీహరి చక్కదనాలకే నిర్వచనం. ఆ మనోజ్ఞ స్వరూప దర్శనం దక్కిందా... ఆ భాగ్యం అనంతం!

- అప్పరుసు రమాకాంతరావు

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని