Published : 23 Jul 2022 00:53 IST

తరగని సంపద

ఇచ్చిపుచ్చుకోవడం ప్రతి ఒక్కరి జీవితంలో సహజం. ఇవ్వడం ఆనందం, తీసుకోవడంలో ఎక్కువ ఆనందం. పుచ్చుకోవడంలో ఉన్న ఆనందానికి తృప్తి లేదు. ఇవ్వడంలో ఉన్న ఆనందానికి సంతృప్తి ఉంటుంది.

మనం తినే ఆహారం, ఉండే ఇల్లు, ధరించే వస్త్రం, జీవితానికి ఉపయోగపడే విద్య, వినియోగించే ప్రతి వస్తువు... ప్రకృతి నుంచి, ఇతరుల సహాయ సహకారాలతో పొందుతాం. ప్రకృతి ప్రతిఫలాపేక్ష రహితంగా సమస్త జీవరాశికి లేదనకుండా కన్నతల్లిలా అన్నీ సమకూరుస్తుంది. కాని, మనిషి దొరికినంత దోచుకోవడమేగాని తిరిగి ఇవ్వడం బహు తక్కువ. ప్రతిదీ పరుల నుంచి గ్రహించి ఇతరులకు ఏమీ పంచనివాడు అసలైన స్వార్థపరుడు.

కేవలం కూడబెట్టడంలోనే నిమగ్నుడై సముద్రుడు పాతాళం వైపు ఉంటాడు. పుడిసెడు జలాన్ని వర్షించిన దాత మేఘుడు దర్జాగా గర్జిస్తూ ఆకాశాన విహరిస్తాడు.   శిబిచక్రవర్తి, కర్ణుడు, బలిచక్రవర్తి వంటి పురాణపురుషులు తమ వీరత్వంకంటే దానగుణంతోనే చిరకీర్తిని ఆర్జించారు.

దీనులకు సేవచేసి మదర్‌ థెరెసా, ఆకలిగొన్న వారికి అన్న దానం చేసి డొక్కా సీతమ్మ, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచి రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వంటివారు జీవితాన్ని చరితార్థం చేసుకున్నారు. నేటి కాలంలో ఎందరో మహానుభావులు విద్య, వైద్యం, పర్యావరణం, శరణాలయాలు, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం దానధర్మాలు చేసి లబ్ధ ప్రతిష్ఠులయ్యారు.

మనిషి జ్ఞానం, తెలివి, శక్తియుక్తులు... మానవజాతికి ఉపయోగపడితేనే- వాటికి విలువ. ఒక మనిషికి భీముడి బలం, చాణక్యుడి  మేధాసంపత్తి ఉన్నా ఏమీ సాధించక నిరుపయోగం కావచ్చు. ఇవ్వడమంటే ధనం మాత్రమే కాదు. ప్రతి ఒక్కరి దగ్గర అమూల్యమైన ధనేతర సంపద చాలానే ఉంటుంది.

స్నేహితుడికి నీ హృదయాన్ని, శత్రువుకు క్షమను, పెద్దలకు గౌరవాన్ని, యజమానికి విశ్వాసాన్ని, అర్ధాంగికి అనురాగాన్ని,  పిల్లలకు వాత్సల్యాన్ని ఇయ్యి. వారికి చక్కటి ఆదర్శంగా  నిలిచి, తల్లిదండ్రులు నిన్ను చూసి గర్వపడేలా నడుచుకో. నీకు నువ్వు ఆత్మగౌరవాన్ని ఇచ్చుకో. సాటివారికి చేతనైన సహాయం చెయ్యి. పెద్దలకు గురువులకు ఏది ఇచ్చినా సమర్పణ భావంతో ఇయ్యి. ఇవన్నీ నీ దగ్గర తరగని సంపద. ఇచ్చేవాడిది ఎప్పుడూ పైచెయ్యే. పుచ్చుకొనే వాడిది కిందే! ఆ విష్ణుమూర్తి హస్తం కింద, తన హస్తం పైన ఉన్నప్పుడు ఆ బలి చక్రవర్తి; శ్రీ రాముడికి సీతను కన్యాదానం చేసిన జనకుడు, ఇంద్రుడికి కవచకుండలాలు దానం చేసిన కర్ణుడు... ఎంతటి తృప్తిని ఆనందాన్ని పొందారో  కదా!

‘ఇవ్వగలిగినంత మాత్రాన అహంకారంతో ఇవ్వకు. ఇచ్చే నీ గుణాన్ని బహిర్గతపరచిన ఆ వ్యక్తికి కృతజ్ఞతా భావంతో ఇవ్వు’ అంటారు స్వామి వివేకానంద. సమాజంలో ప్రతి ఒక్కరూ ఇవ్వగలిగింది సంతోషంగా ఇస్తూ వినయంగా స్వీకరిస్తూ నడుచుకుంటే అంతా సుఖసంతోషాలతో సుహృత్‌ వాతావరణంలో జీవితం కొనసాగించవచ్చు. అది కూడా చేయలేని స్థితిలో ‘ఇతరులు నీకు ఏది చేస్తే అప్రియమో అది ఇతరులకు చేయకుండా ఉంటే చాలు. అదే పరమ ధర్మం’.

- కస్తూరి హనుమన్నాగేంద్ర ప్రసాద్‌

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని