భాగ్యసిరుల బోనాలు

సమస్త ప్రకృతిని శక్తితత్త్వం ముందుకు నడిపిస్తోంది. ఆ శక్తి సంవిధానాన్ని పలు రూపాలలో ఆరాధించడం ఆర్ష సంప్రదాయం. శ్రమశక్తిపై ఆధారపడే కర్షకులు, శ్రామికులు మాతృశక్తిని తమ జీవనశైలికి

Published : 24 Jul 2022 00:49 IST

సమస్త ప్రకృతిని శక్తితత్త్వం ముందుకు నడిపిస్తోంది. ఆ శక్తి సంవిధానాన్ని పలు రూపాలలో ఆరాధించడం ఆర్ష సంప్రదాయం. శ్రమశక్తిపై ఆధారపడే కర్షకులు, శ్రామికులు మాతృశక్తిని తమ జీవనశైలికి అనుగుణంగా ఆరాధించే ఉదాత్త వైఖరి వ్యక్తమవుతుంది. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, ఆరోగ్యంగా అంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ బోనాల వేడుకలో ఆషాఢ మాసంలో అమ్మతల్లికి నైవేద్యాలు సమర్పిస్తారు.

జ్ఞానం, సంపద, శక్తి- ఈ మూడింటినీ అనుగ్రహించే పరాశక్తికి ఏటా నాలుగుసార్లు నవరాత్రి ఉత్సవాల్ని నిర్వహిస్తారు. చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢంలో వారాహి ఉత్సవాలు, ఆశ్వయుజంలో దసరా శరన్నవరాత్రులు, మాఘంలో శ్యామలా నవరాత్రులలో జగదంబను ఆరాధిస్తారు. ఆషాఢంలో వారాహి ఉత్సవాలలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని శక్తిమాతల ఆలయాల్లో ‘సారె’ పేరిట అమ్మవార్లకు మంగళ ద్రవ్యాల్ని సమర్పిస్తారు. ఆషాఢంలోనే శక్తి రూపాలన్నీ శాకంబరీ దేవి ఆకృతుల్లో గోచరమవుతాయి. ఈ సంవిధానంలోనే ప్రకృతి శక్తుల విభిన్న కళలుగా గ్రామ దేవతలు భాసిల్లుతున్నారు. వీరి అనుగ్రహంతో గ్రామ సీమలన్నీ సిరిసంపదలతో శోభిల్లాలని ‘బోనాలు’ పేరిట పప్పన్నం, శాకాన్నం, క్షీరాన్నం, పెరుగన్నాల్ని గ్రామ దేవతలకు నివేదిస్తారు.

తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ బోనాల సందడిలో శక్తి దేవతల్ని పలు ప్రక్రియల సమాహారంగా కొలుచుకుంటారు. ముఖ్యంగా జంటనగరాలలో మొదటగా గోల్కొండ జగదంబిక ఆలయంలో ఆషాఢ బోనాల వేడుక ఆరంభమవుతుంది. ప్రతి ఆదివారం ఒక్కో ప్రాంతంలో ఈ సంబరం కొనసాగుతుంది. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయం, లాల్‌దర్వాజా సింహవాహిని మాతామహేశ్వరి ఆలయాల్లో ఆషాఢ ఆదివారపు బోనాల సందళ్లు విలసిల్లుతాయి. ఆషాఢ మాసంలో చివరి ఆదివారం నాడు నిర్వహించే బోనాల సంబరంతో ఈ వేడుకలు పతాకస్థాయికి చేరుకుంటాయి.

ఆషాఢ జాతర ఘటోత్సవంగా వ్యవహరించే ఎదుర్కోలుతో ప్రారంభమవుతుంది. ఓ ఘటంలోకి అమ్మవారిని ఆవాహన చేసి, ఆ ఘటాన్ని ఊరేగిస్తారు. ఘటోత్సవం తరువాత అమ్మవారికి అన్న పదార్థాల్ని సిద్ధం చేస్తారు. అమ్మవారికి ‘సారె’ ఇవ్వడానికి పసుపు కలిపిన నీటిలో వేపకొమ్మల్ని ఉంచి ఆ పాత్రలపై గండదీపాల్ని ఉంచి మహిళలు ఆలయాలకు తరలివెళ్తారు. సొరకాయ, గుమ్మడికాయలతో ‘గావుపట్టు’ పేరిట దృష్టిదోషాల్ని తొలగించడం, పోతరాజుల నృత్యవిన్యాసాలు, ఫలహారపు బండ్ల ప్రయాణాలు, తొట్టెల ఊరేగింపు, భవిష్యవాణిని వినిపించే ‘రంగం’ వేడుక ఈ సందడిలో ప్రధాన భూమికను పోషిస్తాయి. ‘సాగనంపు’ ఘట్టం ద్వారా అమ్మతల్లిని తిరిగి ఆమె నెలవుకు పంపడంతో ఆషాఢ బోనాలు పరిసమాప్తమవుతాయి.

శక్తి మాతల అనుగ్రహాన్ని పొందటానికి అన్న పదార్థాల్ని వినియోగించాలని ‘దేవీ భాగవతం’ పేర్కొంది. ఆహారమే ప్రత్యక్ష మహేశ్వరి స్వరూపంగా మార్కండేయ పురాణం వివరించింది. ఉపద్రవాలు పెచ్చరిల్లినప్పుడు, దుర్భిక్షం నెలకొన్నప్పుడు, రోగకారక పరిస్థితులు ఏర్పడినపుడు శక్తి స్వరూపాలకు వైవిధ్యభరితమైన సమ్మేళనాలతో కూడిన అన్న పదార్థాల్ని నివేదన చేయాలనే పరిహారాన్ని ‘కాళికా పురాణం’ సూచించింది.

బోనపు కుండ మన శరీరానికి సంకేతం. అందులో ఉన్న అన్న పదార్థం వ్యక్తుల జీవశక్తిని సంకేతిస్తే, ఆ ఘటంపై వెలిగే జ్యోతి ఆత్మ దీపమై ప్రకాశిస్తుంది. మట్టి కుండలాంటి ఈ శరీరాన్ని త్రికరణ శుద్ధిగా, దైవశక్తితో అనుసంధానం చేసుకోవడం ద్వారా జీవన అభ్యున్నతిని సాధించవచ్చని బోనాల వేడుక పారమార్థిక సందేశాన్ని అందిస్తోంది.

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌పటేల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని