పతన హేతువులు

మనిషి బాగుపడటానికి ఎన్ని మార్గాలు ఉంటాయో, చెడిపోవడానికీ అన్ని మార్గాలు ఉంటాయి. మనిషి విజ్ఞతతో ఏ దారిని అనుసరించాలో తేల్చుకోవాలి. మంచిదారిలో ప్రయాణించడానికి ప్రయత్నించాలి. జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి కృషి చేయాలి.

Updated : 26 Jul 2022 01:32 IST

నిషి బాగుపడటానికి ఎన్ని మార్గాలు ఉంటాయో, చెడిపోవడానికీ అన్ని మార్గాలు ఉంటాయి. మనిషి విజ్ఞతతో ఏ దారిని అనుసరించాలో తేల్చుకోవాలి. మంచిదారిలో ప్రయాణించడానికి ప్రయత్నించాలి. జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి కృషి చేయాలి. మనిషి పతనానికి కారణాలు రెండు. ఒకటి అక్రమార్జిత ధనం. రెండోది అహంకారపూరితమైన అధికారం. ఈ రెండే మనిషికి ప్రధానంగా పతనహేతువులు!

ధనం ఎంత మంచిదో అంత చెడ్డది. అధికారం కూడా అలాంటిదే. అది ఎంత మంచిదో అంత చెడ్డది. మనిషిలోని బలహీనతల కారణంగా ఈ రెండూ దుర్వినియోగం అవుతున్న నిదర్శనాలు లోకంలో కనిపిస్తున్నాయి. ధనం ముందు ఆత్మీయబంధాలూ దూరమవుతున్న అనుభవాలు మానవులకు సుపరిచితాలే.

డబ్బుకోసం మనిషి శ్మశానాల చుట్టూ తిరగడానికైనా వెనకాడడని, తనకు జన్మను ప్రసాదించిన తల్లిదండ్రులను చంపడానికైనా సిద్ధపడతాడని నీతికారుల మాట. అక్రమంగా డబ్బు సంపాదించే మార్గాల కోసం మనిషి పక్కదారులను ఎంచుకొంటున్నాడు. ఎన్ని పాపాలు చేసి అయినా సరే కోట్లకు కోట్లు కూడబెట్టాలన్న దురాశతో మనిషి ప్రవర్తిస్తున్నాడు.

విలాసవంతమైన జీవితం కావాలంటే విశృంఖలంగా డబ్బు సంపాదించాలి. దానికి రాజమార్గం అధికారం. అధికారం కోసం ధనం, ధనం కోసం అధికారం అనే విధంగా ఈ రెండూ చెట్టపట్టాలు వేసుకొని సాగుతున్నాయి.

‘లక్షాధికారైన లవణమన్నమె గాని, మెరుగు బంగారమ్ము మింగబోడు’ అన్నాడు శేషప్పకవి. ఎంత ఉన్నా అక్రమంగా ఆర్జించి, గుట్టలు గుట్టలుగా కూడబెట్టినా ఆ కోటీశ్వరుడు బంగారు బిస్కెట్లను ఆరగించడు కదా? ఆకలి వేస్తే ఏ ధనవంతుడైనా ఉప్పు, కారాలనే తినాలి. అయినా సరే అక్రమార్జనను మనిషి మానలేడు. ఇది అతడి బలహీనత.

మనిషికి ఏ సంపదలూ లేకున్నా నీతి ఉండాలి. నీతిగా జీవించే రీతి ఉండాలి. సంపదలు వస్తాయి, పోతాయి. అవి ఎప్పుడూ స్థిరంగా ఉండవు. నిన్నటి ధనవంతుడు నేడు బికారిగా మారడని చెప్పడం సాధ్యం కాదు. నేటి నిరుపేద రేపు అపారసంపన్నుడు కావచ్చు. సంపదలు ఉన్నా, లేకున్నా మనిషికి ఉండవలసింది నీతి. నీతిని నిలపడం కోసమే జీవితాలను త్యాగం చేసిన మహనీయులను తలచుకొన్నప్పుడు నీతి విలువ ఎంత గొప్పదో తెలుస్తుంది. ధనం వల్ల కలిగే విలాస జీవితం ఒక్కటే మానవ జీవన లక్ష్యం కాదు. త్యాగంలో ఉన్న మానసిక శాంతి భోగంలో లేదు. భోగం రోగాలకు కారణం అవుతుంది. త్యాగం మహాయోగానికి మూలం అవుతుంది.

ఏది సక్రమమో, ఏది అక్రమమో ఇతరులకు తెలియకపోయినా మనిషి మనసుకు తెలియదా? మనసును కూడా వంచించడానికి మనిషి ప్రయత్నిస్తే అతడికి మిగిలేది అశాంతి మాత్రమే. కోరికోరి అశాంతిని కూడగట్టుకొనే మనిషి ఎంతటి దౌర్భాగ్యంతో జీవిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.

చరిత్ర మంచిని, చెడును తనలో దాచుకొని భావితరాలకు అందిస్తుంది. చరిత్ర పుటల్లో పాపాత్ములు, పుణ్యాత్ములు చేరిపోతారు. కానీ, పాపాత్ముల చరిత్రలను ఎవరూ ఇష్టపడరు. పుణ్యాత్ములను రోజూ తలచుకొంటారు. వారి ఆదర్శాలను స్మరించుకొంటారు. కనుక మనిషి తన పతనహేతువులైన అక్రమార్జనలను, అహంకారపూరితమైన అధికారాలను వదులుకోవాలి. నీతిమార్గంలోనే ముందుకు సాగాలి. సమాజం కోరేది నీతినే!

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts