మనశ్శాంతి

గాలి, నీరు, నిప్పు, ఆహారం, నిద్ర మనిషికి ఎంత ప్రధానమైనవో, మనశ్శాంతి కూడా అంతే ప్రధానమైనది. ధనం, పదవి, కీర్తి... ఇలాంటివి ఎన్ని ఉన్నా మనశ్శాంతి లోపిస్తే ఆ జీవితం దుర్భరం. ఎంత అంగబలం

Updated : 27 Jul 2022 02:16 IST

గాలి, నీరు, నిప్పు, ఆహారం, నిద్ర మనిషికి ఎంత ప్రధానమైనవో, మనశ్శాంతి కూడా అంతే ప్రధానమైనది. ధనం, పదవి, కీర్తి... ఇలాంటివి ఎన్ని ఉన్నా మనశ్శాంతి లోపిస్తే ఆ జీవితం దుర్భరం. ఎంత అంగబలం ఉన్నా ఒంటరితనం అనుభవిస్తున్నట్లే ఉంటుంది. బంధుమిత్రులు అంతా పలకరిస్తూనే ఉంటారు. అందరి మధ్య ఉన్నా మనిషికి ఆనందం ఉండదు. మనశ్శాంతి బయటినుంచి లభించేది కాదు. మనకు మనంగా దాన్ని హృదయంలో ఆవిష్కరించుకోవలసిందే. బుద్ధి నియంత్రించిన విధంగా మనసు మసలుకోగలిగితే మనశ్శాంతి చేతికందినట్లే!

మనిషి బతికినంత కాలం శాంతి, ఆనందాలను సహజంగానే కోరు కుంటాడు. అవి అంత తేలిగ్గా లభించేవి కావు. కోరికల్ని ఎంతగా తగ్గించుకుంటే అంతగా శాంతి లభిస్తుంది. ప్రలోభానికి, వ్యామో హానికి, ఆకర్షణకు దూరంగా ఉంటే శాంతి చెంతకే చేరుతుంది. కోరుకోగానే దొరికేది కాదు శాంతి. మనశ్శాంతి మన ఆలోచన, మాట, ఆచరణపైన ఆధారపడి ఉంటుంది. ధర్మబద్ధమైన ప్రవర్తనపైన, పరహిత వ్రతంపైన ఆధారపడి ఉంటుంది.

సాటివాడికి ఓ మంచి సూచనో, ఉపకారమో- ఏదైనా చేస్తే ఎంతో ఆనందం, తృప్తి కలుగుతాయి. దీనులను, దివ్యాంగులను ఆదు కోగలిగితే కలిగేదే అసలైన మనశ్శాంతి. నిరంతర శ్రమ, సమయపాలన, వివేకం, విచక్షణ, సత్సాంగత్యం, ప్రవచన శ్రవణం, భగవత్‌ చింతనం శాంతిని చేకూరుస్తాయి. కన్నవారిని సేవించడంలో బిడ్డలు పొందే ఆనందం అనుభవైకవేద్యం. భార్య, పిల్లలు, తోబుట్టువులు... అందరిపట్లా యథోచితంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, అందరిలో ఆనందం చూస్తూ పొందే మనశ్శాంతికి విలువ కట్టగలమా? శ్రీరాముడు పితృవాక్య పాలనలో, ధర్మరాజు ధర్మవర్తనలో, హరిశ్చంద్రుడు సత్యవాచక నిర్వహణలో; సీత, అనసూయ, సావిత్రి పతివ్రతా ధర్మాచరణలో ఎంత మనశ్శాంతిని పొందారో వర్ణించలేం. పండితుడికి ప్రవచనం చేయడంలో, కళాకారుడికి ప్రేక్షకులను, శ్రోతలను ప్రసన్నం చేయడంలో, అధ్యాపకుడికి విద్యాబోధన చేయడంలో, దానశీలికి పాత్రోచిత దానం చేయడంలో, సంఘసంస్కర్తలకు, నాయకులకు సమాజసేవ చేయడంలో కలిగే ఆనందం, మనశ్శాంతి అనిర్వచనీయమైనవి.

‘నా మనసనే కోతి మోహమనే అడవిలో సంచరిస్తోంది. డబ్బు కోరికలనే చెట్టుకొమ్మలపైన ఎగురుతోంది. ఈ కోతిని అధీనంలో ఉంచుకో ప్రభూ!’ అని ఆదిశంకరులు ఆవేదన చెందారు. మనశ్శాంతికి ఈ వేదనలోనే మార్గం కనిపిస్తుంది. ఇతరులకు శాంతినివ్వడంలో కలిగే సంతోషమే మనశ్శాంతికి నాంది. కామ క్రోధ లోభాలను దూరం చేసుకోగలిగితేనే మనశ్శాంతి సుసాధ్యం. సత్వగుణం, సంస్కారవంతమైన ప్రవర్తన మనసుకు శాంతినిస్తాయి. గాలి కనిపించకపోయినా ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే సహాయం ప్రచారం కాకపోయినా సంతోషం, శాంతినీ ఇస్తుంది. ‘శక్తినిచ్చేది ధనం కాదు, శక్తినిచ్చేది ఆత్మసంతృప్తి శాంతి’ అంటారు స్వామి వివేకానంద! మన ఆత్మస్థైర్యమే మనకు మనశ్శాంతినిస్తుంది. సుఖదుఃఖాలను సమానంగా సంభావించినప్పుడు, ఆత్మస్థైర్యం తనంత తానే మనసును ఆక్రమిస్తుంది. దూషణ భూషణ తిరస్కారాలకు అతీతమైన ఆలోచనా దృక్పథం అలవరచుకోవాలి. త్రికరణశుద్ధితో జీవన ప్రస్థానం కొనసాగించినవాడిని మనశ్శాంతి నీడలా వెన్నంటే ఉంటుంది.

- చిమ్మపూడి శ్రీరామమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని