ఉపశమనం

ఆటలో గెలిచిన వ్యక్తికి ప్రశంస ఎంత ముఖ్యమో, ఓడిన మనిషికి ఓదార్పు అంత అవసరం. ఆటలో ఓడిన వ్యక్తి తన అభ్యాసం, శ్రమ బూడిదలో పోసిన పన్నీరయ్యాయని మానసికంగా దిగులు పడుతుంటాడు.

Published : 28 Jul 2022 00:55 IST

ఆటలో గెలిచిన వ్యక్తికి ప్రశంస ఎంత ముఖ్యమో, ఓడిన మనిషికి ఓదార్పు అంత అవసరం. ఆటలో ఓడిన వ్యక్తి తన అభ్యాసం, శ్రమ బూడిదలో పోసిన పన్నీరయ్యాయని మానసికంగా దిగులు పడుతుంటాడు. అలాంటి సమయంలో, గెలుపు కన్నా ఓటమి ఇచ్చే అనుభవం గొప్పదని, ఆటలోని మెలకువలను మరింతగా మెరుగుపరచుకుని, ద్విగుణీకృత ఉత్సాహంతో రేపు పోటీదారుతో తలపడితే విజయం తథ్యమన్న నాలుగు మంచి మాటలు చెబితే అతడి మనసు కుదుటపడుతుంది. తదుపరి పోటీకి పరిపూర్ణంగా సమాయత్తమవుతాడు.

విజయుణ్ని అంటిపెట్టుకుని ఎంతోమంది ఉంటారు. అది లోక సహజం. అపజయం పొందిన వ్యక్తికి ఆసరాగా నిలవడమే నిజానికి గొప్ప విషయం. ఆ సమయంలో వ్యక్తపరచే సంఘీభావం ఓటమి పాలైన మనిషికి వెన్నుదన్ను అవుతుంది. తనకు మానసిక ప్రశాంతత ప్రసాదించిన వ్యక్తిని ఎన్నటికీ మరవడు. జీవితమంటే కష్ట సుఖాల పడుగు పేక. బాధల్లో ఉన్నవారిని ఆదుకోవడం మానవత్వ భావనకు తొలి మెట్టు. కొంతమంది అకారణంగా మాటల ఈటెలతో ఎదుటివారి మనసును గాయ పరుస్తారు. అది వారి నైజం. శారీరక గాయంలా, మానసిక గాయం బయటికి కనిపించదు గాని- ఆలోచనలను అస్థిరపరుస్తుంది. అటువంటివారిని కనిపెట్టి ఉపశమనంగా చెప్పే మాటలు మనసు గాయానికి చల్లదనాన్నిచ్చే లేపనమై కర్తవ్యాసక్తులను చేస్తాయి. అందరూ మానసికంగా దృఢంగా ఉండరు. మానసిక అదైర్యులు ఉంటారు. వారిని కనిపెట్టుకుని ఉండాలి. వీలైనంత వరకు వారితో గడుపుతూ మాటల ఉత్ప్రేరకాన్ని అందిస్తుండాలి. మనసు నెమ్మదించిన మనిషికి ఆకాశమే హద్దు. వారివి ఎల్లలు లేని పరుగులు అవుతాయి.
కొంతమంది పరిస్థితుల ప్రభావానికి లోనై కుంగిపోతుంటారు. సమస్యలను భూతద్దంలో చూసి భయపడుతూ విలువైన జీవితాన్ని కోల్పోవడానికి సిద్ధపడతారు. మాటలతో వారిలోని నైరాశ్యాన్ని పారదోలే వెలుగులు పంచాలి.

అశోకవనంలో సీత. చుట్టూ శత్రు రాక్షసగణం. నా అన్నవారు లేరు. ఆ విపత్కర పరిస్థిని ఊహించుకుంటేనే మన మనసు కకావికలమవుతుంది. అలాంటి ప్రదేశంలో, ఆ సమయంలో త్రిజట చెప్పిన స్వప్న వృత్తాంతం సీతమ్మ మనసుకు ఎంతటి సాంత్వన చేకూర్చి ఉంటుందో కదా. రామరావణ యుద్ధానంతరం సీతమ్మతల్లి అయోధ్యకు వెళ్ళినా త్రిజటను మరిచిపోగలదా?

మాటలకన్నా చేతలు ముఖ్యమంటారు గాని, మాటలకున్న ప్రాధాన్యం ఇంతా అంతా కాదు. గురువుగారి మాటలు శిష్యుల మనసు పొరల్ని ఆప్యాయంగా స్పృశిస్తూ విద్యాభ్యాసం చేయిస్తాయి. భవిష్యత్‌ జీవితానికి పటిష్ఠమైన బాటలు వేస్తాయి. వైద్యుడి మాటలు ఔషధం కన్నా ముందు రోగిపై పనిచేసి ఊరట కలిగిస్తాయి. వ్యాధిని నయం చేస్తాయి. దేశరక్షణలో గాయపడిన సైనికుడికి, మాటలు, పాటలతో కృతజ్ఞతను వెల్లడించే పౌరుల ఓదార్పు గొప్ప ఉపశమనాన్నిస్తుంది. మాటలు మనిషికి భగవంతుడిచ్చిన వరం. మాటలతో మరో మనసుకు ఉపశమనాన్ని ఇవ్వగలగడం మానవజన్మకు ప్రయోజనం సిద్ధింపజేస్తుంది.

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని