Ramana Maharshi: రమణోపదేశం

రమణుల ఉపదేశం సరళ గంభీరం. కర్తతో ప్రారంభమై కర్మ విచారణ సాగి ఆత్మవిచారంతో ముగిసే వారి ఉపదేశాలసారం అమృతతుల్యం. మనిషి ఏ కర్మ చేసినా దాన్ని భగవదర్పితం చేయాలి. సమర్పణవల్ల

Updated : 29 Jul 2022 02:32 IST

రమణుల ఉపదేశం సరళ గంభీరం. కర్తతో ప్రారంభమై కర్మ విచారణ సాగి ఆత్మవిచారంతో ముగిసే వారి ఉపదేశాలసారం అమృతతుల్యం. మనిషి ఏ కర్మ చేసినా దాన్ని భగవదర్పితం చేయాలి. సమర్పణవల్ల బంధం దూరమైపోతుంది. బంధం లేనప్పుడు వియోగం ఉండదు. కర్మలు నిస్వార్థంగా ఉండాలి. స్వార్థరహిత కర్మలే ఆనందాన్ని పంచుతాయి.

ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు రమణులు ఇలా చెప్పారు- శరీరం, వాక్కు, మనసు... ఈ మూడింటినీ సాధకుడు తన సాధనలో జాగ్రత్తగా వాడుకోవాలి. శరీరం ద్వారా పూజ చేయాలి. వాక్కుతో జపం చేయాలి. మనసుతో చింతన చేయాలి. దేహంకన్నా వాక్కు, దానికన్నా మనసు, తద్వారా జరిగే పూజ, జపం, చింతనల్లో ఒకదానికంటే మరొకటి ఉత్తమమైనవి. పూజ అంటే దేవుడి ముందు కూర్చుని పత్రి, పువ్వు వెయ్యడమే కాదు. సమస్త జగత్తును పరమేశ్వర రూపంగా భావించాలి.

రమణుల బోధ ప్రకారం- మొదట ఏదైనా మంత్రాన్ని బిగ్గరగా పలుకుతూ అటుపై దానికన్నా మంద్రస్థాయిలో అనుకొంటూ ఆ తరవాత మౌనాన్ని ఆశ్రయించి సాగించే ధ్యానం సర్వోత్కృష్టమైనది. ఉత్తమమైన ధ్యానం వల్ల కోరికల తీవ్రత క్రమేపీ నశించి ఆలోచనా ప్రవాహపు ఒరవడి తగ్గి నిశ్చల స్థితి కలుగుతుంది. ధ్యానం వల్ల మనసు మన అధీనంలోనే ఉంటుంది. ఒకసారి అంతర్ముఖ స్థితి కలిగితే బాహ్య వస్తువులపై ఆశ నశిస్తుంది. అదే ధ్యాన ఫలం.

ధ్యానం క్రమపద్ధతిలో సాగాలి. అంటే యజ్ఞగుండంలో ధార తెగకుండా, ఆగకుండా నేతిధార ఏ విధంగా సాగుతుందో, సాగర సంగమం జరిగేవరకు ఎన్ని మలుపులు వచ్చినా నదీ ప్రవాహం ఎలా ముందుకు సాగిపోతుందో అదేవిధంగా ధ్యానం జరగాలి. ధ్యానబలం చాలా గొప్పది. ధ్యానం అంటే మనలో మనం ఉండటమే. యోగం అంటే మనతో మనం ఉండటం. మనసు లక్ష్యంవైపు ఏకాగ్రంగా నడవాలి. అవాంతరాలకు భయపడకూడదు. నేను వేరు, దైవం వేరు అనుకోవడం ద్వైతం. వేరు కాదు... అనే స్థితిలో ఉండగలగడం అద్వైతం. నామరూపాల్లో తిరుగులేని నమ్మకం ఉండటం అనన్య భక్తి.

మనిషి ధ్యానం ద్వారా భావరహిత స్థితికి చేరుకోవాలి. ప్రాపంచిక, మానసిక కార్యకలాపాలనుంచి విముక్తి పొందిన సాధకుడు ప్రశాంత చిత్తుడై సదా ఆనందంగా ఉంటాడు. స్థూలంగా భగవద్గీత బోధించింది ఇదే. కర్మయోగంలో అహం నశించి, భక్తి యోగంలో అహం స్ఫురణ కలిగి, జ్ఞానయోగంలో ఆత్మానుభవం పొంది సాధకుడు తన మనసును హృదయంలో లయంచేసి అద్వైత భావనలో నిరామయుడై ఉంటాడు అంటారు రమణులు.

ఏకాంతంలో సమూహాన్ని, సమూహంలో ఏకాంతాన్ని అనుభవించగలిగితే అదే ఆత్మనిష్ఠ అంటారు రమణ మహర్షి. అహం అంతమైనవేళ ఆత్మను ఎరిగి ఉండటమే అసలు తపస్సు. చీకటి లేదు అంటే ఉన్నది వెలుగేనని అర్థం చేసుకొమ్మంటారు ఆయన. యాభైనాలుగు సంవత్సరాలపాటు ఆత్మనిష్ఠలో ఉండటం ఒక్క భగవాన్‌ రమణ మహర్షులవారి విషయంలోనే జరిగింది. సాధన, శోధన అవసరం లేకుండానే ఆత్మనిష్ఠలో సంచరించిన రమణుల శుద్ధ వాక్కే మనందరికీ ఉపదేశ సారం. అదే రమణోపదేశం.

- యం.సి.శివశంకర శాస్త్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని