Swami Vivekananda: ఆత్మభావన

ఉపనిషత్తులు ఆత్మనే జీవుడికి యజమానిగా చెబుతాయి. ఆ యజమాని ఎప్పుడూ ప్రస్ఫుటం కాడు. నిత్య తపస్విలా, మహర్షిలా, పరమశివుడిలా, వల్మీకంలోని వాల్మీకిలా ప్రచ్ఛన్నంగా ఉంటాడు. శరీరంలో ఉండి

Updated : 30 Jul 2022 01:40 IST

ఉపనిషత్తులు ఆత్మనే జీవుడికి యజమానిగా చెబుతాయి. ఆ యజమాని ఎప్పుడూ ప్రస్ఫుటం కాడు. నిత్య తపస్విలా, మహర్షిలా, పరమశివుడిలా, వల్మీకంలోని వాల్మీకిలా ప్రచ్ఛన్నంగా ఉంటాడు. శరీరంలో ఉండి సర్వం తానే నడిపిస్తున్నా, ఎక్కడా తన ఆనవాళ్లు అగుపించనీయడు. ‘ఆత్మవత్‌ సర్వభూతాని’ అన్నట్లు చరాచర జగత్తులో భౌతిక స్వరూపాలన్నింటిలో ఆత్మ అణు రేణువులా, జ్యోతి బిందువులా ఉంటుందని వేదాంతాలు వివరిస్తాయి.

భౌతిక బాధలన్నింటికీ ఆత్మ అతీతమైనదని భగవద్గీత చెబుతుంది. ‘నైనం ఛిందంతి శస్త్రాణి’ బోధ అదే. శరీరమే సర్వస్వమని భావించే మనిషికి ఆత్మ గురించి అంత తేలిగ్గా అర్థం కాదు. ఎన్ని ఆధ్యాత్మిక సాధనలు, దీక్షలు, పూజలు, పారాయణలు చేసినా ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం కలగడం అంటే- ఆత్మ గురించి తెలుసుకోవడం కాదు. ఆత్మ భావనతో జీవించడం.

ఆత్మభావన అంటే, నేను శరీరాన్ని కాదు- అనే ఎరుక అనుక్షణం స్థిరంగా ఉండటం. అది ఏ మాత్రం చెదిరినా మాయ మనల్ని లోబరచుకుంటుంది. అందుకే ఆంజనేయుడు తన ఆత్మలో కొలువై ఉన్న ఆత్మారాముడి మీదనే సమస్త శక్తుల్ని కేంద్రీకృతం చేసి, ఆత్మానందంలో మునిగిపోతాడు.

ఎవరు శరీర భావనతో ఎలాంటి కర్మలు చేస్తారో వారు ఆ కర్మ ఫలాలను అనుభవించాల్సి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దైవ సృష్టిలోని చర్యలకు ఒకరి నమ్మకాలతో సంబంధం లేదు. అవి తమ పద్ధతిలో జరిగిపోతుంటాయి. వాటిని ఎవరూ శాసించలేరు. మార్చలేరు. వేలాది సంవత్సరాల నుంచి ఆత్మజ్ఞాన సంపద భారతీయుల సొత్తుగా పరిఢవిల్లుతోంది. ఇది కేవలం భారతీయులకే ప్రత్యేకం. అందుకే ప్రపంచంలోని అనేక మంది ఆధ్యాత్మికవేత్తలు భారతీయత వైపు ఆకర్షితులవుతున్నారు. మన జ్ఞానామృతం రుచి తెలిశాక దానికి వశులైపోతున్నారు. అంకిత మనస్కులై నిత్య సాధకులవుతున్నారు. వివేకానంద, మహర్షి అరవింద, శ్రీరమణులు వంటి మహనీయుల ఆధ్యాత్మిక వెలుగులు ప్రపంచమంతా కాంతులు వెదజల్లడానికి కారణం- భారతీయ ఆత్మజ్ఞాన విజ్ఞాన ఘనత.

ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞాన సంపద మనదేశంలో కొల్లలుగా ఉన్నా, పట్టించుకొని ప్రయోజనం పొందేవారు కొద్దిమందే ఉన్నారు.

మనిషి తన బాధ్యతల బరువు మోస్తూ ప్రయాసతో రోజులు గడుపుతుంటాడు. శరీర సంబంధమైన, బాంధవ్య బంధాలకు సంబంధించిన విషయాలతోనే కాలం గడిచిపోతుంటుంది.

శ్రీరమణుల వంటి ఆత్మగురువులను అనుసరించేవారికి ఆత్మజ్ఞాన వివేచన కలుగుతుంది. ధ్యానంలో కూర్చుని, నిమీలిత నేత్రాలతో ఆత్మావలోకనం కోసం గట్టి కృషి చేస్తున్నకొద్దీ దారి కనిపిస్తుంది. భౌతిక మాయ క్రమంగా కరిగిపోతుంది.

‘నేను శరీరాన్ని కాదు ఆత్మను’ అనే స్థిర భావన కలగడమే మన ధ్యానఫలం. అప్పుడు మనం కర్మదేహాలు పొందడమన్నది ఉండదు. కేవలం ఆత్మజ్యోతిగా, రమణులవలె నేరుగా పరంజ్యోతిలో లీనమైపోతాం. అదే మోక్షం!

- కె.విజయలక్ష్మి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని