జీవిత స్వరూపం

జీవితం చపలమైనది. దానికి స్థిరత్వం లేదు. అది క్షణికమైనదని, నీటిమీద బుడగలా క్షణంలో మలిగిపోయేదని అందరికీ తెలుసు. ఆ పరిస్థితి అందరికీ వస్తుందనీ తెలుసు. కానీ, మృత్యువు అంటే చాలామందికి

Published : 31 Jul 2022 00:54 IST

జీవితం చపలమైనది. దానికి స్థిరత్వం లేదు. అది క్షణికమైనదని, నీటిమీద బుడగలా క్షణంలో మలిగిపోయేదని అందరికీ తెలుసు. ఆ పరిస్థితి అందరికీ వస్తుందనీ తెలుసు. కానీ, మృత్యువు అంటే చాలామందికి భయం. దానికి కారణం- పుట్టిన ప్రతి ప్రాణీ ఎప్పుడో ఒకప్పుడు మరణించక తప్పదు. మృత్యువు నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరనేది నిష్ఠుర సత్యం.

శిథిలమైన వస్తువు నాశనం అయినట్టే, జీర్ణమైన దేహాన్నుంచి ప్రాణ పరిత్యాగం కావడమే మరణం. నిజానికి సృష్టి గమనానికి ఆధారం దేహం. దాని నుంచే తల్లిదండ్రులు, పుత్రులు, బంధువులు లాంటి బంధాలు ఏర్పడతాయి. సృష్టిలో ఉపాధిగా ఉన్న ప్రతి వస్తువూ తన కర్తవ్యం ముగిశాక శిథిలం కావాలి. అలా అయితేనే సృష్టి విస్తరణకు, కొత్త ఆవిష్కరణలకు అవకాశం ఉంటుంది. ఆ అవకాశం మరణం వల్లనే సాధ్యమవుతుంది.

‘ప్రాణులకు సంయోగం కలిగినట్లే వియోగమూ తప్పక ఎదురవుతుంది. కాబట్టి వియోగంలో దుఃఖించడం అవివేకం అవుతుంది’ అని వేదాంతులు చెప్పారు. ఈ విధమైన జీవితానుభవాన్ని ప్రతివ్యక్తీ తప్పక పొందవలసి ఉంటుందని రామాయణంలో నిరూపితమైంది.

భరతుడు చిత్రకూటం వెళ్ళి శ్రీరాముణ్ని రాజ్యభారం స్వీకరించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు శ్రీరాముడు భరతుడికి జీవిత స్వభావాన్ని గురించి ఉపనిషత్తుల సారాంశాన్ని ఉదాహరణలతో వివరించాడు. రామభరతుల ఆ సంవాదం విని జాబాలి అనే ముని జీవిత స్వరూపాన్ని వివరించాడు. ‘ఎంత కష్టపడి పోగు చేసుకున్నవైనా ఏదో ఒకనాడు క్షయం కాక తప్పదు. ఉన్నత స్థితులు సైతం పతనాన్ని పొందక తప్పదు. చెట్టున పండిన పండు కింద పడటమెంత సహజమో, గట్టి స్తంభాలతో కట్టిన ఇల్లు సైతం జీర్ణించి క్రమంగా నేల కూలుతుంది. పుట్టిన మనిషికి మరణమూ అంతే సహజం’ అని బోధించాడు.

గడచిన కాలం తిరిగి రాదు. అహోరాత్రాలు మానవుడి ఆయుష్షును తగ్గిస్తాయి. మనిషి ఏ పని చేస్తున్నా, ఆయుర్దాయం తగ్గుతూ ఉంటుంది. అది నిరంతరం జరిగే సహజ ప్రక్రియ. మనిషి ఆ నిజాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడడు. మృత్యువు ప్రతి వ్యక్తినీ నీడలా వెంటాడుతూ ఉంటుంది. రుతువు రాగానే పువ్వులు, కాయలు, ఫలాలు వస్తాయని సంతోషిస్తాడేగాని, జీవితకాలం క్షయమవుతుందని గుర్తించడనేది చేదు నిజం.

ప్రవాహంలో కలిసిన రెండు కర్రలు కొంతదూరం కలిసి వెళ్ళి క్రమంగా విడిపోయినట్టే భార్యాపిల్లలు బంధువులు ఐశ్వర్యాలు కొంతకాలం కలిసి ఉండి, క్రమంగా విడిపోవడం అనివార్యం. లోకంలో ఏ ప్రాణీ దీనికి అతీతం కాదు. కాబట్టి మరణించిన వారికోసం దుఃఖించడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు.

బాటసారి ఒకచోట ఆగి, మర్నాడు ఆ నివాసాన్ని విడిచి ప్రయాణమైనట్టే ప్రతి వ్యక్తీ తల్లి, తండ్రి, ఇల్లు, ధనం... ఇలా అన్నింటినీ, అందరినీ విడిచిపెట్టి మరో జన్మ పొందుతాడు. అవన్నీ బాటసారికి మజిలీలే తప్ప స్థిరమైన నివాసాలు కాదు.
వాలి మరణానికి దుఃఖిస్తున్న తారను ఓదారుస్తూ, హనుమ జీవిత అస్థిరత్వం గురించి ఉపదేశిస్తాడు. ‘జీవితం నీటి బుడగతో సమానమైనది. ప్రాణులు పుట్టడం, మరణించడం అనేవి అనియతాలని తెలుసు కదా? కాబట్టి ఎవరి గురించి ఎవరూ విచారించకూడదు’ అన్నాడు.

కూర్చుకున్న ధనం, ఉన్నత స్థితులు పతనం కాక తప్పవు. అలాగే సంయోగాలు వియోగాలతో అంతమవుతాయి. మరణంతో జీవితం ముగుస్తుంది. నేను, నాది అనే భ్రాంతిలో మనిషి జీవిస్తున్నాడు. ఆ విధాత సృష్టిలో ఎన్నో అందాలు, ఆనందాలు, వేడుకలు సృష్టించాడు. వాటిని చూసి మనిషి అవన్నీ శాశ్వతం అనుకుంటాడు. కానీ, కన్ను మూసి తెరిచేలోగా అన్నీ అదృశ్యమవుతాయని గ్రహించడు!

- వి.ఎస్‌.రాజమౌళి

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని