Antaryami: పరమాత్మ దర్శనం

పురాణ కాలంనాటి హిరణ్య కశిపుడి నుంచి నేటి అధునాతన నిరీశ్వర వాదుల వరకు సంధించే ప్రశ్న ఒక్కటే- ‘దేవుడున్నాడా! ఉంటే ఎక్కడ? కనిపించడేం...’ అని. ప్రహ్లాదుడు పుట్టుకతోనే అచంచల భక్తితో, సద్వర్తనతో దైవాన్ని దర్శించాడు కనుక అణువణువునా నిండి నిబిడీకృతమైన దైవం ఎక్కడ లేడని చెప్పమంటావని తండ్రిని ప్రశ్నించాడు....

Updated : 02 Aug 2022 07:30 IST

పురాణ కాలంనాటి హిరణ్య కశిపుడి నుంచి నేటి అధునాతన నిరీశ్వర వాదుల వరకు సంధించే ప్రశ్న ఒక్కటే- ‘దేవుడున్నాడా! ఉంటే ఎక్కడ? కనిపించడేం...’ అని. ప్రహ్లాదుడు పుట్టుకతోనే అచంచల భక్తితో, సద్వర్తనతో దైవాన్ని దర్శించాడు కనుక అణువణువునా నిండి నిబిడీకృతమైన దైవం ఎక్కడ లేడని చెప్పమంటావని తండ్రిని ప్రశ్నించాడు. అనివార్య స్థితిలో నిరూపణకు సాధారణ స్తంభం నుంచి స్వామిని వెలికి రప్పించాడు. దైవం అనిర్వచనీయమైన మానవాతీత శక్తి. ఆ శక్తి ప్రపంచాన్ని కాపాడి రక్షిస్తోందని భక్తుల విశ్వాసం. కాసే ఎండ, కురిసే వాన, పండే పంట, తాగే నీరు, పీల్చే గాలి కరుణతో మనకిచ్చిన ప్రసాదాలుగా భావించి దైవానికి కృతజ్ఞుడై ఉంటున్నాడు మనిషి.

దేవుడనేవాడే లేడని, మానవాతీత శక్తిగా కొందరు సృష్టించిన అభూత కల్పనను, మూర్ఖంగా నమ్మినవారు సమాజాభ్యుదయాన్ని తిరోగమన పథంలో నడిపిస్తున్నారని ఒక విమర్శ. తమ వాదనే సరైనదని, దాన్ని తేటతెల్లం చేసి లోకానికి అందించి ప్రజల్లో సమూలమైన మార్పు తేవాలని వీరి భావన. తమ సిద్ధాంతాల ద్వారా ప్రపంచానికి కనువిప్పు కలిగించాలని వీరి ఆరాటం. తరచి చూస్తే సృష్టిలో ప్రతి అణువూ దైవత్వాన్ని నింపుకొని ఉన్నదే. ప్రతి ప్రాణీ దైవసమానమే. ప్రకృతి అందించే ప్రతి వనరు మానవ మనుగడకు దోహదపడుతుంది. ధాన్యపుగింజ మొన నుంచీ బ్రహ్మాండమంతా ఆవరించి ఉన్న శక్తి రూపమే పరమాత్మ అని ఆధ్యాత్మికవేత్తలు తేల్చి చెప్పారు. ఏయే తేజో రాశులలో తాను నిండి ఉన్నాడో భగవద్గీతలో స్పష్టం చేశాడు శ్రీకృష్ణుడు.
దైవం మానుష రూపేణా అని, దయగల హృదయమే భగవన్నిలయం అని వేదవాక్కు. దేహమే దేవాలయమని, జీవుడే దేవుడని గ్రహించినవారు దైవం ఉనికిని ప్రశ్నించరు. సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు చిరుదీపంతో వస్తువును వెదకడం అజ్ఞానమని వేమన ఏనాడో చెప్పాడు. కళ్లముందు కదలాడే తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు దైవసమానులు. వారిని గౌరవించి ఆరాధిస్తే దైవార్చన చేసినట్లే.

మానవుడే మహనీయుడు. మానవసేవే మాధవసేవ అన్న సూక్తిని మరచి అపమార్గం వైపు నడుస్తున్నాడు మనిషి. తనలోని దైవత్వాన్ని దూరం చేసుకొని దానవుడిలా సంచరిస్తున్నాడు. నిండుమనసుతో గుప్పెడు మెతుకులు పెట్టినవారిని, కష్టంలో సాటివారి కన్నీరు తుడిచినవారిని, కూలిపోతున్న జీవితాల్ని నిలబెట్టిన వారిని సాయం పొందిన వ్యక్తి కృతజ్ఞతతో పలికే ఆశీర్వచనం- దైవంలా రక్షించావని, దేవుడిలా ఆదుకున్నావని. ధర్మబద్ధమైన జీవితం గడిపేవారిలో, సమాజ హితం ఆశించేవారిలో నీతి నియమ పాలన చేసేవారిలో, జ్ఞాన బోధలనందించే గురు సమానులలో దైవం దర్శనమిస్తాడు. పెద్దలు బోధించిన నైతిక విలువలు, శాంతి సహనాలు, త్యాగం లాంటివి సంఘంలో వ్యక్తి మెలగే ప్రవర్తన సవ్యంగా సాగేందుకు దైవగుణాలుగా ఉపకరిస్తాయి. ఇవేమీ ఆలోచించని కొందరు పనిలోనే పరమాత్మను దర్శిస్తారు. వీరికి తమ వృత్తే దైవం. విలువైన కాలమే భగవంతుడు. విగ్రహారాధనలు, దేవాలయ సందర్శనలు జప తప ధ్యాన యాగాలు మనసుకు ఆనందాన్నిస్తే ఆధ్యాత్మిక బోధలు మానసిక ప్రశాంతిని కలిగిస్తాయి. సత్ప్రవర్తనతో మెలగే మానవులంతా మాధవులే. దేశాన్ని రక్షించే సైనికులు, ఆహారాన్నందించే కర్షకులు, విద్యను బోధించే గురువులు, సేవాగుణంతో ఆరోగ్యాన్ని పరిరక్షించే వైద్యులు... ఇలా అందరూ దేవుడి రూపాలే. వితండవాదంతో, పనికిరాని సిద్ధాంతాలతో ఇతరులను నొప్పింపక, స్వార్థాన్ని తరిమికొట్టి ప్రేమ, దయతో సాటి మనిషిని ఆదరిస్తే దైవం మనలోనే స్పష్టంగా కనిపిస్తాడు.

- మాడుగుల రామకృష్ణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని