Antharyami: కారణం ఏమిటి?

ఈ లోకంలో అకారణంగా ఏదీ జరగదు. అలాగే మన జీవితాల రూపకల్పనకు సైతం ఏదో ఒక నిమిత్త కారణం ఉంటుంది. బాల్యమంతా దానికి సంబంధించిన ఏ ఆలోచనా లేకుండా సాగిపోతుంది. కొంత

Updated : 03 Aug 2022 02:48 IST

ఈ లోకంలో అకారణంగా ఏదీ జరగదు. అలాగే మన జీవితాల రూపకల్పనకు సైతం ఏదో ఒక నిమిత్త కారణం ఉంటుంది. బాల్యమంతా దానికి సంబంధించిన ఏ ఆలోచనా లేకుండా సాగిపోతుంది. కొంత వయసు వచ్చేవరకు తన ఎదుగుదలకు, శరీరభాగాల కదలికకు సైతం ఏదో ఒక శక్తి మూలమై ఉందనే ఊహ కలగదు. ఆ దివ్యశక్తినే అందరూ తలో రకంగా భావిస్తుంటారు. వయసు పెరిగేకొద్దీ కలిగే రకరకాల అనుభవాల సారంతో కొంత వివేకం కలిగి, మానవజన్మ ఏదో ఒక విధ్యుక్తధర్మ నిర్వహణ నిమిత్తం ప్రాప్తించిందనే స్పృహ ఏర్పడుతుంది. అంతవరకు తన గురించి తనకే తెలియని పసివాడిలాగే, యాంత్రికంగా జీవితం సాగిపోతుంటుంది.

అద్భుతమైన యంత్రంలా, వాహనంలా, బహుళార్థక సాధక పరికరంలా ఉపకరించే మానవ శరీరం- పరమాత్మ ప్రసాదితం. ఆ దివ్యానుగ్రహంతోనే హృదయస్పందన, శ్వాసక్రియలతో కూడిన జీవచైతన్యం సాగుతుంటుంది. జీవరాశులన్నీ పరమాత్మ ప్రమేయంతో తమతమ కర్మలు చేస్తుంటాయి. శరీరాల పరిమాణంలోను, పరిణామంలోను అంతరం ఉన్నా అన్నింటిలోనూ పరమాత్మ అంశ మాత్రం ఒకటే. అన్నీ ఆయన బంధువర్గంలోనివే. అన్నింటిలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పరిణామం చెందినవాడు మానవుడు. మానవజన్మ ఏ నిమిత్తం ఎంత సామర్థ్యంతో ప్రాప్తించిందో అనే ఎరుక కూడా సాధించగల సమర్థుడు. ఆ ఎరుకతో తన ధర్మాచరణే ధ్యేయంగా జీవితం సాగించే మానవుడికి పరమాత్మ అనుగ్రహమైన ఆధ్యాత్మిక శక్తి బలంగా రూపొందుతుంది. జీవన యానానికి ఉపకరించే శారీరక, మానసిక శక్తులకు మూలం ఆధ్యాత్మిక శక్తి. జీవితం సార్థకం చేసుకోవాలంటే ఆధ్యాత్మికం, మానసికం, శారీరకం అనే మూడు విధాలైన శక్తులు కూడా అవసరమే. మూడింటి సహకారంతోనే జీవితాన్ని ప్రయోజనకరం చేసుకోవచ్చు. వాటిమధ్య సమన్వయం సాధించలేని జీవితం కేవలం యాంత్రికంగా సాగుతున్నట్లు ఉంటుంది. యాంత్రికమైన జీవితంలో ఏదీ కూడా స్వయంకృషితో సాధించిన ఆత్మ తృప్తి కలగదు. ఆనందంగా జీవిస్తున్న అనుభూతి కలగదు. యాంత్రికంగా సాగుతున్నట్లు కనిపించే జీవితానికి వెనక ఏదో ఒక నిమిత్త కారణం ఉంటుంది.

విశ్వంలో భాగమైన ప్రతీ జీవికి ఏదో ఒక విశిష్టమైన ప్రజ్ఞ ఉంటుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది వేదవాక్కు. తన సృష్టిలో జీవులన్నీ వాటివాటి ప్రజ్ఞతో పరస్పరం సహకరించుకుంటూ ఆనందంగా ఉండాలని, లోకాస్సమస్తా సుఖినోభవంతు అని సృష్టికర్త ఆశించడం సహజం. ఆయన సంకల్ప మార్గంలో సాగడమే ఆధ్యాత్మిక పరమావధి. మన సంకల్పం పరమాత్మ సంకల్పానికి అనుగుణంగా ఉన్నంత కాలం మనకు ఆయన దివ్యశక్తి తోడవుతుంది. ఆధ్యాత్మిక శక్తిప్రదాత ఎవరో తోడున్నారనే విశ్వాసంతో ఏ పని చేపట్టినా విజయం పొందగల మనోస్థైర్యం కలుగుతుంది.

పరమాత్మ ప్రమేయం లేకుండా ఏ కార్యమూ జరగదు. తాము ఉన్నత స్థితికి చేరాలంటే కేవలం తమ ప్రజ్ఞే కాదు, పరమాత్మ దివ్యానుగ్రహం సైతం పొందాలని గ్రహించడమే వివేకం. అది సాధించడానికి తగిన కర్తవ్య నిర్వహణతో జీవించాలి. అప్పుడే మానవ జన్మ ప్రాప్తించిన నిమిత్త కారణానికి న్యాయం చేసినట్లు అవుతుంది.

ఏ సంకల్ప సాధనకై ఎంత కృషి చేయవచ్చు అనే వెసులుబాటు మన చేతిలోనూ కొంత ఉంటుంది. ఆ స్వేచ్ఛ అద్భుతమైన వరం లాంటిది. ఆ స్వేచ్ఛ వినియోగంలో వరప్రదాత సంకల్పాన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. అది విస్మరించకుండా చేసే కృషి వల్ల లభించిన వరాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది. భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఆ దివ్యానుగ్రహ సాధన ఫలితంగా పొందే ఆనందం సుదీర్ఘకాలం కొనసాగుతుంది. మానవజన్మ సార్థకం అవుతుంది!

- దువ్వూరి రామకృష్ణ వర ప్రసాదు

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని