Antaryami: ధ్యానంతో సాగు...

ఆనందం, శాంతి, సౌఖ్యాలు అందరూ కోరుకుంటారు. వస్తువు, వాహన, ఆస్తిపాస్తుల్లో అవి దొరుకుతాయని భావిస్తారు. అందుకోసం ఎన్నో తిప్పలు, పడరాని పాట్లు పడతారు. జీవన ప్రమాణాల్నీ పక్కన

Updated : 04 Aug 2022 03:03 IST

ఆనందం, శాంతి, సౌఖ్యాలు అందరూ కోరుకుంటారు. వస్తువు, వాహన, ఆస్తిపాస్తుల్లో అవి దొరుకుతాయని భావిస్తారు. అందుకోసం ఎన్నో తిప్పలు, పడరాని పాట్లు పడతారు. జీవన ప్రమాణాల్నీ పక్కన పెడతారు. నీతి నియమాలకు స్వస్తి పలుకుతారు. నిద్రాహారాలు మానేస్తారు. బతుకు పొడవునా ఆత్రుత, ఆరాటాలతో ఆస్తులు కూడబెడతారు. తీరా చూస్తే ఏదో వెలితి, వీడని అశాంతి పీడిస్తాయి.

మనశ్శాంతి కోసం మరో ఆలోచన తీర్థయాత్రల ప్రయాణం కడుతుంది. అక్కడికి చేరాక చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద ఉంటుంది. అయినప్పటికీ దేవాలయ ప్రాంగణంలోని ఆహ్లాద వాతావరణం, ధూప దీప నైవేద్యాల ఘుమఘుమలు, స్వచ్ఛమైన హృదయాల ఆత్మీయ పలకరింపులు, సజ్జన సాంగత్యం... ఇవన్నీ యాత్రికుల మనసుపై ఎంతో కొంత ప్రభావం చూపుతాయి.

యాత్రా పయనంలో ఎత్తయిన గోపురాలు, గుళ్లు ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. శతాబ్దాల నాటి సాంస్కృతిక వైభవం, శిల్పకళా నైపుణ్యం, మనోహర దృశ్య కావ్యాల నిశ్శబ్ద గానం... మనసుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఆ క్షణాల్లో మనసు చెలమలో ఆనందం ఊట ఊరుతుంది. ఆ మాత్రానికే మనసుకు కలిగిన ఊరట, శారీరక అలసట తిరిగి ఇంటిముఖం పట్టిస్తాయి. ఇంటి గుమ్మం తొక్కాక షరా మామూలే. మళ్ళీ యాంత్రిక జీవితం మొదలవుతుంది.

ఏళ్లు గడుస్తాయి. జీవితమూ నిస్సారంగా వెళ్లిపోతూంటుంది. మనసు క్రమంగా మెత్తదనం కోల్పోతూ మొద్దుబారడం ఆరంభిస్తుంది. ఏదైనా మొక్క దశలోనే చెప్పినట్టు వింటుంది. మహావృక్షమైనాక ఆధిపత్య ధోరణి అవలంబిస్తుంది. అహంభావులు తాము అందరికన్నా అధికులమని విర్రవీగుతారు. ఏ భయం లేకుండా పూర్తి రక్షణలో ఉన్నామని  ఊహించుకుంటారు. కాని, తమ పక్కనే ప్రమాదాలు పొంచి ఉన్నాయన్న సంగతి ఎరుగరు. అహంకారం అనేది దట్టమైన చీకట్లు కమ్ముకున్న పాడుబడ్డ గృహం లాంటిది. అందులోకి అరిషడ్వర్గాల ముఠా చేరి అసాంఘిక కార్యకలాపాలు జరుపుతుంది. విష సర్పాలు దూరి కాపురముంటాయి. ఆ ఇల్లంతా దయ్యాల కొంపగా మారుతుంది. మనసు ఆ రీతిన చెడి మలినం అవుతుంది. మనిషి మానసికంగా అనారోగ్యం పాలవడానికి ఇదంతా మూలకారణం అవుతుంది. తదనుగుణంగా శారీరక ఆరోగ్యమూ దెబ్బతింటుంది. స్వస్థత కోసం వైద్యుల్ని సంప్రదిస్తారు. యోగా గురువుల్నీ ఆశ్రయిస్తారు. ధ్యానం చెయ్యడమూ మొదలు పెడతారు. ఆరోగ్యపరంగా ధ్యానం చెయ్యడం అంటే, రైతు తన చేనును సాగుచెయ్యడం లాంటిది. పొలంలోని కలుపును పీకిపారెయ్యడం లాంటిది. అప్పుడే తాను చల్లే ఎరువులు, కీటక నాశినులూ బాగా పనిచేస్తాయి.

బురదమయమైన నీళ్లలోకన్నా తేటతెల్లని నీటిలో రంగు ద్రావణం పోస్తే అంతటా బాగా వ్యాపిస్తుంది. అదే రీతిన అనారోగ్యం బారిన పడ్డ మనిషి సేవించే ఔషధాలు బలంగా పని చెయ్యాలంటే అతడి మనసు, శరీరం నిలకడగా ఉండాలి. ఇది ధ్యానం ద్వారా కుదురుతుంది. అందువల్లే, ఆధునిక వైద్య శాస్త్రాల్లోనూ యోగ, ధ్యానాంశాలు విశేష ప్రాధాన్యం పొందుతున్నాయి.

- మునిమడుగుల రాజారావు

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని