వరాలు కురిపించే తల్లి

సకల పురాణాలలోని కథలను సమగ్రంగా తెలిసిన ఒక మహర్షి పూర్వకాలంలో ఉండేవాడు. ఆయన పేరు సూతుడు. అతడు నైమిశారణ్యంలో శౌనకాది మహామునుల కోరికపై అనేక పురాణ కథలను

Published : 05 Aug 2022 00:53 IST

సకల పురాణాలలోని కథలను సమగ్రంగా తెలిసిన ఒక మహర్షి పూర్వకాలంలో ఉండేవాడు. ఆయన పేరు సూతుడు. అతడు నైమిశారణ్యంలో శౌనకాది మహామునుల కోరికపై అనేక పురాణ కథలను ప్రబోధించాడని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. అలా బోధించిన కథలలో అనేక వ్రత కథలు చోటుచేసుకొని ఉన్నాయి. వాటిలో ‘వరలక్ష్మీ వ్రతకథ’ కూడా ఒకటి.

పార్వతీదేవి స్త్రీల సౌభాగ్య, సంతానవృద్ధిని కాంక్షించి పరమేశ్వరుణ్ని ప్రార్థించిందని, దానికి సమాధానంగా పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతాన్ని పార్వతీదేవికి ప్రబోధించాడని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. పేరులోనే వరాలను దాచుకొన్న తల్లి వరలక్ష్మీదేవి. లోకంలో మనుషులు ఎప్పుడూ కోరేవి వరాలే కదా? అందుకే వరలక్ష్మీ వ్రతానికి ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. స్త్రీలు ఆచరించే ఈ ఉత్తమ వ్రతాన్ని శ్రావణపూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారంనాడు ఆచరించాలని నియమం. స్త్రీలు ఆజీవనాంతం సౌభాగ్యం ఉండాలని కోరుకుంటారు. సౌభాగ్యం అంటే ఆజీవన సహధర్మచరుడైన భర్త క్షేమంగా ఉండటం. ఏ లోటూ లేని సంపదలతో తులతూగే విధంగా ఉండటం. ఈ రెండూ సౌభాగ్యాలే. కేవలం సౌభాగ్యం ఉంటే చాలదు. సత్సంతానభాగ్యం కూడా ఉండాలి. మనసుకు నచ్చిన భర్త, ఎవరినీ యాచించకుండా ఉండే సంపద, గుణవంతులైన కొడుకులు, కూతుళ్లు ఉండాలని ప్రతి మహిళా కోరుకుంటుందనడానికి వరలక్ష్మీ వ్రతం ప్రత్యక్ష నిదర్శనం.

మానవులు దేవతలను నిత్యం భావించాలని, అలా భావించినప్పుడు దేవతలు సైతం మానవులవైపు చూస్తారని వారి కోరికలను వింటారని, వరాలను ప్రసాదిస్తారని భగవద్గీత చెబుతోంది. అలాంటి భావనాత్మకమైన ఉపాసనకు వరలక్ష్మీ వ్రతం ఒక నిదర్శనం. ఈ వ్రతకథలో చారుమతి (అందమైన మనసుగల స్త్రీ) ఒకనాటి రాత్రి వరలక్ష్మీదేవిని ధ్యానించి, నిద్రిస్తుంది. వెంటనే కలలో వరలక్ష్మీదేవి ప్రసన్నురాలై సౌభాగ్య సంతాన సమృద్ధిని ప్రసాదించిందని పురాణకథ.

ఆనందాలు సహజీవన సౌందర్యం వల్లనే సాధ్యం అనేది పురాణాల ప్రబోధం. తన వెంట కష్టసుఖాల్లో పాలుపంచుకొంటూ కలిసి నడిచే భర్త ఉండాలని స్త్రీ కోరుకుంటుంది. అడవులకైనా భర్తతో కలిసి ఆనందంగా వెళ్ళగలుగుతుంది. భర్తతో కలిసిన దాంపత్య జీవనంలోని ఫలాలుగా సంతానాన్ని వృద్ధి చేస్తూ వారితో ప్రేమానురాగాలను పంచుకొంటుంది. తన కుటుంబం సమృద్ధిగా గడవడానికి తగినంత సంపద కావాలని తపిస్తుంది. వీటన్నింటి ప్రతిరూపమే ఈ ఉత్తమోత్తమ వ్రతం.

లక్ష్మీదేవి స్థితికారకురాలు. ఆమె చూపు పడితే చాలు పట్టిందల్లా బంగారమే అవుతుందని మానవాళి విశ్వాసం. ఆమె కరుణాకటాక్షం కోసం తపించనివారు లేరు. ఆమె అనుగ్రహం కోసం ఉపాసించనివారు లేరు. అంతటి మహిమగల దేవత వరలక్ష్మి.
వ్రతాలు అనేవి నియమపూర్వక జీవన విధానానికి దారితీస్తాయి. పవిత్రంగా నిలవాలనే సందేశాన్ని అందిస్తాయి. జీవితం వ్యర్థకాలయాపన కోసం కాదని, అనుక్షణం సద్భావనలతో సదాశయాలతో సంప్రదాయ పరిరక్షణతో గడపాలని తెలిపే గుణాలకు నిలయాలు వ్రతాలు. వాటిని భక్తితో ఆచరిస్తే ఆనందాలు పుష్కలంగా లభిస్తాయి.

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని